స్ట్రీమ్ ఎంగేజ్ :  మర్డర్ కేస్ సాల్వ్​ చేస్తాడా?​

టైటిల్ : అన్వేషిప్పిన్ కండెతుమ్​
డైరెక్షన్ : డార్విన్ కురైకోస్
కాస్ట్ : టొవినో థామస్, ఆర్తన బిను, అశ్వతి మనోహరన్, రాహుల్ రాజగోపాల్, ఇంద్రాన్స్, జాఫర్
ప్లాట్​ఫాం : నెట్​ఫ్లిక్స్
లాంగ్వేజ్ : తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ

ఆనంద్​ నారాయణన్ (టొవినో థామస్) చింగావనం అనే ఊరిలో ఎస్​.ఐ.గా పనిచేస్తుంటాడు. ఒక అమ్మాయి మిస్సింగ్​ కేస్ విషయంలో ఎంతో కష్టపడి నేరస్తుడిని పట్టుకుంటాడు. అయితే, అతను పోలీసుల కళ్లముందే సూసైడ్ చేసుకుంటాడు. దాంతో ఆనంద్​ టీంని డిపార్ట్​మెంట్​ సస్పెండ్ చేస్తుంది. ఆ తర్వాత అనుకోకుండా మరో  కేసు వస్తుంది. దాన్ని అనధికారికంగా ఇన్వెస్టిగేట్​ చేయడం మొదలుపెడతాడు ఆనంద్.

మరి ఆ కేస్ సాల్వ్​ చేశాడా? సస్పెన్షన్​ తీసేశారా? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇప్పటికే ఎన్నో రకాల ఇన్వెస్టిగేటివ్​ థ్రిల్లర్స్ చాలా చూసుంటాం. కానీ వేటికవే భిన్నంగా ఉంటాయి. ఇది కూడా అంతే. ట్విస్ట్​ల పరంగా మెప్పించింది ఈ సినిమా. ఇందులో మర్డర్ కేస్​ సాల్వ్ చేయడం మాత్రమే చూపించలేదు. వాటితోపాటు పోలీస్​ వ్యవస్థలో జరిగే రాజకీయాలు కూడా చూపించే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఈ కథ1980–90 మధ్య జరిగిన ఒక పోలీస్​ స్టోరీ. టొవినో థామస్ యాక్టింగ్, బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్​, సినిమాటోగ్రఫీ బాగున్నాయి.

‘స్టూడియో’ పోరు

టైటిల్ : షో టైం​
డైరెక్షన్ : సుమిత్ రాయ్ 
కాస్ట్ : ఇమ్రాన్ హష్మి, నసీరుద్దీన్​ షా, మహిమ మక్వానా, మౌనీ రాయ్, రాజీవ్ కండెల్వాల్, శ్రియా శరణ్​, విజయ్ రాజ్
ప్లాట్​ఫాం : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
లాంగ్వేజ్ : తెలుగు, హిందీ

తండ్రి (నసీరుద్దీన్​ షా) కట్టించిన విక్టరీ స్టూడియోస్‌ని కొడుకు రఘు ఖన్నా (ఇమ్రాన్ హష్మీ) చూసుకుంటుంటాడు. అయితే, కొడుకు ‘ఓకే’ చేస్తున్న పనులు, తీస్తున్న సినిమాలు తండ్రికి నచ్చవు. రఘు కొత్తగా తీసిన ‘ప్యార్​ డేంజరస్’ అనే సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. క్రిటిక్స్​కి లంచం ఇచ్చి అయినా పాజిటివ్​ రివ్యూలు చెప్పించాలని ప్రయత్నిస్తాడు. ‘న్యూస్ సమాచార్‌‌’ అనే మీడియాలో తరుణ్ అనే అతను సినిమా రివ్యూలు రాస్తుంటాడు.

ఆ సినిమా రివ్యూ చేయాల్సిన టైంకి అతనికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆ పనిని జూనియర్​ అయిన మహిక నంది (మహిమ మక్వానా)కి అప్పగిస్తాడు. సినిమా బాగుందని రివ్యూ చెప్పించడం కోసం మహికకు రఘు దగ్గర పనిచేసే జికో (గురుప్రీత్ సైనీ) ద్వారా ఒక స్మార్ట్​ ఫోన్​ ఇప్పిస్తాడు. ఆ తర్వాత ఏమైందనేదే అసలు కథ. ఈ సిరీస్​ రియల్ లైఫ్​లో జరిగే ఇన్సిడెంట్స్​ కొన్ని తీసుకుని తెరకెక్కించారు. డైరెక్షన్, స్క్రీన్​ ప్లే బాగున్నాయి.

సినిమా నాలెడ్జ్‌ కాస్త ఎక్కువ ఉన్నవాళ్లకు బాగా కనెక్ట్ అవుతుంది. యాక్టింగ్ విషయానికొస్తే నసీరుద్దీన్​ షా, ఇమ్రాన్ హష్మీల గురించి చెప్పక్కర్లేదు. ఎప్పటిలానే బాగా చేశారు. మహిక క్యారెక్టర్​లో కనిపించిన మహిమ మక్వానా నటనకు స్కోప్​ ఉన్న పాత్ర దొరికింది. మొదట్లో మైల్డ్​గా కనిపించిన ఆ క్యారెక్టర్​ సిరీస్​ ముందుకు వెళ్తున్న కొద్దీ చాలా బలమైనదిగా మారిపోతుంది.

క్రిస్మస్ నైట్ ఏం జరిగింది?

టైటిల్ : మెర్రీ క్రిస్మస్ 
డైరెక్షన్ : శ్రీరామ్ రాఘవన్
కాస్ట్ : విజయ్​ సేతుపతి, కత్రినా కైఫ్​, రాధిక ఆప్టే, అదితి గోవిత్రికర్, సంజయ్​ కపూర్, టిన్ను ఆనంద్, వినయ్ పాతక్
ప్లాట్​ఫాం : నెట్ ఫ్లిక్స్
లాంగ్వేజ్ : తమిళం, హిందీ

ఆల్బర్ట్ (విజయ్ సేతుపతి) ఏడేండ్ల తర్వాత క్రిస్మస్ రోజు దుబాయి​ నుంచి ముంబైకి వస్తాడు. ఇంటికి వెళ్లేసరికి తల్లి చనిపోయినట్టు తెలుస్తుంది అతనికి. దాంతో ఏమీ తోచక ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్లపై తిరుగుతుంటాడు. కాసేపటి తర్వాత ఒక పెద్ద రెస్టారెంట్​కి వెళ్తాడు. అప్పుడు మరియా (కత్రినా) కనిపిస్తుంది. ఆమెతోపాటు ఆమె కూతురు కూడా ఉంటుంది. ఆల్బర్ట్​, మరియా ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటారు. మరియా తన అపార్ట్​మెంట్​కి రమ్మని ఆల్బర్ట్​ని ఇన్వైట్ చేస్తుంది.

అది చాలా పాత కాలపు బిల్డింగ్​. అపార్ట్​మెంట్​కి వెళ్లాక మ్యూజిక్ వింటూ, డాన్స్​ చేస్తూ.. డ్రింక్​ తాగుతూ.. సరదాగా స్పెండ్ చేస్తారు. కట్ చేస్తే.. మరియా భర్త ఆమె ఫ్లాట్​లోనే హత్యకు గురై ఉంటాడు. ఆ హత్య ఎవరు చేశారు?  ఎందుకు చేశారు? ఇందులో ఆల్బర్ట్​ పాత్ర ఏంటి? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఒక్క రాత్రిలో జరిగే ఈ కథ ఓవరాల్​గా బాగుంది. కానీ, క్రిస్ప్​గా చూపించాల్సిన స్టోరీని చాలా చోట్ల సాగదీసినట్లు అనిపిస్తుంది. చివర్లో ట్విస్ట్ బాగుంది. ఫస్టాఫ్ కాస్త లెంత్​ తగ్గిస్తే ఇంకాస్త బాగుండేది. విజయ్ సేతుపతి యాక్టింగ్​​కి పెద్దగా స్కోప్​ లేదు.