లగచర్ల ఘటనపై ఆఫీసర్లను విచారించిన ఎన్​హెచ్ఆర్సీ

వికారాబాద్/సంగారెడ్డి, వెలుగు: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ జరిపింది. ఆదివారం కలెక్టరేట్​కు వచ్చిన కమిషన్  సభ్యులు కలెక్టర్​తో పాటు ఇతర అధికారులను విచారించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం సభ్యులు డిప్యూటీ రిజిస్ట్రార్​ముఖేశ్, ఇన్​స్పెక్టర్లు రోహిత్ సింగ్, యతి ప్రకాశ్ శర్మ  మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో కలెక్టరేట్​కు వచ్చారు.

కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా అడిషనల్​ కలెక్టర్ లింగ్యా నాయక్, కొడంగల్ తహసీల్దార్ విజయ్ కుమార్, వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్ది, కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్ది, బొంరాస్ పేట ఎస్ఐని రెండున్నర గంటలపాటు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, వివరాలు వెల్లడించాలని మీడియా ప్రతినిధులు కోరగా.. ఇంకా విచారణ కొనసాగుతోందని తెలిపారు. దాదాపు 90 శాతం విచారణ పూర్తయిందని, ఇంకా ఇద్దరు ముగ్గురు వ్యక్తులను విచారించాల్సి ఉందన్నారు. ఈ నెల 26 వరకు విచారణను పూర్తి చేయనున్నట్టు కమిషన్ బృందం సభ్యులు తెలిపారు. 

కంది సెంట్రల్ జైల్లో నిందితులను కలిసి వివరాల సేకరణ 

లగచర్ల దాడి ఘటనలో అరెస్టయి సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైల్లో ఉన్న 19 మంది నిందితులను సైతం జాతీయ మానవ హక్కుల కమిషన్ కలిసింది. డిప్యూటీ రిజిస్టార్ ముఖేశ్​తో పాటు మరో ముగ్గురు సభ్యుల బృందం.. కేసులో ఏ2గా ఉన్న సురేశ్​తో పాటు ఇతరులతో మాట్లాడి ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకుంది.