ట్రిపుల్​ఆర్ ​నార్త్​కు టెండర్లు .. ఆహ్వానించిన నేషనల్​ హైవేస్​ అథారిటీ ఆఫ్​ ఇండియా

  • రూ.7,104.06  కోట్లతో గ్రీన్ ఫీల్డ్ ఫోర్ వే ఎక్స్ ప్రెస్ హైవేగా నిర్మాణం
  • రెండేండ్లలో పూర్తి చేయాలని టెండర్ లో పేర్కొన్న ఎన్​హెచ్ఏఐ
  • సంగారెడ్డి లోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి వరకు 5 ప్యాకేజీలుగా టెండర్లు
  • ఫిబ్రవరి 14 వరకు గడువు..17న ఓపెన్​
  • కేంద్రానికి సీఎం, మంత్రి కోమటిరెడ్డి వినతితో ప్రాజెక్ట్​ ముందుకు

హైదరాబాద్, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు ( ట్రిపుల్ ఆర్)  నార్త్ పార్ట్​ నిర్మాణానికి ముందడుగు పడింది. నేషనల్​ హైవేస్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఎన్​హెచ్​ఏఐ) శనివారం టెండర్లు పిలిచింది. రూ.7,104.06 కోట్ల వ్యయంతో 161.5 కిలోమీటర్ల మేర  గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే ను కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్నది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ గ్రామం నుంచి స్టార్ట్ కానున్న నార్త్ పార్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి వరకు ఉంటుంది. మొత్తం 5 ప్యాకేజీలుగా టెండర్లు పిలవగా టెక్నికల్, ఫైనాన్సియల్ టెండర్ దాఖలుకు  వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 వరకు గడువు విధించారు. 

అదే నెల 17న టెండర్లు ఓపెన్ చేయనున్నట్టు ఎన్​హెచ్ఏఐ పేర్కొన్నది.  టెండర్ దక్కించుకున్న కంపెనీ రెండేండ్లలో పనులు పూర్తి చేయాలని, 5 ఏండ్లు రోడ్ మెయింటెనెన్స్ చేపట్టాలని టెండర్​లో ఎన్​హెచ్ఏఐ స్పష్టం చేసింది.ఈ ప్రాజెక్టుకు మొత్తం 1,940 హెక్టార్ల భూమి అవసరం కాగా.. ఇందులో 72.25 హెక్టార్ల ఫారెస్ట్ భూమి ఉంది. ఇప్పటికే 95 శాతం భూ సేకరణ పూర్తయింది. టెండర్లు ఆహ్వానించడంతో త్వరలో భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఫారెస్ట్ భూములకు ప్రత్యామ్నాయంగా మహబూబాబాద్ జిల్లాలో అటవీ శాఖకు రాష్ట్ర సర్కారు స్థలం కేటాయించింది.  

ప్రాజెక్ట్​ స్పీడప్..

నిరుడు డిసెంబర్ లో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రిపుల్​ ఆర్​ వేగం పుంజుకున్నది. సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పలుసార్లు ప్రధాని మోదీతోపాటు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసినప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ట్రిపుల్​ ఆర్​ నిర్మాణంపై  ప్రధానికి లేఖ కూడా రాశారు. రాజకీయపరంగా ఎన్ని విభేదాలు ఉన్నా రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తామని, కేంద్రం నుంచి రావాల్సిన ఏ ఫండ్స్ ను వదులుకోబోమని స్పష్టం చేశారు. 

స్టేట్ వాటా చెల్లింపును పట్టించుకోని గత ప్రభుత్వం

ట్రిపుల్​ఆర్ నార్త్ పార్ట్ కు భూసేకరణ ప్రారంభించిన ఎన్ హెచ్ఏఐ.. ఇందులో 50 శాతం రాష్ట్ర వాటా తమ ఖాతాలో డిపాజిట్ చేయాలని గత బీఆర్ఎస్​ ప్రభుత్వాన్ని నిరుడు ఫిబ్రవరిలోనే కోరింది. ఎన్ హెచ్ చట్టం 1956 ప్రకారం.. భూసేకరణ కోసం మొత్తాన్ని ముందుగా డిపాజిట్ చేసే నిబంధన ఎక్కడా లేదని,  కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ (కాలా ) ద్వారా 3 (జీ) అవార్డు ఆమోదించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ మొత్తంలో 50 శాతం వాటా జమ చేస్తుందని గత ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

 కేంద్ర రవాణా శాఖ ఆధీనంలో ఉన్న జాతీయ రహదారులపై చేపట్టిన ప్రాజెక్టులకు ఈ విధానాన్నే అనుసరిస్తున్నదని,  కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుగా డబ్బు జమ చేయాలని చెప్పడం సబబు కాదని అసెంబ్లీలో ప్రకటించింది. అలాగే,  2023-–24 బడ్జెట్‌‌‌‌లో ట్రిపుల్​ఆర్​ భూసేకరణకు రూ. 500 కోట్లు కేటాయించింది. అయితే, నిధులు విడుదల చేయకపోవడంతో భూసేకరణ నిలిచిపోయింది.

కాంగ్రెస్​ ప్రభుత్వం వినతితో  యుటిలిటీ చార్జీలు భరిస్తామన్న కేంద్రం..

ట్రిపుల్​ ఆర్ నిర్మాణంలో భాగంగా తొలగించాల్సిన పైపులైన్లు, కేబుళ్లు, స్తంభాలు (యుటిలిటీస్‌‌‌‌) తదితరాల తరలింపు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ వ్యయం దాదాపు రూ.200 కోట్లు భరించడానికి ఒప్పుకొన్నది. వీటిని కేంద్రమే భరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు గడ్కరీ అంగీకరించారు.  కేంద్రం నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వంపై అదనపు భారం తప్పింది. ఈ వ్యయాన్ని భరించే విషయంలో జాతీయ రహదారుల సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య గడిచిన ఏడాదిగా చర్చలు జరుగుతున్నాయి. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాల్సి ఉంటుంది. 

రహదారి నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరించాలన్నది కొన్నేళ్ల కిందటే చేసుకున్న ఒప్పందం. నిర్మాణంలో భాగంగా మార్గంలో ఉన్న తాగునీటి పైపులు, విద్యుత్తు, టెలికాం కేబుళ్లు, విద్యుత్తు స్తంభాలు వంటివాటిని తరలించాల్సి ఉంటుంది. వీటి తరలింపు కోసం దాదాపు రూ.200 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారుల అంచనా. అయితే, ఈ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని జాతీయ రహదారుల సంస్థ గతంలో లేఖ రాసింది. 

అప్పటి బీఆర్ఎస్  ప్రభుత్వం తర్జనభర్జనల తర్వాత అదనపు వ్యయం భరించేది లేదని స్పష్టంచేసింది. ఆ వ్యయాన్ని భరించని పక్షంలో ప్రాజెక్టు ముందుకు వెళ్లడం కష్టం అంటూ కేంద్ర సంస్థ మరో లేఖ రాయడంతో ట్రిపుల్​ ఆర్​ ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర అధికార పగ్గాలు కాంగ్రెస్‌‌‌‌ పార్టీ చేతికి వచ్చాక ట్రిపుల్​ ఆర్​పై కేంద్రానికి లేఖ రాసింది. యుటిలిటీ చార్జీలను భరించేందుకు తాము సిద్ధమని, అయితే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూడాలని విన్నవించింది. ఈ లేఖకు స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ.. యుటిలిటీ వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేయడంతో.. టెండర్లకు మార్గం సుగమమైంది.

ట్రిపుల్​ ఆర్​ తెలంగాణకు సూపర్​ గేమ్​చేంజర్ 

ఓఆర్ఆర్​ గేమ్ చేంజర్​ అయితే.. ట్రిపుల్​ ఆర్​ రాష్ట్రానికి సూపర్ గేమ్ చేంజర్​. ఈ ప్రాజెక్టు రెండు పార్ట్ లు పూర్తయితే రాష్ట్రంలో ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీలు తమ యూనిట్లను నెలకొల్పుతాయి. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. నిరుద్యోగ యువత భవిష్యత్తుకు ఈ ప్రాజెక్టు బాటలు వేస్తుంది. ట్రిపుల్​ ఆర్​ కోసం ప్రజా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి  సీఎం  రేవంత్ రెడ్డితో కలిసి అనేకసార్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతులు ఇచ్చాం. 2017 లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రతిపాదించినా.. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగలేదు.

 గత ప్రభుత్వంలో నాటి సీఎం, ఆర్ అండ్ బీ మంత్రి ట్రిపుల్​ఆర్ కోసం గడ్కరీని కలిసిన దాని కంటే మా ప్రభుత్వం ఎక్కువసార్లు కలిసింది.  సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు భూసేకరణ కోసం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.  తెలంగాణ అభివృద్ధిలో ట్రిపుల్​ఆర్​ కీలక భూమిక పోషించబోతున్నది. అప్పుడే యుటిలిటీ చార్జీలు చెల్లిస్తామని లేఖ ఇచ్చి ఉంటే ఈపాటికి ట్రిపుల్​ఆర్​ స్టార్ట్​ అయి పనులు కొనసాగుతుండేవి. మా ప్రభుత్వం వచ్చాక నేను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేసి.. యుటిలిటీ చార్జీలు చెల్లిస్తామని లేఖ రాశాం.  రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వివరిస్తే.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పెద్ద మనసు చేసుకొని యుటిలిటీ చార్జీలు కూడా కేంద్రమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది.

కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఆర్​అండ్​ బీ శాఖ మంత్ర

2017లో ప్రపోజల్

హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్​ రింగ్ రోడ్  ( ఓఆర్ఆర్ ) కు 40 కిలోమీటర్ల బయట రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించాలని 2017లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది.  నార్త్, సౌత్ పార్ట్ లుగా ఉమ్మడి మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల మీదుగా ట్రిపుల్​ ఆర్ నిర్మాణం కానున్నది.  దీనికి భూసేకరణ, ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 17 వేల కోట్లు అవుతుందని అంచానా వేశారు. ప్రాజెక్టు ఆలస్యంతో ప్రాజెక్టు కాస్ట్ భారీగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో పట్టాలెక్కలేదు. గత ప్రభుత్వంలో కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య రాజకీయ విభేదాలు ఉండడంతో పలు అంశాల దగ్గర గత కేసీఆర్ సర్కారు స్పందించలేదు.