చివరి ఆయకట్టుకు నీరందేనా .. ఏండ్లుగా కేఎల్ఐ కెనాల్స్​కు నో మెయింటెనెన్స్

  • మంత్రి, ఎమ్మెల్యేల ఫీల్డ్​ విజిట్​తో బయటపడుతున్న నిర్వహణ లోపాలు 
  • నిలదీతలతో నీళ్లు నములుతున్న ఇంజనీర్లు 

నాగర్ కర్నూల్, వెలుగు: కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్ట్​ కింద వానాకాలంలో 4.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు 700 చెరువులు నింపాలన్న ఇరిగేషన్​ అధికారుల లక్ష్యానికి నిర్వహణ లేని కాల్వలు అడ్డంకిగా మారుతున్నాయి. ఏండ్ల తరబడి మెయింటెనెన్స్​ లేక పిచ్చి మొక్కలు, పూడిక నిండి ప్రధాన కాల్వల సామర్థ్యం తగ్గిపోతోంది. కేఎల్ఐ ప్రాజెక్ట్​లోని మూడు ప్యాకేజీల్లోనూ విచిత్రమైన పరిస్థితి ఉంది.28, 30 ప్యాకేజీల కింద ఉన్న మెయిన్​ కెనాల్​పై ఏర్పాటు చేసిన పస్పుల, ఘన్​పూర్, బుద్దారం బ్రాంచ్​ కెనాల్స్​కు షటర్స్​ లేక నీరు ఎక్కువై తూముల వద్ద తెగిపోతుంటే.. 30 ప్యాకేజీలోని మిడ్జిల్, కల్వకుర్తి, వంగూరు, వెల్డండ మండలాలకు వెళ్లే ప్రధాన కాల్వలో నీటి ప్రవాహం గణనీయంగా పడిపోయింది.

 చెరువులు నింపడం పక్కన పెడితే, తమ పంటలకు నీరివ్వాలని రైతులు ఆందోళనకు దిగే పరిస్థితి కనిపిస్తోంది. 30 ప్యాకేజీ కింద ఉన్న మెయిన్​ కెనాల్​కు వాటర్​ ప్రెషర్​ పెరిగిందన్న వార్తలు వస్తున్నాయి. కేఎల్ఐ మెయిన్​ కెనాల్స్​పై ఏర్పాటు చేసిన పస్సుల, ఘన్​పూర్, బుద్దారం బ్రాంచ్  కెనాల్స్​కు ఎక్కడా షటర్లు ఏర్పాటు చేయలేదు. బ్రాంచ్​ కెనాల్స్​ గుండా వెళ్తున్న నీరంతా చివరికి వాగుల్లోకి 
చేరుతోంది.

మంత్రి, ఎమ్మెల్యేల పరిశీలన..

ఇటీవల  పస్పుల-- పాన్​గల్  బ్రాంచ్  కెనాల్​తో పాటు గంట్రావుపల్లి, ఖానాపూర్  మెయిన్​ డిస్ట్రిబ్యూటరీలు, కొండ్రావుపల్లి సబ్  డిస్ట్రిబ్యూటర్, నాగులపల్లి, మైలారం మైనర్  కాలువ, నర్సాయిపల్లి డిస్ట్రిబ్యూటర్  కాలువలను పరిశీలించిన మంత్రి పెరిగిన జమ్ము, గడ్డి తొలగించాలని ఇరిగేషన్​ సీఈ విజయభాస్కర్ రెడ్డిని ఆదేశించారు. కోడేరు, నాగులపల్లి, ముత్తిరెడ్డిపల్లి గ్రామాల్లో మెయిన్​ కెనాల్​ను పరిశీలించిన అనంతరం మంత్రి రైతులతో మాట్లాడారు. కేఎల్ఐ కింద రిజర్వాయర్లు లేక వందల కోట్లు ఖర్చు చేసి ఎత్తిపోసిన నీళ్లన్నీ డిండి ప్రాజెక్టు నుంచి తిరిగి కృష్ణా నదిలో కలుస్తున్నాయని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

 మరిన్ని రిజర్వాయర్లు, కెనాల్స్​ నిర్మించాల్సిన అవసరం ఉందని అంటున్న ఎమ్మెల్యే తెల్కపల్లి, లింగాల మండలాల్లోని కాలువలను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇక తాడూరు మండలం సిర్సవాడ అక్విడెక్ట్​ నుంచి కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల మండలం చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.. గుడిపల్లిగట్టు నుంచి లిఫ్ట్​ చేసిన నీరు 29 ప్యాకేజీలోని చివరి ఆయకట్టు వరకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. బిజినేపల్లి మండలంలో మార్కండేయ లిఫ్ట్  కింద సాగునీటిని ఎందుకు బంద్​ పెట్టారని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డి ప్రశ్నిస్తే ఇరిగేషన్​ అధికారులు ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పాన్​గల్​ బ్రాంచ్​ కెనాల్​ పరిధిలోని కాల్వలను పరిశీలించారు.

అంతా అస్తవ్యస్థం..

కేఎల్ఐ పరిధిలోని మూడు లిఫ్ట్​ల నుంచి నీటిని ఎత్తిపోస్తున్నా.. బ్రాంచ్​ కెనాల్స్​కు నీటి సరఫరాను నియంత్రించే వ్యవస్థ లేకపోవడంతో అతివృష్టి, అనావృష్టిలా పరిస్థితి తయారైంది. కేఎల్ఐ ప్రాజెక్ట్​ పూర్తి చేయడానికి, అదనపు రిజర్వాయర్ల కోసం మంత్రి, ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నా నిధుల కొరత, పెండింగ్​ బిల్లుల భారం ప్రధాన సమస్యగా మారుతోంది. ఆగస్టు​చివరి నాటికి కేఎల్ఐ ప్రాజెక్ట్, కాల్వల​నిర్వహణ, పంప్​ మోటార్ల రిపేర్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఏండ్లుగా నిర్వహణ కరువు..

జూన్​ నెలలో కేఎల్ఐ ప్రాజెక్ట్​ స్థితిగతులు, మూడు లిఫ్టుల్లో మోటార్లు, కాల్వల రిపేర్లు, నిర్వహణపై ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇరిగేషన్​ ఇంజనీర్లతో రివ్యూ నిర్వహించి ఇతర శాఖల ఇంజనీర్ల సాయంతో కేఎల్ఐ కెనాల్స్​పై సమగ్ర సర్వే నిర్వహించి రిపోర్ట్​ ఇవ్వాలని కలెక్టర్​ను ఆదేశించారు. కాల్వల స్థితి గతులపై ఇరిగేషన్​ శాఖ సర్వే నిర్వహించలేదు. అయితే ఫీల్డ్​లోకి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మేఘారెడ్డి వెళ్తున్నారు. కాల్వలు, స్ట్రక్చర్లు, పూడిక, పిచ్చి మొక్కలను పరిశీలించి, అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు ఇస్తున్నారు.

 కాల్వల నిర్వహణ, రిపేర్లు కాంట్రాక్ట్​ ఏజెన్సీలపై ఉన్నా వివిధ కారణాలతో మూడేండ్లుగా ఎటువంటి పనులు చేయకుండా వదిలేశారు. నిర్వహణ పనులు పూర్తి చేయించి కాంట్రాక్ట్​ ఏజెన్సీలకు చెల్లించే బిల్లుల నుంచి వాటిని మినహాయించాలని మంత్రి ఆదేశించినా ప్రాక్టికల్​గా అది వీలుకాదని ఇంజనీర్లు చెబుతున్నారు.