- ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్ శరత్
కామారెడ్డి , వెలుగు : కామారెడ్డి జిల్లాలో ఇంకా 35 వేల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లను 4 రోజుల్లో కంప్లీట్ చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్, ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎ. శరత్ పేర్కొన్నారు. లేనట్లయితే ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వడ్ల కొనుగోళ్లపై మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్లతో కలిసి ఆఫీసర్లతో రివ్యూ చేశారు. అంతకు ముందు ఆయన భిక్కనూరు మండలం అంతంపల్లిలో వడ్ల కొనుగోలు సెంటర్‌ను పరిశీలించారు.
రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శరత్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 2.65 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేశారన్నారు. ఇప్పటి వరకు సహాకరించినట్లుగానే మిగతా వడ్లను కూడా కొనుగోలుకు మిల్లర్లు సహకరించాలన్నారు. 4 రోజుల్లో కొనుగోళ్లు కంప్లీట్ చేయటానికి ప్రతి సెంటర్‌కు ఒక స్పెషల్ ఆఫీసర్లను నియమించాలన్నారు. తహసీల్ధార్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లను బాధ్యులు చేస్తూ మానటరింగ్ చేయాలన్నారు.
ఆఫీసర్లు, మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు కో ఆర్డినేషన్ చేసుకోవాలని సూచించారు. డీఎస్వో మల్లిఖార్జునబాబు, మేనేజర్ నిత్యానందం, జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి, అగ్రికల్చర్ జిల్లా ఆఫీసర్ భాగ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.