పాతోళ్లు పోతున్నా.. కొత్తోళ్లు వస్తలే..

  • ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ రిమ్స్‌‌‌‌‌‌‌‌లో జాయినింగ్‌‌‌‌‌‌‌‌కు వెనుకాడుతున్న కొత్త స్టాఫ్‌‌‌‌‌‌‌‌
  • ముగ్గురు ప్రొఫెసర్లు, ఏడుగురు అసోసియేట్  ప్రొఫెసర్లు, 
  • 70 మంది స్టాఫ్ నర్సుల  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌తో తిప్పలు
  • వైద్య సేవలపై ప్రభావం  చూపుతున్న బదిలీలు
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై  రిమ్స్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ల దృష్టి

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ రిమ్స్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో వైద్య సేవలపై బదిలీల ప్రభావం పడింది. ఇటీవల ప్రొఫెసర్, అసోసియేట్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్, స్టాఫ్  నర్సుల బదిలీలు జరిగాయి. వారి స్థానాల్లో ఇంకా కొత్త వారు జాయిన్‌‌‌‌‌‌‌‌ కాకపోవడంతో ఖాళీ అయిన పోస్టులు భర్తీ అవుతాయో లేదోనన్న ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఖాళీలతో సతమతమవుతున్న రిమ్స్‌‌‌‌‌‌‌‌లో వైద్య సేవలపై బదిలీలు మరింత ప్రభావం చూపుతున్నారు.

ప్రారంభం నుంచీ ఖాళీలే...

2008లో ప్రారంభమైన రిమ్స్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో పోస్టులు భర్తీ కాలేదు. వెనుకబడిన జిల్లా కావడం, సరైన సదుపాయాలు, సరిపడా వేతనం ఉండదన్న ఉద్దేశంతో చాలా మంది ఇక్కడ పని చేసేందుకు ముందుకు రావడం లేదు. వర్షాకాలం కావడంతో సీజనన్‌‌‌‌‌‌‌‌ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. నిత్యం రిమ్స్‌‌‌‌‌‌‌‌కు వందల సంఖ్యలో రోగులు వస్తున్నారు. వారికి సరైన వైద్యం అందించేందుకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఇలాంటి సమయంలో పెద్ద ఎత్తున బదిలీలు జరగడంతో రోగులకు వైద్యసేవలు అందించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక అసోసియేట్, అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ పోస్టుల ఖాళీతో వైద్య విద్యను అభ్యసించే మెడికోలకు సైతం సమస్యలు వస్తున్నాయి.

ఇక్కడ పనిచేసేందుకు విముఖత

రిమ్స్‌‌‌‌‌‌‌‌లో పని చేసేందుకు వైద్యులు, సిబ్బంది ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఉన్న వారితోనే నెట్టుకొస్తున్న సమయంలో బదిలీలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. బదిలీల్లో భాగంగా రిమ్స్‌‌‌‌‌‌‌‌ నుంచి డాక్టర్లు, సిబ్బంది రిలీవ్‌‌‌‌‌‌‌‌ అవుతున్నప్పటికీ.. వారి స్థానంలో కొత్తవారు జాయిన్‌‌‌‌‌‌‌‌ కాకపోవడం సమస్యగా మారింది. అనస్థీషియా, పాథాలజీ, ఫార్మకాలజీ ప్రొఫెసర్లు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ కాగా, వారి స్థానంలో ఒక్కరూ కూడా రాలేదు. బయోకెమిస్ట్రీ, ఆప్తమాలజీ నుంచి ఒక్కొక్కరు, జనరల్‌‌‌‌‌‌‌‌ మెడిసిన్‌‌‌‌‌‌‌‌ విభాగంలో ఇద్దరితో కలిపి నలుగురు అసోసియేట్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్లు బదిలీ కాగా ఏ ఒక్కరూ రాలేదు.

అలాగే త్వరలో ట్యూటర్ల బదిలీలు జరగనున్నాయి.  ఇప్పటికే 24 ట్యూటర్‌‌‌‌‌‌‌‌ పోస్టులు ఖాళీ ఉండగా, 32 మంది పని చేస్తున్నారు. బదిలీల్లో సగం మంది వెళ్లిపోతారని అంటున్నారు. రిమ్స్‌‌‌‌‌‌‌‌లో పని చేస్తున్న స్టాఫ్‌‌‌‌‌‌‌‌ నర్సులు జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు బదిలీ అయ్యారు. 351 పోస్టుల్లో 290 మంది పని చేస్తుండగా, 70 మంది బదిలీపై వెళ్లారు. ఇప్పటివరకు 12 మంది మాత్రమే ఇక్కడ జాయిన్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. ఇక 41 మంది హెడ్ నర్సు పోస్టులు ఉండగా, 31 మంది పని చేస్తున్నారు. ఇప్పటికే10 ఖాళీలు ఉండగా, 25 మంది బదిలీ కోసం సిద్ధమైనట్లు 
తెలుస్తోంది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి.
 
రిమ్స్‌‌‌‌‌‌‌‌లో వైద్య సేవలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు రిమ్స్​ఆఫీసర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్యుల పోస్టుల భర్తీ కోసం వాక్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ ఇంటర్య్వూ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్ట్ పద్దతిన ప్రొఫెసర్, అసోసియేట్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్స్‌‌‌‌‌‌‌‌, ట్యూటర్స్, సివిల్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ సర్జన్స్‌‌‌‌‌‌‌‌, సీఏంవో పోస్టులను భర్తీ చేయాలని డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ మంగళవారం నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌  ఇచ్చింది. ఆగస్టు 6న ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని
 సూచించారు.

ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై ప్రభావం

ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ రిమ్స్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్రలోని కిన్వట్, నాందేడ్, బోరి, పాండ్రకావడ ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. ఇప్పుడిప్పుడే ఆధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వస్తుండడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే అవస్థలు తప్పుతున్నాయి. ఈ క్రమంలో డాక్టర్లు, సిబ్బంది కొరతతో వైద్య సేవలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. అటు సూపర్‌‌‌‌‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో సైతం ఖాళీలు వెక్కిరిస్తుండగా, ఇప్పుడు రిమ్స్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు అదే పరిస్థితి వచ్చింది. సూపర్‌‌‌‌‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు 52 డాక్టర్​ పోస్టులు మంజూరు కాగా 9 మంది మాత్రమే పని చేస్తున్నారు. 43 పోస్టులు ఖాళీ ఉండగా, ప్రస్తుతం కార్డియాలజీ, యూరాలజీ, న్యూరో సర్జన్‌‌‌‌‌‌‌‌, పీడియాట్రిక్‌‌‌‌‌‌‌‌ సర్జన్, అనస్థీషియా, సర్జికల్ అంకాలజీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 

పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం

సాధారణ బదిలీల నేపథ్యంలో రిలీవ్  అయిన వారి స్థానంలో డాక్టర్ల పోస్టుల భర్తీ కోసం చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల 6న వాక్  ఇన్  ఇంటర్వ్యూ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. మిగతా స్టాఫ్  భర్తీ కోసం ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. ప్రస్తుతం ఉన్న డాక్టర్లు, సిబ్బందితో రోగులకు పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తున్నాం. 

జైసింగ్‌‌‌‌‌‌‌‌ రాథోడ్, రిమ్స్  డైరెక్టర్‌‌‌‌‌‌‌‌