గుంతలు పూడ్చేందుకు..
టైటిల్ : కామ్ చాలూ హై
డైరెక్షన్ : పలాష్ ముచ్చల్
కాస్ట్ : రాజ్‌పాల్ యాదవ్, గియా మానెక్, కురంగి విజయశ్రీ నాగరాజు
ప్లాట్ ఫాం : జీ 5
ప్రతి ఏడాది.. ఇండియన్ రోడ్లపై ఉన్న గుంతల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. అందుకే వాటిని సైలంట్ కిల్లర్స్ అంటుంటారు. వీటి వల్ల జరుగుతున్న ప్రమాదాల గురించి నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ.. ఈసారి అదే విషయాన్ని సినిమా రూపంలో తీసుకొచ్చాడు డైరెక్టర్ ముచ్చల్. ఈ సినిమా వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే.. మనోజ్ (రాజ్‌పాల్ యాదవ్) ఒక రెస్టారెంట్‌లో మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. అతని భార్య రాధ (గియా మానెక్), కూతురు గాయత్రి (కురంగి విజయశ్రీ నాగరాజు)లే అతని ప్రపంచం.
వాళ్లది మహారాష్ట్రలోని ఒక మధ్యతరగతి కుటుంబం. కూతురిని ప్రేమగా ‘గుడియా’ అని పిలుచుకుంటారు. గుడియా చదువులో, ఆటల్లో ముందుంటుంది. మనోజ్ కూతురిపై చాలా ఆశలు పెట్టుకుంటాడు. ఆమె ఏదో ఒక రోజు దేశం గర్వించే క్రికెటర్‌గా ఎదుగుతుందని కలలు కంటాడు. అందుకే ఎంత కష్టమైనా ముంబైలో క్రికెట్ కోచింగ్ ఇప్పించాలి అనుకుంటాడు. అందుకోసం అన్నీ సిద్ధం చేసుకుంటాడు. కానీ.. ముంబయి వెళ్లే ముందురోజు అనుకోకుండా ఒక ప్రమాదం జరుగుతుంది. రోడ్డు మీద ఉన్న ఒక గుంత గుడియా ప్రాణాన్ని బలిగొంటుంది.
గుంతలను పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని మనోజ్ అధికారులను కలుస్తాడు. రోడ్ల మీద గుంతలు లేకుండా చేయాలి అనుకుంటాడు. అలా తన కుమార్తెకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? గుంతలు పూడ్చడానికి అతనేం చేశాడు? అనేది తెలియలాంటే సినిమా చూడాలి. సైడ్ క్యారెక్టర్లకే పరిమితమై కేవలం కామెడీ పాత్రలే చేసే యాక్టర్‌గా పేరున్న రాజ్‌పాల్ యాదవ్ ఈ సినిమాలో తన సత్తా చాటుకున్నాడు.
నచ్చని మనిషిలో తప్పులే కనిపిస్తాయి
టైటిల్ : ఆట్టం
డైరెక్షన్ : ఆనందర్ ఎకర్షి
కాస్ట్ : వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్
కేరళలో నాటకాలు వేసే ఒక టీం ఉంటుంది. అందులో 12 మంది ఉంటారు. ఆ పన్నెండు మందిలో ఒకే ఒక్క మహిళ ఉంటుంది. ఆ టీంలో ఉన్న వాళ్లంతా మధ్యతరగతి కుటుంబాల వాళ్లే. అందరూ కూడా వేరు వేరు పనులు చేసుకుంటూ ఛాన్స్ వచ్చినప్పుడు నాటకాలు వేస్తుంటారు. ఈ టీం వేసే నాటకంలో వినయ్ (వినయ్ ఫోర్ట్), అంజలి (జరీన్ షిబాబ్), హరి (కళాభవన్ షాజాన్)లు ముఖ్య సభ్యులు. సినిమా నటుడు అయిన హరికి వాళ్లు వేసే నాటకంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అది వినయ్‌కు నచ్చదు.
వీళ్లు వేసిన నాటకం బాగా నచ్చిన ఒక విదేశీ జంట వాళ్ల రిసార్ట్‌లో పార్టీ అరేంజ్ చేస్తుంది. ఆ పార్టీలో అందరూ మందు తాగుతారు. ఆ తరువాత ఎవరికి ఇచ్చిన రూంలోకి వాళ్లు వెళ్లి నిద్రపోతారు. అంజలి కిటికీ పక్కన నిద్రపోతుంది. అర్ధరాత్రి టైంలో అంజలి నిద్రపోతున్న కిటికీలోనుంచి చెయ్యి పెట్టి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు ఒక వ్యక్తి. ఆ 12 మంది సభ్యుల్లో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించింది వాళ్లు ఎవరు? అంజలి ఈ విషయాన్ని ఎలా బయటపెట్టింది? చివరకు ఆ వ్యక్తిని గుర్తించారా? అనేది సినిమా.
ఒక వ్యక్తి నచ్చకపోతే ఆ వ్యక్తి ఏం చేసినా అందులో తప్పే కనిపిస్తుంది. సగటు మనిషి ఈ స్వభావాన్ని తెర మీద చూపించిన తీరు బాగుంది. తప్పు చేసిన వ్యక్తిని కనుక్కునే ప్రయత్నంలో ఎదుటి వ్యక్తి తప్పులను చెప్పేందుకు ఎవరికి వాళ్లు తాపత్రయపడతారు. అంతే తప్ప అంజలి బాధను వాళ్లలో ఎవరూ అర్ధం చేసుకోరు. క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్‌తో ముగుస్తుంది.
అసలేం జరిగింది?
టైటిల్ : ఆర్టికల్ 370
డైరెక్షన్ : ఆదిత్య సుహాస్ జంభలే
కాస్ట్ : యామీ గౌతమ్, ప్రియమణి, అరుణ్ గోవిల్, కిరణ్ కర్మాకర్
ప్లాట్ ఫాం : జియో సినిమా
ఇందులో 2016 నుండి కాశ్మీర్ లోయలో ఏం జరిగింది అనేది చూపించారు. అధికార రాజకీయ పార్టీ, ప్రతిపక్ష పార్టీ, టెర్రరిస్టులు, కాశ్మీరీ స్థానిక ప్రజలు ఇలా అన్ని అంశాలను... ఆరు భాగాలుగా ఇందులో చూపించారు. ఈ సినిమా చూస్తే.. ఆర్టికల్370లో ఏం ఉందనేది కాస్త అర్థం అవుతుంది. కాశ్మీర్ లోయలో ప్రముఖ వ్యక్తి, ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహించే బుర్హాన్ వనీ హత్యతో సినిమా మొదలవుతుంది. బుర్హాన్ హత్య తర్వాత కాశ్మీర్‌లో నెలకొన్న అశాంతిని ఇందులో బాగా తెరకి ఎక్కించారు.
పీఎంవో సెక్రటరీ రాజేశ్వరి స్వామినాథన్ (ప్రియమణి) ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా, కంపోజ్డ్‌గా హ్యాండిల్ చేసే మహిళ. ఇందులో 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి.. దాని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరనే దానిపై జరిగే విచారణ కూడా చూపించారు. జూని హక్సర్ (యామీ గౌతమ్) ఇంటెలిజెన్స్ ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంది. అక్కడికక్కడే సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల పై అధికారులు ఆమెపై ‘అహంకారి’ అనే ముద్ర వేస్తారు. ఆమెకు ఆర్టికల్370తో సంబంధం ఏంటి? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
దేశభక్తి అనే కాన్సెప్ట్‌ని పెద్దగా టచ్ చేయకుండా సినిమా తీశాడు డైరెక్టర్. ఇందులో కశ్మీరీల బాధలను చూపించారు. ప్రియమణి, యామీ గౌతమ్ పోటీ పడి మరీ నటించారు.