నిజాం షుగర్​ ఫ్యాక్టరీ త్వరలో తెరుస్తాం : ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

  • రైతులు చెరకు సాగు చేయాలి
  • బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

నిజామాబాద్,  వెలుగు : బోధన్​లోని నిజాం షుగర్​ఫ్యాక్టరీ ప్రైవేట్​యాజమాన్యం చేసిన రూ.200 కోట్ల అప్పును ప్రభుత్వం​ చెల్లించిందని, త్వరలో కర్మాగారం ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మాజీ మంత్రి, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి వెల్లడించారు. రైతులు చెరకు సాగు చేసేలా చూడాలని, అధిక దిగుబడి వచ్చే వంగడాలను సైంటిస్టులు సూచించాలని కోరారు. సింగిల్​విండోలు ఈ విషయంలో చొరవ తీసుకోవాలన్నారు. బుధవారం జిల్లాలోని సింగిల్​ విండో సెక్రటరీల మీటింగ్ లో మాట్లాడారు.

ఎరువులు అమ్మడం, వడ్ల కొనుగోలు వరకే సహకార సంఘాలు పరిమితం కావొద్దని,  ​ఆదాయ మార్గాలు పెంచుకోవాలన్నారు. వ్యవసాయ పంటలతో రైతులు డెవలప్​అయ్యేలా శాస్త్రవేత్తలు, అగ్రికల్చర్​ ఆఫీసర్లు కృషి చేయాలన్నారు. వరి కాకుండా చెరకు, ఇతర పంటల సాగు చేసేలా చేయాలన్నారు.  రాష్ట్రంలోని ప్రభుత్వ గోదాములన్నీ నిండి ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఖరీఫ్​ సీజన్ వడ్ల కొనుగోళ్లకు ప్రభుత్వం  గోదాములు అందుబాటులోకి తెస్తుందన్నారు. 17 శాతం వరకు తేమ ఉన్నా సొసైటీలు వడ్లు కొనాలన్నారు. రూరల్​ఎమ్మెల్యే డాక్టర్​ భూపతిరెడ్డి మాట్లాడుతూ..

సింగిల్ విండోల ద్వారా కోళ్లు, చేపల పెంపకం చేపట్టాలని, పూలు, పాల విక్రయాలతోనూ లాభాలు ఆర్జించవచ్చన్నారు. స్టేట్​ కోఆపరేటివ్​ యూనియన్​​ చైర్మన్ మానాల మోహన్​రెడ్డి మాట్లాడుతూ.. నవంబర్​30న హైదరాబాద్,​ వరంగల్​లో సొసైటీ కంప్యూటర్​ ఆపరేటర్లకు కామన్​ సర్వీస్​ సెంటర్​ అంశంపై ట్రైనింగ్​ ఇవ్వనున్నట్లు తెలిపారు. మార్క్​ఫెడ్​ చైర్మన్ మార మోహన్​రెడ్డి, డీసీసీబీ చైర్మన్​కుంట రమేశ్​రెడ్డి, ఐడీసీఎంఎస్​ చైర్మన్​ తారాచంద్​ నాయక్​, మార్కెట్​ చైర్మన్​ ముప్ప గంగారెడ్డి, స్టేట్​ కోఆపరేటివ్​ యూనియన్​ ఎండీ అన్నపూర్ణమ్మ, టీపీసీసీ జనరల్​ సెక్రటరీ గడుగు గంగాధర్​ పాల్గొన్నారు. ​