ఇకపై హాస్టళ్లలో రెగ్యులర్ తనిఖీలు : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు 

 నిజామాబాద్​, వెలుగు : జిల్లాలోని గవర్నమెంట్​హాస్టళ్లను ఇక నుంచి రెగ్యులర్​గా​ విజిట్​ చేస్తానని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు తెలిపారు. కొత్త డైట్​మెనూ ప్రకారం అమలు చేస్తున్నారా? పరిసరాల పరిశుభ్రత ఎలా ఉందనే విషయంపై స్పెషల్​ ఫోకస్​ పెడతామన్నారు. నిజామబాద్​ జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ఎస్సీ, బీసీ హాస్టళ్ల తరువాత వర్ని మండలం కోటయ్య క్యాంపులోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో కామన్ డైట్​ప్రొగ్రామ్​ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని చదవాలన్నారు.

మ్యాథ్స్, ఇంగ్లిష్​ సబ్జెక్టులపై భయం వీడాలని, పాఠాలు అర్థకాకుంటే టీచర్లతో సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు. మెరుగైన విద్యతో పాటు పోషకాలతో కూడిన నాణ్యమైన డైట్​ను పిల్లలకు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. అందులో భాగంగా 40 శాతం డైట్​చార్జ్​, 200 శాతం కాస్మొటిక్​చార్జీలను పెంచిందన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్​దిలీప్​కుమార్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్​ఆఫీసర్లు​నర్సయ్య, భూమయ్య, సహదేవ్, వార్డెన్​రాధారాణి, కల్పన తదితరులు ఉన్నారు.