స్ట్రీమ్ ఎంగేజ్: OTTలో ఈ కొత్త సినిమాలు చూశారా..? ఎలా ఉన్నాయంటే..

చాచు ఏమయ్యాడు?

టైటిల్ : కిష్కింద కాండం

ప్లాట్​ ఫాం : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
డైరెక్షన్ : దింజిత్ అయ్యతన్  
కాస్ట్ :  ఆసిఫ్ అలీ, అపర్ణా బాలమురళి, విజయ్ రాఘవన్​, జగదీష్, అశోకన్ 
లాంగ్వేజ్​ : మలయాళం, తెలుగు

అజయ్‌‌ చంద్రన్‌‌ (ఆసిఫ్‌‌ అలీ) ఫారెస్ట్‌‌ ఆఫీసర్​గా పనిచేస్తుంటాడు. అతని భార్య అనారోగ్యంతో చనిపోతుంది. నాలుగేళ్ల కొడుకు చాచు (మాస్టర్‌‌ ఆరవ్‌‌) కనపడకుండా పోతాడు. దాంతో అజయ్, అపర్ణ (అపర్ణా బాలమురళి)ని రెండో పెళ్లి చేసుకుంటాడు. వాళ్ల ఫ్యామిలీ ఒక అటవీ ప్రాంతంలోని చిన్న ఊరిలో ఉంటుంది. అజయ్‌‌ తండ్రి అప్పు పిళ్లై (విజయ రాఘవన్‌‌) ఆర్మీ మాజీ ఆఫీసర్‌‌.​ కాబట్టి అతని దగ్గర లైసెన్స్‌‌ తుపాకీ ఉంటుంది.

కానీ.. అక్కడ ఎన్నికలు జరుగుతుండడంతో శాంతి భద్రల దృష్ట్యా తన  గన్​ని పోలీస్‌‌స్టేషన్‌‌లో అప్పగించాలని అధికారులు నోటీసులు ఇస్తారు. అప్పు అసలే మతిమరుపు మనిషి. అందుకే గన్​ ఎక్కడ పెట్టాడో మరిచిపోతాడు. పోయిన తుపాకీని వెతుకుతున్న క్రమంలో అది ఓ కోతి చేతిలో ఉన్న ఫొటోలు బయటకు వస్తాయి. కొత్తగా పెళ్ళి చేసుకొని ఆ ఇంటికి వచ్చిన అపర్ణకి అప్పు పిళ్లై బిహేవియర్ వింతగా అనిపిస్తుంది. దాంతో ఆమె అతడిని ఫాలో చేస్తుంది. చివరికి ఆమెకు తెలిసిన నిజం ఏంటి? గన్​ ఏమైంది? కనపడకుండా పోయిన కొడుకు చాచు ఏమయ్యాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

భూమి కోసం పోరాటం

టైటిల్ : తెక్కు వడక్కు
 ప్లాట్​ ఫాం : మనోరమ మ్యాక్స్
డైరెక్షన్ : ప్రేమ్ శంకర్
 కాస్ట్ :  సూరజ్ వెంజరమూడు, వినాయకన్, మెరిన్ జోస్, వినీత్ విశ్వం, మెల్విన్ జి బాబు, షమీర్ ఖాన్
లాంగ్వేజ్​ : మలయాళం

మాధవన్ (వినాయకన్) రిటైర్డ్ గవర్నమెంట్​ ఆఫీసర్​. శంగుని (సూరజ్ వెంజరమూడు) చిన్న రైస్ మిల్లు నడుపుతుంటాడు. ఇద్దరిదీ ఒకే ఊరు. చిన్నప్పటి నుండి ఒకరికొకరు తెలుసు. ఒకే ఫ్రెండ్​ సర్కిల్​తో కలిసి పెరిగారు. కానీ.. ఎప్పుడూ కలిసి ఉండరు. కారణం.. వాళ్ల కుటుంబాల మధ్య ఉన్న శత్రుత్వం. వాళ్ల తండ్రులు కూడా ఒకరికొకరు శత్రువులే.

దాంతో వాళ్ల మధ్య కూడా దూరం పెరుగుతూ వచ్చింది. దానివల్లే ఎప్పుడూ గొడవపడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే.. ఇద్దరూ ఒక భూమి కోసం 30 ఏళ్లుగా కోర్టులో పోరాటం చేస్తుంటారు. వయసుపైబడినా ఇద్దరూ వెనుకడుగు వేయకుండా కోర్టు ఇచ్చే తీర్పు కోసం వెయిట్​ చేస్తుంటారు. ఇంతకీ కోర్డు ఆ భూమి ఎవరికి ఇచ్చింది? ఇద్దరూ ఒక్కటయ్యారా? లేదా? అనేది మిగతా కథ. 

కిడ్నాప్​!

టైటిల్ : యే కాళీ కాళీ అంఖీన్ సీజన్ 2
ప్లాట్​ ఫాం :  నెట్‌‌ఫ్లిక్స్,  డైరెక్షన్ : సిద్ధార్థ్ సేన్‌‌గుప్తా
కాస్ట్ :  తాహిర్ రాజ్ భాసిన్, శ్వేతా త్రిపాఠి, సౌరభ్ శుక్లా, గుర్మీత్ చౌదరి, ఆంచల్ సింగ్, సూర్య శర్మ, అరుణోదయ్ సింగ్ 
లాంగ్వేజ్​ : హిందీ

యే కాళీ కాళీ అంఖీన్ మొదటి సీజన్‌‌ కథకు కొనసాగింపుగా ఈ సీజన్​ని తీశారు. మొదటి సీజన్​లో విక్రాంత్ (తాహిర్ రాజ్ భాసిన్)ని పూర్వ (ఆంచల్ సింగ్) ప్రేమిస్తుంది. విక్రాంత్​కి ఇష్టం లేకున్నా పూర్వ తండ్రి గ్యాంగ్‌‌స్టర్ కావడంతో తప్పక పెండ్లి చేసుకుంటాడు. అతను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వదులుకోవాల్సి వస్తుంది. దాంతో పూర్వ మీద కోపం పెంచుకుంటాడు. చివరకు ఆమెను చంపాలని డిసైడ్​ అవుతాడు. మిగతా కథ సీజన్​ 2లోచూపించారు. ఇందులో విక్రాంత్ పూర్వని చంపడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు.

ఆమె వెళ్లిన థియేటర్‌‌లో బాంబు పెట్టడానికి కూడా రెడీ అవుతాడు. కానీ.. చివరకు ఆమెని చంపే పనిని జలాన్ (అరుణోదయ్ సింగ్) అనే రౌడీకి అప్పగిస్తాడు. అతనేమో విక్రాంత్​ని మోసం చేసి.. పూర్వను చంపకుండా కిడ్నాప్​ చేస్తాడు.  పూర్వ తండ్రి అఖేరాజ్ (సౌరభ్) తనకు100 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే ఆమెను వదిలేస్తానని విక్రాంత్​ని బెదిరిస్తాడు. జలాన్‌‌ ఎదురు తిరగడంతో దిక్కుతోచని స్థితిలో పడతాడు విక్రాంత్​. ఆ తర్వాత జలాన్​ పూర్వని రిలీజ్​ చేయకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. చివరికి ఏం జరిగింది? అఖేరాజ్​ ఏం చేశాడు? తెలియాలంటే ఈ వెబ్​సిరీస్​ చూడాలి.