అనగనగా ఒక ఊరు: ఆధ్యాత్మిక నిలయం.. నిక్కో

నిక్కో అనే గ్రామం జపాన్​లోని టొచిగి ప్రాంతంలో ఉంది. ఆధ్యాత్మిక నగరంగా పేరుగాంచిన ఈ ఊళ్లో ప్రకృతి రమణీయమైన దృశ్యాలు కళ్లను కట్టిపడేస్తాయి. చారిత్రక పుణ్యక్షేత్రాలు, ఆలయాలతో ఆహ్వానం పలికే నిక్కో యునెస్కో హెరిటేజ్​ సైట్​గా గుర్తించింది. మరి ఈ హెరిటేజ్​ సైట్​ స్పెషాలిటీ ఏంటో చూడండి.

నిక్కో... అనగానే ముందు జలపాతాలు గుర్తుకొస్తాయి. ఈ ఊళ్లో కెగన్ అనే అందమైన జలపాతం ఉంది. ఈ జలపాతం నిక్కోలోని మూడు పెద్ద జలపాతాల్లో ఒకటి. దీని ఎత్తు 97 మీటర్లు. నీళ్లు అంత పైనుంచి కిందకు దుముకుతున్న దృశ్యం చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఇది ఈ ఊరికి నేచురల్ లాండ్​ మార్క్. ‘కెగన్’​ అనే పేరు బౌద్ధ పురాణాల్లోని కెగన్ – క్యొ (అవతమ్​సక సూత్ర) మీదుగా వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. చుజెంజి సరస్సు నుంచి కాలువ ద్వారా నీళ్లు ఈ జలపాతానికి చేరుకుంటాయి. ఈ జలపాతాన్ని చూస్తూ ఆధ్యాత్మికతని అనుభూతి చెందొచ్చట. 
చుజెంజి సరస్సు

ఈ సరస్సు నిక్కో నేషనల్ పార్క్​లో ఉంది. ఇది 20 వేల ఏండ్ల కిందట అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఏర్పడింది. టొచిగి ప్రాంతంలోనే అతి పెద్ద సరస్సు ఇది. దీని చుట్టుకొలత 25 కిలో మీటర్లు. దీన్ని జపాన్​లోనే అతి ఎత్తయిన ప్రదేశంలో ఉన్న సరస్సుగా పిలుస్తారు. ప్రస్తుతం ఈ సరస్సు ఉన్న ప్రాంతంలో అంతర్జాతీయ విజిటర్స్ కోసం వేసవి రిసార్ట్​లుగా వాడుతున్నారు. ఈ సరస్సు ఒక్కో సీజన్​కి ఒక్కోలా మారుతుంటుంది. ట్రెక్కింగ్, పిక్నిక్​కి ఈ ప్లేస్​ బాగా సూట్​ అవుతుంది.

యుదకి ఫాల్స్

నిక్కోలో ఉన్న మూడు గ్రేట్​ వాటర్​ ఫాల్స్​లో ఒకటి యుదకి. ఇది నిక్కో గ్రామానికి మధ్యలో ఉంది. దీని ఎత్తు 70 మీటర్లు. సెంజొగహర అనే ప్రాంతం నుంచి టొచిగి వరకు హైకింగ్ చేయొచ్చు. ఆ దారిలోనే ఈ జలపాతం కనిపిస్తుంది. దీనికి యునొకొ సరస్సు నుంచి నీరు ప్రవహిస్తుంది. పిక్నిక్​ కోసం చాలామంది ఈ జలపాతం దగ్గరకి వెళ్తుంటారు. ఇక ఫొటోగ్రాఫర్ల క్లిక్స్​కి అయితే అలుపు ఉండదు ఇక్కడ. అంత అందంగా ఉంటుంది ఈ ప్రదేశం.

అకెచిదైరా 

చుజెంజి సరస్సుకి తూర్పున అకెచిదైరా అనే బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. ఇక్కడ ఆటమ్​ సీజన్​లో కనిపించే ఆకులు ఎంత అందంగా ఉంటాయో మాటల్లో చెప్పలేం. ఇది సముద్ర మట్టానికి దాదాపు1,437 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడికి రోప్​ వే ద్వారా వెళ్లాలంటే మూడు నిమిషాలు పడుతుంది. ఇక్కడ నుంచి చూస్తే నిక్కో లోని చుజెంజి సరస్సు, కెగన్ ఫాల్స్, మౌంట్ నాంటై వంటివి చాలా బాగా కనిపిస్తాయి. అందుకే దీన్ని ‘అకెచిదైరా అబ్జర్వేషన్ ప్లాట్​ ఫాం’ అని అంటారు. వీటితోపాటు స్టీల్ టవర్​ని కూడా చూడొచ్చు. అది అబ్జర్వేషన్​ ప్లాట్​ ఫాం నుంచి ఇరవై నిమిషాల ప్రయాణ దూరంలో ఉంటుంది. 

తొషు-గు పుణ్యక్షేత్రం

నిక్కోలో తొషు–గు అనే పుణ్యక్షేత్రం ఉంది. అయితే, ఎడో పిరియడ్​లో ఈయసు తొకుగవ దీన్ని ఏర్పాటు చేసింది. ఈ చరిత్రలోకి వెళ్తే.. 1616లో ఈయసు అనే వ్యక్తి చనిపోయాక దేవతగా వెలిసిందని నమ్ముతారు. విదేశీయులు కూడా ఇక్కడికి వస్తుంటారు. అయితే, ఈ ప్రదేశంలో 55 బిల్డింగ్​లు, ఎనిమిది నేషనల్ ట్రెజర్స్, 34 ముఖ్యమైన కల్చరల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ కాంప్లెక్స్​ని1999లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్​ సైట్​గా గుర్తించారు. అందులో నిక్కో ఆలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.

రిన్నొ–జి టెంపుల్

ఈ గ్రామంలో నిక్కోసన్ రిన్నో–జి అనే పేరుతో ఒక ఆలయం ఉంది. దానికి1250 ఏండ్ల నాటి గొప్ప చరిత్ర ఉంది. మెయిన్​ టెంపుల్​లో సన్​బుట్సుడొ హాల్ ఉంటుంది. అది పెద్ద చెక్కతో నిర్మించిన నిర్మాణాల్లో ఇది ఒకటి. అందులో 7‌.5 మీటర్ల ఎత్తులో బౌద్ధ విగ్రహాలు ఉంటాయి. విజిటర్స్ ఈ హాల్​తోపాటు గొమదొ హాల్​ని కూడా చూడొచ్చు. అక్కడ అదృష్ట దేవుళ్ల విగ్రహాలు ఉంటాయి. అంతేకాకుండా కల్చరల్ ప్రాపర్టీస్​తోపాటు.. జపనీస్​ ట్రెడిషనల్​ స్టయిల్​లో కట్టిన షొయొయెన్​ గార్డెన్, కొలను చూడొచ్చు.​ 

ఫుతరసన్​ - జింజా ష్రైన్

కొండ మీద ఆరాధనకు కేంద్రం ఈ పుణ్యక్షేత్రం. ఇది నిక్కోలోని మూడు వరల్డ్ హెరిటేజ్​ సైట్​లలో పురాతనమైనది. ఇక్కడ ఎరుపు రంగు బ్రిడ్జ్​ ఉంటుంది. ఇక్కడ ఆర్కిటెక్చర్, గార్డెన్స్ ఎంతో అందంగా ఉంటాయి. ఈ పుణ్యక్షేత్రానికి పెండ్లి కావాలని, తల్లి కావాలని, ప్రసవం సురక్షితంగా జరగాలని ప్రార్ధించేందుకు వస్తుంటారు. 

నాన్​టైసన్​ పర్వతం

జపాన్​లోని వంద ఫేమస్​ పర్వతాల్లో ఇది  ఒకటి. నిక్కో నేషనల్​ పార్క్​లో ఉంది. ఇక్కడ కూడా ప్రార్థనలు చేస్తారు. ఇక్కడి నుంచి చుగుషి ప్రదేశానికి నడుచుకుంటూ వెళ్లొచ్చు. అక్కడున్న రాతి మెట్లు ఎక్కి పైనున్న ఒకుమియా పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. ఇక్కడికి మే 5 నుంచి అక్టోబర్ మధ్య మాత్రమే అనుమతిస్తారు. ఈ కొండ ఎక్కడానికి దాదాపు నాలుగు గంటలు పడుతుంది.  

సెంజొగహర

అతిపెద్ద పీఠభూమి సెంజొగహర. ఇక్కడ 350 జాతులకు పైగా మొక్కలతోపాటు అడవి పక్షులు ఉంటాయి.  రామ్సర్ కన్వెన్షన్​ దీని సంరక్షణ బాధ్యతలు చూసుకుంటుంది. ఇక్కడ చెక్కదారుల్లో హైకింగ్ చేస్తుంటే విరబూసిన పూలు వెల్​కం చెప్తాయి. ఏపుగా పెరిగిన గడ్డి ఆరెంజ్​ రంగు నుంచి ఎరుపు రంగులోకి మారుతుంది. ఇలాంటిదే ఒడషిరొగహర పీఠభూమి. దీని చుట్టూ మంగోలియన్ ఓక్​ చెట్ల అడవి ఉంటుంది. ఆ దారిలో నడుస్తూ నేచర్​ని ఆస్వాదించొచ్చు. అలాగే జపనీస్​ వైట్​ బిర్చ్ చెట్టు ఒకటి ఇక్కడ ఉంటుంది. దాన్ని ‘లేడీ ఆఫ్​ ఒడషిరొగహర’ అంటారు. ఇక్కడ ఫొటోలు తీసుకోవడానికి పాపులర్ స్పాట్.

కిరిఫురి కొగెన్ హైలాండ్స్ 

కిరిఫురి కొగెన్ హైలాండ్స్ అకనగిసన్​ అనే పర్వతం పక్కన ఉన్న పీఠభూమిలో కనిపిస్తాయి. ఇక్కడ హైకింగ్ చేయొచ్చు. ప్రతి ఏటా జూన్​ అయిపోయే టైంలో 260 వేల లిల్లీ పూల అందాలను చూడొచ్చు. అలాగే1445 మెట్లు కలిగిన టెంకు కైరో లేదా కారిడార్ ఇన్​ ద స్కై ఎక్కుతూ ఈ ప్రదేశాన్ని చూడొచ్చు. ఇక్కడ క్యాంప్​ సైట్స్ ఉన్నాయి. వింటర్​లో స్పోర్ట్స్, స్కీయింగ్​, స్నో షోయింగ్ చేయొచ్చు. 

అందమైన అగాధం

ఒకసారి నాన్​టైసన్ పర్వతం కోతకు గురైంది. దైయగవ నది గుండా లావా ప్రవహించి అగాధం ఏర్పడింది. దాన్ని కన్​మన్​గఫుచి గోర్జ్​ అంటారు. అక్కడ 70 రాతి ‘జిజో’ విగ్రహాల వరుస ఉంటుంది. అయితే వాటిని ఎన్నిసార్లు లెక్కపెడితే అన్ని సార్లు లెక్క మారుతుందని చెప్తారు. అంతేకాదు.. సంస్కృతంలోని కొన్ని క్యారెక్టర్స్​ని కూడా అక్కడ చూడొచ్చు. 

వండర్ లాండ్

17వ శతాబ్దానికి చెందిన ఎడో వండర్​లాండ్​ని అక్కడ చూడొచ్చు. అక్కడ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్, నింజా థియేటర్​, పిల్లల కోసం గేమ్స్, యాక్టివిటీస్​ ఉంటాయి. నిక్కో లోకల్ స్పెషల్ రెసిపీ యుబ లేదా టొఫు స్కిన్ రుచి చూడాల్సిందే. దీన్ని సోయాబీన్​తో తయారుచేస్తారు. 

సమురాయ్ మార్చ్​ 

నిక్కోలో ఏటా రెండు రోజుల పాటు యాన్యువల్ ఫెస్టివల్ జరుగుతుంది. వాటిలో యబుసమె అనే ఆచారం హైలైట్​. ప్రతి ఏడాది మే17న జరిగే ఈ ఆచారంలో గుర్రాల మీద ఎక్కి బాణాలు విసురుతూ సాహసాలు చేస్తారు. మే18న వెయ్యి మంది మగవాళ్లు ట్రెడిషనల్ సమురాయ్​ వారియర్స్​గా గెటప్​ వేసుకుంటారు. వాళ్లంతా వీధుల్లో మార్చ్ చేస్తూ ఈయసు సమాధి వరకు వెళ్తారు. 

స్నో ఫెస్టివల్ 

కమకుర స్నో హౌస్ ఫెస్టివల్​ అనేది యునిషిగవ అనే టౌన్​లో జరుగుతుంది. టొచిగి పర్వతాల కింద చిన్న చిన్న ఇగ్లూ హౌస్​లు కట్టుకుని ఆ ఫెస్టివల్ చేస్తారు. ఆ హౌస్​లను ‘కమకుర’ అని పిలుస్తారు. రాత్రిపూట అవి వెలుగులతో నిండి ఉంటాయి. ఆ దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది. ఉదయం పూట వింటర్ స్పోర్ట్స్​ జరుగుతాయి. 

ఇన్ని విశేషాలున్న నిక్కో గ్రామం చేరుకోవాలంటే.. జపాన్​లోని ఫుకుషిమ ఎయిర్​ పోర్ట్​లో దిగి అక్కడి నుంచి ట్యాక్సీల్లో వెళ్లాలి. 

పూర్వం నిక్కో వెళ్లే దారిలో 50 వేల దేవదారు చెట్లు ఉండేవి. ఈ దారి వేయడానికి 20 ఏండ్లు పట్టింది. అయితే 35.41 కిలో మీటర్ల వరకు ఉన్న ఈ దారి ‘లాంగెస్ట్​ ట్రీ లైన్డ్​ రోడ్​ ఇన్​ ది వరల్డ్​’గా గిన్నిస్​ బుక్​లో ఎక్కింది.