సాగు చేద్దామా? వద్దా?

  • కాళేశ్వరం బ్యాక్​వాటర్ భూముల రైతులకు కొత్త కష్టాలు
  • క్రాప్​హాలీడే ఎత్తేసినమని.. సాగు చేసుకోమంటున్న ఆఫీసర్లు
  • ముంపు నీటిలో పాడైన బోర్లు, కరెంటు ట్రాన్స్​ఫార్మర్లు
  • పంట భూములకే రైతు భరోసా అంటున్న రాష్ట్ర సర్కార్​
  • దిక్కుతోచని స్థితిలో  బాధిత  రైతులు

పెద్దపల్లి, వెలుగు: కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో ఐదేండ్లుగా  భూములు నీటిలో మునిగిపోయాయి. ప్రాజెక్ట్ లోని నీటిని కిందికి వదలడంతో ఇప్పుడు ముంపు భూములన్నీ పైకి తేలాయి. ఇప్పటికే నాలుగేండ్లుగా కొనసాగుతున్న క్రాప్​ హాలీడేను కూడా అధికారులు ఎత్తేశారు. ఇగ భూములు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు.  అయితే.. ఇప్పటికే బ్యాక్​వాటర్ ​ముంపుతో బాధిత రైతుల వ్యవసాయ బోర్లు, కరెంటు ట్రాన్స్​ఫార్మర్లు నీట మునిగిపోయాయి. మరో వైపు సాగులోని భూములకే  రైతు భరోసా ఇస్తామని ప్రస్తుత సర్కార్​ చెప్తుండడంతో  రైతులు ఏం చేయాలో తెలియని ఆందోళనలో పడిపోయారు. ఇదీ పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఆరెంద, మల్లారం తదితర గ్రామాల్లోని దాదాపు 500 ఎకరాలపైగా బ్యాక్ వాటర్ ముంపు భూముల పరిస్థితి.  

తామేం చేయలేమంటున్న ఆఫీసర్లు  

బ్యాక్​వాటర్​ ముంపునకు గురైన భూములకు ఐదేండ్ల కింద గత బీఆర్ఎస్ సర్కార్ ​క్రాప్ ​హాలిడే ప్రకటించింది.  కొన్ని పంటలకు ఇచ్చింది. ఇంకా నాలుగు పంటలకు పెండింగ్​లోనే ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు పూర్తిగా అడుగంటి పోయింది. ముంపు భూములన్నీ పైకి తేలాయి. దీంతో ఇకముందు ఆ భూములకు క్రాప్​ హాలిడే లేదని అధికారులు చెప్పినట్లు రైతులు పేర్కొంటున్నారు.

భూములను సాగు చేసుకోవాలని కూడా సూచించార ని చెప్తున్నారు. అధికారులు చెప్తున్నట్టుగా భూములు సాగు చేసుకోవాలంటే బోర్లు, కరెంటు మోటార్లు, కరెంటు ట్రాన్స్​ఫార్మర్లు అవసరం ఉంది. ముంపుతో ఏ ఒక్కటి కూడా పనికి రాకుండా పోయాయి.  దీంతో సంబంధిత అధికారులను సంప్రదిస్తే తామేం చేయలేమని చేతులెత్తేసినట్లు రైతులు చెప్తున్నారు.  ఒకవైపు క్రాప్​హాలిడే లేదు, మరోవైపు భూములు సాగు చేయలేని స్థితి నెలకొంది.  దీంతో రైతులు రెండు విధాలుగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మా భూములు సర్కారే​ తీసుకోవాలె

క్రాప్​హాలిడే లేదు. సాగు చేసే పరిస్థితి లేదు. ఒకవేళ రూ.లక్షలు ఖర్చు చేసి మళ్లీ బోర్లు వేసుకొని సాగు చేస్తే, భవిష్యత్​లో బ్యాక్​వాటర్​రాదనే నమ్మకం లేదు. భూములు ఉండి కూడా సాగుచేసుకోలేకపోతున్నం.  రెండు విధాలుగా నష్టపోతున్నం. మా భూములను సర్కారే తీసుకొని ఆదుకోవాలి. రైతులకు రావాల్సిన క్రాప్​హాలిడే పరిహారం వెంటనే ఇవ్వాలి. 


–  సుంకరి బాపు, మల్లారం, పెద్దపల్లి జిల్లా-