శివుడి ప్రతిమ దొరికిందా?
టైటిల్ - సురాపానం
కాస్ట్ - సంపత్ కుమార్, ప్రగ్యా నయన్, అజయ్ ఘోష్, సూర్య, ఫిష్ వెంకట్, మీసాల లక్ష్మణ్, చమ్మక్ చంద్ర
డైరెక్షన్ - సంపత్ కుమార్, ప్లాట్‌ఫాం - అమెజాన్ ప్రైమ్
లాంగ్వేజ్ - తెలుగు
పల్లెటూళ్లో చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు శివ (సంపత్ కుమార్). మల్లన్న అనే అతను ఒక గని తవ్వే బాధ్యతను శివకు అప్పగిస్తాడు. ఆ తవ్వకాల్లో శివుడి ప్రతిమ ఉన్న ఒక బాక్స్ బయటపడుతుంది. ఆ బాక్స్‌లో చిన్న సీసాలో ఒక ద్రవం ఉంటుంది. ఆ ద్రవాన్ని శివ తాగుతాడు. దాన్ని తాగడం వల్ల శివకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆ తర్వాత అనుకోకుండా ఆ బాక్స్ మిస్ అవుతుంది. దాంతో మల్లన్న తన మనుషులతో శివని వెతికే పనిలో పడతాడు.
వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? శివుడి ప్రతిమ ఎక్కడుంది? శివ చేతికి తిరిగి వస్తుందా? హీరోయిన్ని హీరో ఎలా కలుసుకుంటాడు? వంటివన్నీ ప్రశ్నలే. వీటన్నింటికీ సమాధానాలు తెలియాలంటే సురాపానం చూడాల్సిందే. డైరెక్టర్‌గా, హీరోగా రెండు పాత్రలు పోషించిన సంపత్ కథ పరంగా బాగానే ఆకట్టుకున్నాడు. ఓవరాల్‌గా సురాపానం తాగితే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వంటి దశలకు మారిపోవడం అనేది ఇందులో ఉన్న కాన్సెప్ట్. కామెడీ బాగానే పండింది.
ఫ్రెండ్షిప్ అంటే వీళ్లదే..
టైటిల్ - సురాపానం
కాస్ట్ - నవీన్ కస్తూరియా, శివంకిత్ సింగ్ పరిహార్, అభిలాష్ థప్లియాల్, సన్నీ హిందుజ
డైరెక్షన్ - అపూర్వ్ సింగ్ కర్కి
ప్లాట్‌ఫాం - అమెజాన్ ప్రైమ్
లాంగ్వేజ్ - హిందీ
అభిలాష్(నవీన్ కస్తూరియా)కి రామ్‌పూర్‌లో జిల్లా మెజిస్ట్రేట్‌గా మొదటి పోస్టింగ్ వస్తుంది. అక్కడి నుంచి ఈ సీజన్ మొదలవుతుంది. అభిలాష్ జిల్లా మెజిస్ట్రేట్‌గా ఎలా పనిచేస్తున్నాడనేది మెయిన్ టాపిక్. అయితే తనతోపాటు అభిలాష్ ఫ్రెండ్స్ ఎస్కే (అభిలాష్ తపియల్), గురి (శివంకిత్ పరిహార్)లు కూడా తమ ప్రొఫెషనల్ కెరీర్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అంతా మళ్లీ కలుసుకుంటారు.
దానివల్ల వాళ్ల పర్సనల్ గ్రోత్, ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఎలా ఉంటాడు? నిజాయతీగల ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి? వంటి విషయాల్ని బాగా చెప్పారు. అంతేకాదు.. ఈ సీజన్ చివర్లో కూడా మరో సీజన్ ఉంటుందని హింట్ ఇచ్చాడు డైరెక్టర్. ఇందులో నటించిన ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ బాగుంది. ముఖ్యంగా అభిలాష్ క్యారెక్టర్లో నటించిన నవీన్ కస్తూరియా యాక్టింగ్ చాలా బాగుంది.
నిజంగానే మాస్టర్ పీస్
టైటిల్ - మాస్టర్ పీస్
కాస్ట్ - నిత్యామెనన్, షరఫ్ ఉద్దీన్, రెంజి ఫణిక్కర్, మాలా పార్వతి, అశోకన్, శాంతి కృష్ణ
డైరెక్షన్ - శ్రీజిత్, ప్లాట్‌ఫాం - డిస్నీ ప్లస్ హాట్ స్టార్
లాంగ్వేజ్ - మలయాళం, తెలుగు
రియా (నిత్యామెనన్), బినోయ్ (షరఫ్ ఉద్దీన్) కేరళలో ఉండే ఈ ఇద్దరూ ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అవుతారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెండ్లి కూడా చేసుకుంటారు. ఒక అపార్ట్మెంట్లో కాపురం పెడతారు. కొత్త దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజమే. అలానే వీళ్లద్దరి మధ్య కూడా జరుగుతుంటాయి. ఆ విషయం తెలిసిన వాళ్లిద్దరి పేరెంట్స్ చాలా భయపడిపోతారు. వాళ్ల గొడవలకు సొల్యూషన్ చెప్పాలని ప్రయత్నిస్తారు.
ఆ క్రమంలో వాళ్లిద్దరి గురించి పేరెంట్స్‌కి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలేంటి? ఇంతకీ వాళ్లిద్దర్ని పేరెంట్స్ కలిపారా? లేదా? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. పెండ్లి, పిల్లల విషయంలో నేటి జనరేషన్ ఆలోచన ఎలా ఉంది? అనే విషయాన్ని ఇందులో చెప్పే ప్రయత్నం చేశారు. స్టోరీ అంతా సరదాగా సాగినా చివర్లో మాత్రం ఎమోషన్ని టచ్ చేశారు. దాంపత్య బంధం గురించి కొన్ని మంచి విషయాలు చెప్పారు. ఇందులో ఉన్న అన్ని క్యారెక్టర్లు ఎంటర్టైన్ చేస్తాయి. నిత్యామెనన్, షరఫ్ ఉద్దీన్, మాలా పార్వతిల నటన బాగుంది.