నల్లమల రైతులకు సాగునీరేది?..అభివృద్ధికి అందనంత దూరంలో అమ్రాబాద్

ఏడు దశాబ్దాల స్వతంత్ర పాలనలో పది సంవత్సరాల స్వరాష్ట్ర పాలనలో తెలంగాణలో అభివృద్ధికి అందనంత దూరంలో ఉన్న ప్రాంతం అమ్రాబాద్.ఈ పేరు వినగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేవి దట్టమైన నల్లమల అడవి, అరుదైన జంతుజాలం, ఔషధ  మొక్కలు, విప్లవ  ప్రజా పోరాటాలు, ఆదివాసీ చెంచులు, ఊట వాగులు, జలపాతాలు, పరుగులు తీస్తున్న కృష్ణమ్మ. కానీ, సునిశితంగా పరిశీలించి చూస్తేనే ఆ ప్రాంత రైతుల అవస్థలు  కనిపిస్తాయి.

కాలంతో పోటీపడుతూ వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్న సాధారణ రైతాంగం ఉన్న ప్రాంతం. ఇక్కడ సకాలంలో వర్షాలు కురవక  ఆకాల వర్షాలకు విత్తనాలు వేస్తే అవి ఎండిపోవడం, పూత కాయలు లేకుండా మాడిపోవడం ఒకవేళ అన్నీ తట్టుకుని పండిన పంట పెడితే గిట్టుబాటు ధరలు రాకపోవడం, వీటికి తోడుగా కల్తీ విత్తనాలు, పెరుగుతున్న ధరల భారంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాటిని తట్టుకోలేక కొంతమంది భూములను అమ్ముకోవడం మరికొందరు బీడు భూములగా వదిలేస్తున్నారు. ఇక వేసవి  కాలంలో ఇక్కడ మనుషులు  బతకడమే కష్టమైన పని. అలాంటిది  వారు సాదుకునే పశువులకు  మేత, నీళ్ళు పెట్టడం మరింత కష్టం. 

పరీవాహక ప్రాంతం అవసరాలు తీర్చకుండా..

నదీతీరాల వెంబడే నాగరికత అభివృద్ధి చెందిందని, జనావాసాలు ఏర్పడ్డాయని మనం చరిత్రలో చదువుకుంటాం, అది వాస్తవం. కానీ, నాగర్ కర్నూల్ జిల్లాలో దానికి విరుద్ధంగా జరుగుతోంది. దేశంలో అన్ని రకాలుగా నాలుగో పెద్ద నది కృష్ణానది. ఇది నాగర్ కర్నూల్ జిల్లా అంచుగుండా 190 కి.మీ లు పారుతోంది. అందులో అమ్రాబాద్ ఉమ్మడి మండలం చుట్టూ 80 కి.మీ.లకు పైగా ప్రవహిస్తోంది. ఇందులో పదర, అమ్రాబాద్ మండలాలకు చెందిన ధారవాగు, నల్లవాగు, మానుపడ్డవాగు, పెద్దవాగు, పులిబుగ్గవాగు లాంటి పది పెద్ద వాగులు ఎలాంటి డ్యామ్​లు లేకపోవడంతో నీరంతా నిరుపయోగంగా కృష్ణానదిలో కలుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. నది అంచున ఊరున్నా సాగునీరు లేక  భూములు సత్తువ కోల్పోయి సత్తుబండలుగా మారుతున్నా సమస్యను పరిష్కరించలేదు. పరీవాహక ప్రాంతాల అవసరాలను తీర్చకుండా నదీ జలాలను మరో పరీవాహక ప్రాంతానికి పారించడం దేశంలోనే కాదు ప్రపంచంలో అమలవుతున్న  జలవిధానాలకు, నియమాలకు విరుద్ధం.  

ఎన్నికల ముందు బీఆర్​ఎస్ హడావుడి

బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో  ప్రజలు సాగునీటి సమస్య పరిష్కారం కోసం అనేక సార్లు ప్రాధేయపడ్డా ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇగో అగో అన్నారే తప్ప  ఏనాడూ మనసు పెట్టలేదు. 2024 ఎన్నికల కోడ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్,  శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి లిఫ్ట్ ఇరిగేషన్, చంద్రసాగర్ రిజర్వాయర్ల  ప్రస్తావన  తెరమీదికి తెచ్చారు. హడావుడిగా శంకుస్థాపనల పేరుతో శిలాఫలకాలు వేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారే తప్ప అందుకు సంబంధించిన పనులు ప్రారంభించలేదు.  గతంలో కె.ఎల్.ఐ పథకం ద్వారా అమ్రాబాద్, బాల్మూరు మండలాలకు సాగునీరు అందించాలనే సదుద్దేశంతో 3.5 టీ.ఎం.సిల సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మిస్తే ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించి ఎగువ ప్రాంతంలో ఉన్న 66 వేల ఎకరాల సాగు భూములతోపాటు వందలాది ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చి ఆ  ప్రాంతాన్ని  సస్యశ్యామలం చేయవచ్చునని అంచనా వేశారు. అయినా ఎండబెడుతున్నారు.

మూడు తరాల తండ్లాట  

ఆశ చావక సాగునీటి కల సాకారమయ్యే  రోజుకోసం మూడు తరాల నుంచి నల్లమల ప్రజలు ఎదురు చూస్తున్నారు. నల్లమల బిడ్డగా అచ్చంపేట ప్రాంతం గర్వంగా చెప్పుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ  చిత్తశుద్ధితో యుద్ధ ప్రాతిపదికన  అమ్రాబాద్ సంబంధిత ఎత్తిపోతల పథకాలను, కొత్తగా శంకుస్థాపన చేసి రాళ్ళు పాతిన లిఫ్ట్ స్కీములను పునఃపరిశీలన చేయాలి. సంబంధించిన పనులను ప్రారంభించాలి. సముద్ర మట్టానికి దాదాపు 800 అడుగుల ఎత్తులో ఉన్న అమ్రాబాద్, పదర మండలాలకు సాగునీరు అందించాలి. అలాగే బల్మూరు, లింగాల, ఉప్పునుంతల మండలాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు ప్రతిపాదించిన  పనులను వేగం పెంచి పూర్తి చేయాలి.

- ఎనుపోతుల వెంకటేశ్​