కామారెడ్డి జిల్లా లో కొత్త టీచర్లు వస్తున్నరు

  • కామారెడ్డి జిల్లా లో 506 పోస్టుల భర్తీ 
  •  పూర్తయిన సర్టిఫికెట్ల పరిశీలన 
  •  ఈనెల 9న అపాయింట్​మెంట్​ లెటర్లు 

కామారెడ్డి, వెలుగు : దసరా సెలవులు కంప్లీట్ అయి స్కూల్స్ తెరిచే నాటికి కొత్త టీచర్లు రానున్నారు. డీఎస్సీ ఎగ్జామ్స్ లో మెరిట్ సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పక్రియ పూర్తయ్యింది. కొత్త టీచర్ల రాక తో కామారెడ్డి జిల్లా లోని స్కూల్స్ లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కానున్నాయి. కొత్త టీచర్ల రాక తో బోధన కష్టాలు తీరనున్నాయి. కామారెడ్డి జిల్లా లో 990 గవర్నమెంటు స్కూల్స్ ఉన్నాయి. ఇందులో 684 ప్రైమరీ స్కూల్స్, 124 యూ పీ ఎస్ , 182 హైస్కూల్స్ ఉన్నాయి. 

వీటిలో 75 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 4,082 మంది టీచర్లు పనిచేస్తున్నారు. చాలా వరకు ప్రైమరీ స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా టీచర్లు లేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. హై స్కూల్ లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. టీచర్లులేకపోవడంతో గవర్నమెంట్​ స్కూళ్లలో కొంతకాలంగా విద్యా ప్రమాణాల మీద ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం డీఎస్సీని ప్రకటించింది. ఈ ఏడాది జూలై 18 నుంచి ఆగస్టు5 వరకు ఆన్​లైన్​లో డీఎస్సీ ఎగ్జామ్స్ జరిగాయి. 

సెప్టెంబర్ 30 రిజల్ట్ ప్రకటించారు. మెరిట్ మార్కుల ఆధారంగా 1:3 పద్ధతిలో అభ్యర్ధులను ఎంపిక చేసి సర్టిఫికెట్లు పరిశీలించారు. ఈనెల 5 నాటికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పక్రియ కంప్లీట్ అయ్యింది. టీచర్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఈ నెల 9 న నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు ఇది వరకే ప్రభుత్యం ప్రకటించింది. ఖాళీగా ఉన్న స్థానాల్లో కొత్త టీచర్లు వస్తుండటం తో ప్రభుత్వ స్కూల్స్ లో విద్య బోధన మెరుగు పడే అవకాశం ఉంది.

జిల్లాలో భర్తీ కానున్న పోస్టులు 

జిల్లాలో మొత్తం 506 పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో ఎక్కువగా ఎస్ జీటీ పోస్టులే ఉన్నాయి. దీంతో ప్రైమరీ స్కూళ్లలో కొరత దాదాపు తీరనుంది. 121 మంది ఆయా సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్, 15 మంది లాంగ్వెజి పండిట్, ఐదుగురు పీఈటీ, 318 మంది ఎస్ జీటీ, 47 మంది స్పెషల్ క్యాటగిరి టీచర్లు రానున్నారు.

 టీచర్లుగా ఎంపికవుతున్నవారిలో 163 మంది ఓసీలు, 85 మంది ఎస్సీలు, 45 మంది ఎస్టీలు, 43 మంది బీసీ ఏ, 38 మంది బీసీ బీ, 8 మంది బీసీ సీ , 22 మంది బీసీ డి, 14 మంది బీసీ ఈ, 28 మంది దివ్యాంగులు, 43 మంది ఈ డబ్యూ ఎస్ ఉండగా, ఐదుగురు స్పోర్ట్ కోటా, 12 మంది సైనికుల కోటాలో ఉద్యోగాలు పొందుతున్నారు.