కొత్త టీచర్ల మొదటి జీతానికి తప్పని తిప్పలు

  • జిల్లా ట్రెజరీ ఆఫీస్ లో కొత్త టీచర్లకు ఇబ్బందులు 
  • ప్రాన్ నెంబర్లు కేటాయించడంలో సిబ్బంది ఆలస్యం

వనపర్తి, వెలుగు : ఏండ్ల నిరీక్షణ తర్వాత పరీక్షలు రాసి, ర్యాంకులు తెచ్చుకొని ఉద్యోగం సాధించిన  కొత్త టీచర్లకు  తొలి జీతం తీసుకుందామన్నా తిప్పలు తప్పడం లేదు. ట్రెజరీ ఐడీ తో పాటు ప్రాన్ నెంబర్ జనరేట్​ చేయడానికి కొత్తసార్లు ట్రెజరీ ఆఫీస్​ చుట్టూ రోజూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. కొలువులో చేరి నెల అయిపోయినా ట్రైజరీ ఆఫీస్ సిబ్బంది తీరుతో ఇప్పటికీ టీచర్లు మొదటి జీతాన్ని అందుకోలేదు. వనపర్తి జిల్లాలో 152 మంది టీచర్​ కొలువులు సాధించి ఆయా పాఠశాలల్లో పోస్టింగ్​లు తీసుకున్నారు.

 తమ జీతాల కోసం జిల్లా విద్యాశాఖ అధికారులు తప్పనిసరిగా ట్రెజరీ ఐడీ తో పాటు ప్రాన్ నెంబర్ కావాలని కోరడంతో టీచర్లు ట్రెజరీ ఆఫీస్ కు బారులు తీరుతున్నారు. జిల్లా ట్రెజరీ అధికారులు కేటాయించే ట్రెజరీ ఐడీ, ప్రాన్ నెంబర్ల ఆధారంగానే కొత్త టీచర్ల జీతాల బిల్లులు చేయాల్సి ఉంటుంది. దీంతో ఇదే అదునుగా జిల్లా ట్రెజరీ ఆఫీసులోని కొందరు కింది స్థాయి అధికారులు వసూళ్ల పర్వానికి తెరలేపారు. టీచర్ల పని కావాలంటే తప్పకుండా రూ.500 నుంచి రూ వెయ్యి వరకూ ఇవ్వాల్సిందేననిఅంటున్నారు. 

ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో  వారికే ట్రెజరీ ఐడీ, ప్రాన్ నెంబర్లు కేటాయిస్తున్నారు. డబ్బులు ఇవ్వని టీచర్లకు ఇంకా సమయం పడుతుందంటూ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. వనపర్తి జిల్లాలో వనపర్తి, ఆత్మకూరు లో ట్రెజరీ కార్యాలయాలు ఉండగా రెండు చోట్ల అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. 

నెలరోజులైనా జీతాలు రాలే 

డీఎస్పీ-2024 ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు అక్టోబరు 10న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అక్టోబర్ 16న జాయినింగ్ ఆర్డర్లు తీసుకొని, వారికి కేటాయించిన స్కూళ్లలో చేరారు. ఈ నెలలో అయినా జీతాలు రావాలంటే ఈ నెల 25 లోగా ట్రెజరీ ఐడీ, ప్రాన్ నెంబర్లు తప్పనిసరిగా తీసుకొని ఆయా మండలాల నుంచి జీతాల బిల్లులను ట్రెజరీ ఆఫీస్​కు పంపించాలి. 

లేకుంటే తర్వాతి నెలలోనే జీతాల బిల్లులు చేయాల్సి ఉంటుంది. కొత్త ఉద్యోగం మొదటి జీతం కళ్ల చూద్దామంటే ట్రెజరీ ఆఫీసర్ల ఇబ్బందులతో ఆ కల దూరమవుతోంది. దీంతో తప్పని పరిస్థితుల్లో కొందరు రూ.500 ఇచ్చి తమ పని చేయించుకుంటున్నారు. డబ్బులు ఇవ్వని టీచర్లకు ఇంకా సమయం పడుతుందంటూ తమ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ మానసికంగా ఆందోళనకు గురిచేస్తున్నారు.

 నా దృష్టికి రాలేదు, టీచర్లకు నంబర్లు ఇస్తాం

కొత్త టీచర్లకు ట్రెజరీ ఐడీ, ప్రాన్ నెంబర్లు మా శాఖ ఆధ్వర్యంలోనే కేటాయిస్తున్నాం. వీటి కోసం మా కార్యాలయం సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. సిబ్బంది తో మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త టీచర్లకు ట్రెజరీ ఐడీ, ప్రాన్ నెంబర్లు కెటాయిస్తాం. 

కొత్త టీచర్ల జీతాల విషయంలోనూ వారికి సీఎం చేతుల మీదుగా ఆర్డర్లు తీసుకున్నప్పటి నుంచా, లేదా డీఈఓ లు ఇచ్చిన జాయినింగ్ ఆర్డర్ల తేదీల నుంచా అనేది క్లారిటీ ఇంకా రాలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం కొత్త టీచర్లకు జీతాలు చెల్లిస్తాం.– శ్రీనివాసులు, జిల్లా ట్రెజరీ శాఖ అధికారి, వనపర్తి.