గ్లోబల్ సౌత్ గొంతుకవుదం..నైజీరియా ప్రెసిడెంట్ టినుబు, ప్రధాని మోదీ నిర్ణయం

అబూజా: నైజీరియా, భారత్ మధ్య ఆరు దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయని, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుందామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారత్, నైజీరియా గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా నిలవాలని ఆకాంక్షించారు. ఆదివారం ఉదయం నైజీరియా రాజధాని అబూజాకు చేరుకున్న మోదీ.. అక్కడి ప్రెసిడెన్షియల్ విల్లాలో నైజీరియా ప్రెసిడెంట్ బోలా అహ్మద్ టినుబుతో భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్య, ఇంధన రంగాల్లో పరస్పర సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు.

టెర్రరిజం, పైరసీ, ర్యాడికలైజేషన్​పై కలిసి పోరాడాలని, గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని నిర్ణయించారు. వ్యవసాయం, రవాణా, మందులు, రెన్యువబుల్ ఎనర్జీ, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ వంటి అంశాల్లో భారత్​కు ఉన్న అనుభవాన్ని పంచుకుంటామని మోదీ చెప్పారు. వివిధ రంగాల్లో భారత్ అందిస్తున్న సహకారానికి టినుబు కృతృజ్ఞతలు తెలిపారు. అనంతరం కల్చరల్ ఎక్స్ చేంజ్, కస్టమ్స్, సర్వే రంగాల్లో సహకారంపై కుదిరిన ఎంఓయూలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

భేటీ అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాలకు టెర్రరిజం, వేర్పాటువాదం, డ్రగ్స్ అక్రమ రవాణా ప్రధాన సవాళ్లుగా మారాయని, వీటిని కట్టడి చేయడంలో సహకరించుకోవాలని నిర్ణయించుకున్నామని మోదీ చెప్పారు. నైజీరియాలో దాదాపు 60 వేల మంది ఇండియన్లు నివసిస్తున్నారని, వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని టినుబుకు విజ్ఞప్తి చేశారు. గత నెల నైజీరియాలో వరదలతో ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారని, వారి కోసం 20 టన్నుల రిలీఫ్ మెటీరియల్​ను అందిస్తామని ప్రకటించారు. 
  

మోదీకి ‘అబూజా సిటీ కీ’ అందజేత.. 

నైజీరియా పర్యటనకు వచ్చిన మోదీకి ఉదయం అబూజా ఎయిర్ పోర్టులో ఆ దేశ ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ మంత్రి ఎజెన్వో వైక్ ఘనంగా స్వాగతం పలికారు. మోదీ గౌరవార్థం ‘అబూజా సిటీ తాళంచెవి’ని అందజేశారు. భారత ప్రధాని పట్ల నైజీరియా ప్రజల విశ్వాసం, గౌరవానికి ఈ తాళం చెవి గుర్తు అని సంబంధిత ఫొటోతోసహా భారత విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. నైజీరియాలో భారత ప్రధాని పర్యటించనుండటం గత 17 ఏండ్లలో ఇదే మొదటిసారి.   

 మోదీకి నైజీరియా అవార్డు   

మోదీని నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైగర్’ అవార్డుతో సత్కరించింది. ఇప్పటివరకూ ఈ అవార్డును అందుకున్న రెండో విదేశీ నేతగా మోదీ నిలిచారు. గతంలో క్వీన్ ఎలిజబెత్ కు 1969లో ఈ అవార్డును అందజేశారు. నైజీరియా అవార్డును ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, దీనిని భారత ప్రజలకు అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. కాగా, నైజీరియా అవార్డుతో కలిపి ఇప్పటివరకూ మోదీ 17 దేశాల ప్రభుత్వాల నుంచి అవార్డులు అందుకున్నారు.  


నిజాలు బయటకురాక మానవు! 

తప్పుడు కథనాలు కొద్దికాలమే మనుగడలో ఉంటాయని, క్రమంగా నిజాలు బయటకు రాక తప్పదని ప్రధాని మోదీ అన్నారు. ఇటీవల విడుదలైన సబర్మతి రిపోర్ట్ సినిమాపై ఆయన ఆదివారం ఎక్స్​లో స్పందించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అంటూ ట్రైలర్ వీడియోను అలోక్ భట్ అనే వ్యక్తి ఎక్స్​లో పోస్ట్ చేయగా.. మోదీ ఈ మేరకు బదులిచ్చారు. ‘‘బాగా చెప్పారు. నిజం బయటకు రావడం మంచిదే.

అది కూడా సామాన్య ప్రజలు చూసేలా సినిమా రూపంలో రావడం సంతోషం. ఫేక్ ప్రచారం కొద్దికాలం మాత్రమే ఉంటుంది. కానీ క్రమంగా నిజాలు బయటకు వస్తాయి” అని ఆయన పేర్కొన్నారు. కాగా, గుజరాత్ లో 2002 నాటి గోధ్రా రైలు దహనం, తర్వాత జరిగిన మత ఘర్షణల ఆధారంగా సబర్మతి ఫైల్స్ సినిమా వచ్చింది. ట్వెల్త్ ఫెయిల్, మీర్జాపూర్ ఫేం విక్రాంత్ మెస్సీ, రాశీఖన్నా తదితరులు నటించారు.