స్ట్రీమ్ ఎంగేజ్  : ఇంటర్నేషనల్​గా ఎదుగుతుందా?

టైటిల్ :  శేషమ్​ మైక్​ - ఇల్​ ఫాతిమా
డైరెక్షన్ ​: మను సి కుమార్​
కాస్ట్ :  కల్యాణి ప్రియదర్శన్​, షహీన్​ సిద్దిఖి, గౌతమ్​ వాసుదేవ్​ మేనన్, అనీష్​, ప్రియా శ్రీజిత్​, సుధేశ్​​
లాంగ్వేజ్ : మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ
ప్లాట్​ ఫాం :  నెట్​ ఫ్లిక్స్​

ఫాతిమా(కల్యాణి ప్రియదర్శన్​) చురుకైన అమ్మాయి. ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుందని ఆమెని ‘వాగుడుకాయ’ అని పిలుస్తుంటారు. ఫాతిమా తండ్రి మునీర్​ (సుధేశ్​), అన్నయ్య ఆసిఫ్​ (అనీష్​) మెకానిక్​ షెడ్​ నడుపుతుంటారు. తల్లి (ప్రియా శ్రీజిత్​) కుటుంబాన్ని నడుపుతుంటుంది. మునీర్ పరువు ప్రతిష్టలే ప్రాణంగా భావిస్తుంటాడు. ఫాతిమాకి చిన్నప్పటినుంచీ ఫుట్​బాల్​ అంటే ఇష్టం.

మగపిల్లలు తనని ఆడనీయరు. దాంతో వాళ్లు ఆడుతుంటే తను కామెంట్రీ చెప్పేది.  కాలేజీకి వచ్చేసరికి ఫుట్​బాల్ టోర్నమెంట్లకు కామెంటేటర్​గా ఫాతిమాకి మంచి పేరు వస్తుంది. దాంతో ఇంటర్నేషనల్ ఫుట్​బాల్​ మ్యాచ్​లకు కామెంటేటర్​గా వ్యవహరించాలనే కోరిక ఆమెలో బలపడి, ఆ ప్రయత్నాలు మొదలుపెడుతుంది. దాన్ని కుల పెద్దలు విమర్శిస్తారు. మునీర్​ ఆమెకి పెండ్లి సంబంధాలు తెస్తుంటాడు. తన కాళ్లపై తాను నిలబడిన తరువాతనే పెండ్లి చేసుకుంటానని చెప్పి ఆమె కొచ్చి వెళ్లి తన ప్రయత్నాలు మొదలుపెడుతుంది. అప్పుడే చేయని తప్పుకి నిషేధానికి గురైన ఫుట్​బాల్​ ప్లేయర్​ సాలొమన్​ (షాహిన్​ సిద్దిఖీ)తో పరిచయం అవుతుంది. ఆ తరువాత ఎన్నో అడ్డంకులు, ఆటుపోట్లు ఎదురవుతాయి. మరి ఇంతకీ ఫాతిమా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందా?

వీరప్పన్​ జీవితంలో...

టైటిల్​ : కూసె మునిసామి వీరప్పన్​
డైరెక్షన్​​ : శరత్​ జోతి
కాస్ట్​ :  కూసె మునిస్వామి వీరప్పన్​, నక్కీరన్​ గోపాల్​, సీమన్​, ఎన్​ రాం, పా పా మోహన్​, సుబ్రమణ్యన్​, అలెగ్జాండర్​ ఐ.పి.ఎస్​, రోహిణి, జీవ తంగవేల్​, మోహన్​ కుమార్​, ధమయంత్​
లాంగ్వేజి : తమిళ, తెలుగు, కన్నడ, హిందీ (ఆరు ఎపిసోడ్లు), ప్లాట్​ ఫాం : జీ 5


వీరప్పన్​ స్వయంగా తన గురించి, తన జీవితం గురించి చెప్పిన అంశాల ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ సిరీస్​ ‘కూసె మునిసామి వీరప్పన్’. 1993, 1996 మధ్య కాలంలో వీరప్పన్​ను ఇంటర్వ్యూ చేసేందుకు అడవిలోకి వెళ్లిన గోపాల్​ అనే రిపోర్టర్​ చేసిన వీడియోలు ఈ సిరీస్​లో ఉంటాయి.

వేటగాళ్ల కుటుంబంలో ఐదుగురు పిల్లల్లో రెండో వాడు కూసె మునిసామి వీరప్పన్(శంతన కడతల వీరప్పన్​)​. చిన్న వయసులో ఆకలిని జయించేందుకు కుటుంబ వృత్తి అయిన వేట మొదలుపెట్టాడు. ఆకలి తీర్చుకోవడం కోసం మొదలైన వేటతో కాలక్రమేణా కోట్ల రూపాయల డబ్బు సంపాదించాడు. తమిళనాడు – కర్నాటక సరిహద్దుల్లో ఉన్న అడవుల్లో కంటపడిన ప్రతి గంధపు చెట్టును నరికి, ఏనుగులను చంపి దంతాలు అమ్మేవాడు. ఈ క్రమంలో వందలమంది ప్రాణాలు తీశాడు. 

మొదటి మూడు ఎపిసోడ్స్​ బాల్యంలో పేదరికం, ఆకలికోసం చేసిన వేట గురించి ఉంటుంది. నాలుగో ఎపిసోడ్​ను సున్నిత మనస్కులు చూడడం కొంచెం కష్టం. కొన్ని సమయాల్లో చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టలేదని అతనే చెప్పిన మాటలు వింటే వెన్నులో వణుకు పుడుతుంది. ఆఖరి ఎపిసోడ్​లో వీరప్పన్​ను ఒక వర్గం ప్రజలు ఎలా ఆదరించారు? రాజకీయ సిద్ధాంతాలు. జయలలితమీద వ్యతిరేకత ఎందుకు? వంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. మొదటి సీజన్ చూసిన వాళ్లు రెండో సీజన్​ కోసం ఎదురుచూడడం మాత్రం ఖాయం.

కాశీ ప్రయాణం

టైటిల్ :  ఫాలిమీ
డైరెక్షన్​ :  నితీష్​ సహదేవ్​
కాస్ట్ :  బసిల్​ జోసెఫ్​, జగదీష్​, మంజు పిళ్లై
లాంగ్వేజ్ :  మలయాళం
ప్లాట్​ ఫాం :  డిస్నీ హాట్​స్టార్​ 

జయజయజయజానకి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఓటీటీ ద్వారా పరిచయం అయిన జోసెఫ్​ ఈ ఫాలిమీ మూవీతో వచ్చాడు.రెమా(మంజు పిళ్లై), చంద్రన్​(జగదీష్​) ఇద్దరు భార్యాభర్తలు. వాళ్లకి ఇద్దరు కొడుకులు. చంద్రన్​ వాళ్ల నాన్నతో కలిసి అందరూ సరదాగా ఉంటారు. ప్రతీ మధ్యతరగతి కుటుంబంలో ఉండే చిన్న చిన్న గొడవల మాదిరి రెమా, చంద్రన్​ల కుటుంబ జీవితం సాగుతుంటుంది. చంద్రన్​ తండ్రికి కాశీకి వెళ్లాలి అని ఉంటుంది.

కాశీకి వెళ్లాలని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రైల్వేస్టేషన్​కి వెళ్తుంటే మూడుసార్లు పట్టుకుంటారు. ఇబ్బందుల్లో ఉన్న ఫ్యామిలీ కోసం చంద్రన్​ పెద్ద కొడుకు బసిల్​ ఒక డబ్బింగ్​ స్టూడియోలో ఉద్యోగం చేస్తుంటాడు. అతనికి ఎన్ని పెండ్లి సంబంధాలు వచ్చినా సెట్​ కావు. మరోవైపు చంద్రన్​ చిన్న కొడుకు అల్లరిచిల్లరిగా తిరుగుతూ డబ్బులు వేస్ట్​ చేస్తుంటాడు. ఇదంతా ఇలా ఉంటే సహకార బ్యాంకులో అందుబాటులో ఉన్న లోన్లన్నీ తీసుకుని వాటికి వడ్డీ కూడా కట్టలేని పరిస్థితిలో చంద్రన్​ కుటుంబం ఉంటుంది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చంద్రన్​ కుటుంబం కాశీకి బయల్దేరుతుంది. ఆ ప్రయాణం సక్సెస్​ అయిందా? వాళ్లకి ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? అనేదే మిగతా కథ. మొదట్లో నెమ్మదిగా ఉన్నట్టు అనిపించినా ఇంటర్వెల్ తర్వాత నుంచి కథలో వేగం పెరుగుతుంది. దాదాపు ప్రతి సీన్​ కామెడీగా ఉంటుంది.