పాలమూరుకు ఉత్త చేతులే

  • ఉమ్మడి జిల్లాకు కేంద్ర బడ్జెట్​లో కేటాయింపుల్లేవ్
  • సమావేశాల్లో ప్రస్తావించని పీఆర్ఎల్ఐ
  • కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాని కేంద్రం
  • కాగితాలకే పరిమితమైన టెక్స్​టైల్​ పార్క్

మహబూబ్​నగర్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్​లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎలాంటి కేటాయింపులు లేవు. వలసల జిల్లా కావడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొత్త పరిశ్రమల ఏర్పాటు ప్రకటన చేయలేదు. ప్రధానంగా ‘పాలమూరు’ స్కీమ్​కు ఈ బడ్జెట్​లో నిధులు కేటాయిస్తారనే చర్చ జరిగినా, ఆ ఊసే రాలేదు. 

  • కొత్త పరిశ్రమల ఏర్పాటు ఉత్తదే..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఏండ్లుగా ప్రజలు వలస పోతున్నారు. ఈ ప్రాంతం  నుంచి ముంబై, భీవాండి, పూణె, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు దాదాపు 2.3‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్షల మంది వలస పోయారు. అయితే గత పార్లమెంట్​ ఎన్నికల టైంలో పరిశ్రమలు స్థాపించి స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ, తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్​లో ఉమ్మడి జిల్లాలో ఒక్క పరిశ్రమ ఏర్పాటుకు కూడా గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లాకు సమీపంలో ఉన్న ఏపీలోని కర్నూల్​ జిల్లా ఓర్వకల్లులో పరిశ్రమల స్థాపనకు సానుకూలం తెలిపింది. ఇందులో భాగంగా హైదరాబాద్–​-బెంగళూరు కారిడార్​ను ఆ ప్రాంతంలో నిర్మించనుంది. అక్కడే పరిశ్రమలు స్థాపించనుంది. ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల, అడ్డాకుల, పెబ్బేరు, ఎర్రవల్లి చౌరస్తా వంటి ప్రాంతాలు పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉన్నా, కారిడార్​ ఏర్పాటు చేసేందుకు ఈ ప్రాంతాలను కేంద్రం ఎంపిక చేయలేదు. రెండు కారిడార్​లను ఏపీకే మంజూరు​చేసింది. 

  • కేంద్రీయ విద్యాలయాలు రాలే..

విద్యాభివృద్ధికి సంబంధించి కేంద్ర బడ్జెట్​లో పాలమూరుకు చోటు లభించలేదు. గతం నుంచి మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో ఒక కేంద్రీయ విద్యాలయం ఉండగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ఏర్పాటైన కొత్త జిల్లాలైన నారాయణపేట, నాగర్​కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేయాలనే డిమాండ్​ ఉంది. అయినా ఈ జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు బడ్జెట్​లో కేటాయింపులు చేయలేదు. అలాగే నవోదయ విద్యాయలం నాగర్​కర్నూల్​ జిల్లాలో ఉండగా.. మహబూబ్​నగర్​తో పాటు గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలకూ మంజూరు చేయాలనే డిమాండ్​ ఉంది. బడ్జెట్​లో మాత్రం ఈ విద్యాలయాలను మంజూరు​చేయలేదు. అలాగే సైనిక్​ స్కూళ్లను ఇవ్వలేదు. 

  • ప్రస్తావనకు రాని పీఆర్ఎల్ఐ..

పాలమూరు–-రంగారెడ్డి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీం (పీఆర్ఎల్ఐ) గురించి కేంద్ర బడ్జెట్​లో ప్రస్తావన రాలేదు. బడ్జెట్​లో ఈ స్కీమ్​కు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. 2015లో ఈ స్కీమ్​ను ప్రారంభించిన గత ప్రభుత్వం ఎనిమిదేండ్లలో కేవలం 55 శాతం పనులు మాత్రమే కంప్లీట్​ చేసింది. అయితే బడ్జెట్​లో ఈ స్కీమ్​కు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయినా బడ్జెట్​లో నిధులు కేటాయింపులు లేకపోవడంతో నిరాశే మిగిలింది. దీనికితోడు 2014లో ఈ స్కీమ్​కు జాతీయ హోదా కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేదు. 

  • పర్యాటక ప్రాంతాలదీ అదే పరిస్థితి..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి. ప్రధానంగా ఇక్కడి నల్లమల అటవీ ప్రాంతం శైవ క్షేత్రాలు, జలపాతాలకు ప్రసిద్ధి. దీంతో ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్​గా ఏర్పాటు చేయాలనే డిమాండ్​ ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపింది. కాని బడ్జెట్​లో దీనికి ఆమోదం లభించ లేదు. అలాగే ప్రసాద్  స్కీం కింద గతంలో 5వ శక్తి పీఠమైన అలంపూర్​కు నిధులు కేటాయించగా, తాజా బడ్జెట్​లో జిల్లాలోని చారిత్రక ఆలయాలను ఈ స్కీం కింద ఎంపిక చేయలేదు. 

  • కాగితాల్లోనే టెక్స్​టైల్​ పార్క్..

ఉమ్మడి జిల్లాలో గద్వాల జరీ చీరలకు, నారాయణపేట కాటన్​ చీరలకు ప్రసిద్ధి. దేశ వ్యాప్తంగా ఈ చీరలకు మంచి గుర్తింపు ఉంది. ఉమ్మడి జిల్లాలోని గద్వాల, నారాయణపేట, అమరచింత, ఆత్మకూరు, రాజోలి, అలంపూర్​ తదితర ప్రాంతాల్లో దాదాపు 50 వేల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధార పడి ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలో టెక్స్​టైల్  పార్కు ఏర్పాటు చేయాలనే డిమాండ్​ చాలా కాలంగా ఉంది. కానీ, బడ్జెట్​లో ఉమ్మడి జిల్లాలో టెక్స్​టైల్​ పార్క్​ ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన చేయలేదు.