అంతా ఉత్తదే.. వాళ్లిద్దరూ అసలు ఫోనే మాట్లాడలే: ట్రంప్--పుతిన్ ఫోన్ కాల్ ఎపిసోడ్‎లో బిగ్ ట్విస్ట్

మాస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. డెమొక్రటిక్ అభ్యర్థిని కమలా హ్యారిస్‎ను చిత్తు చేసి రెండో సారి అగ్రరాజ్య అధ్యక్ష  పీఠం చేజిక్కించుకున్నారు. అయితే, అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఫోకస్ పెట్టినట్లు ఇంటర్ నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‎కు ఫోన్ కాల్ చేసిన ట్రంప్.. ఉక్రెయిన్‎తో ఇక యుద్ధానికి ముగింపు పలకాలని.. సమస్యను తీవ్రతరం చేయవద్దని సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి. 

ఈ క్రమంలో ట్రంప్, పుతిన్ ఫోన్ కాల్‎లో మాట్లాడుకున్నట్లు జరుగుతోన్న ప్రచారంపై రష్యా ప్రభుత్వం స్పందించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ మాట్లాడినట్లు వచ్చిన వార్తలను క్రెమ్లిన్ సోమవారం (నవంబర్ 11) ఖండించింది. యుద్ధంపై పుతిన్- ట్రంప్ చర్చించినట్లు జరుగుతోన్న  ప్రచారమంతా కల్పితమని కొట్టిపారేసింది. అదంతా తప్పుడు సమాచారమని ఫోన్ కాల్ వార్తలను రష్యా తోసిపుచ్చింది. ఇది పూర్తిగా అవాస్తవం. తప్పుడు సమాచారంతో కూడిన కల్పితమని రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మీడియాకు వెల్లడించారు. 

ALSO READ | ప్రపంచం అంతా అమెరికాలో ఏం జరుగుతుందో చూస్తుంటే.. అమెరికన్లు మాత్రం అదే చూశారు..!

రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్, పుతిన్ మధ్య అసలు సంభాషణ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ తో  మాట్లాడేందుకు పుతిన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని డిమిత్రి పెస్కోవ్ క్లారిటీ ఇచ్చారు. ట్రంప్, పుతిన్ మధ్య సంభాషణ జరిగిందని కథనాలు వెలువరించిన వాషింగ్టన్ పోస్ట్, రాయిటర్స్ సంస్థలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్నిసార్లు పేరున్న సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్.. తాను గెలిస్తే ఒక్కరోజులోనే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని పేర్కొన్న విషయం తెలిసిందే.