జనవరి దాకా జైలులోనే చిన్మయ్

  • ఆయన లాయర్​పై దుండగుల దాడి
  • బంగ్లాదేశ్​లో మిగతా హిందూ లాయర్లపై తప్పుడు కేసులు
  • లాయర్లు లేక విచారణ వాయిదా

ఢాకా:  బంగ్లాదేశ్‌‌లోని ఇస్కాన్‌‌కు చెందిన హిందూ లీడర్ చిన్మాయ్ కృష్ణ దాస్‌‌ బెయిల్ పిటిషన్‌‌పై విచారణ జనవరి 2వ తేదీకి వాయిదా పడింది. వాస్తవానికి ఆయన బెయిల్ పిటిషన్‌‌పై చటోగ్రామ్ కోర్టులో మంగళవారమే విచారణ జరగాల్సి ఉంది. కానీ, చిన్మాయ్ తరఫున వాదించడానికి ఒప్పుకున్న అడ్వకేట్ రామన్ రాయ్‌‌పై ఇటీవల ముస్లీంలు పాశవికంగా దాడి చేశారు. ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. దాంతో చిన్మాయ్ బెయిల్ పిటిషన్‌‌పై వాదించేందుకు మిగతా అడ్వకేట్లు నిరాకరిస్తు్న్నారు. 

చిన్మాయ్ పిటిషన్‌‌పై వాదించేందుకు లాయర్లు ముందుకు రాకపోవడంతో విచారణను కోర్టు జనవరి 2కు వాయిదా వేసింది. దీంతో చిన్మాయ్ నెల పాటు జైలులోనే ఉండనున్నారు. అయితే, చిన్మాయ్ తరఫున భవిష్యత్తులోనూ ఎవరూ వాదించకుండా ఇస్లామిస్టులు కుట్ర చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన తరఫున వాదించాలనుకున్న 70 మంది హిందూ అడ్వకేట్లపై తప్పుడు కేసులు బనాయించినట్లు బంగ్లాదేశ్​కు చెందిన ది బిజినెస్ స్టాండర్డ్ న్యూస్ పేపర్ పేర్కొంది. కాగా, బంగ్లాదేశ్‌‌లోని భారత టీవీ చానెల్స్​పై నిషేధం విధించాలని ఢాకా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టుకు చెందిన అడ్వకేట్ ఇఖ్లాస్ ఉద్దీన్ భుయాన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

హిందువులపై దాడులు ఆందోళనకరం: బ్రిటన్

బంగ్లాదేశ్‌‌లో హిందువులతోపాటు ఇతర మైనార్టీలపై జరుగుతున్న దాడుల పట్ల బ్రిటన్ పార్లమెంట్‌‌ కూడా సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. బ్రిటన్ పార్లమెంట్‌‌లోని భారత సంతతికి చెందిన ఎంపీ ప్రీతి పటేల్‌‌తో పాటు అధికార లేబర్ పార్టీ సభ్యుడు బారీ గార్డినర్.. బంగ్లాదేశ్‌‌లోని హిందువులపై హింసకు సంబంధించి బ్రిటిష్ విదేశాంగ మంత్రిని ప్రశ్నించారు. కాగా, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో  దేవాలయాలు, చర్చిలు, మతపరమైన సంస్థ ఇస్కాన్‌‌పై జరిగిన వరుస దాడులు, హత్యల వెనక మాస్టర్‌‌మైండ్‌‌ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు 
ముహమ్మద్ యూనస్‌‌ దేనని ఆరోపించారు.