టైటిల్ : వధువు
డైరెక్షన్ : పోలూరు కృష్ణ
కాస్ట్ : అవికా గోర్, నందు, అలీ రెజా, రూపాలక్ష్మి, మాధవి ప్రసాద్, శ్రీధర్ రెడ్డి
లాంగ్వేజ్ : తెలుగు
ప్లాట్ ఫాం : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
అంజూరి ఇందు (అవికా గోర్) ఒక తెలివైన అమ్మాయి. తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతుంది. కానీ.. పెళ్లి పీటల వరకు వచ్చిన తర్వాత పెళ్లి ఆగిపోతుంది. దానికి కారణం.. ఇందూ చెల్లి. కొన్ని నిమిషాల్లో పెళ్లి ముహూర్తం ఉండగా అక్కకు కాబోయే వరుడితో పారిపోయి అతడిని పెళ్లి చేసుకుంటుంది. ఆ బాధ నుంచి తేరుకున్న ఇందు రెండోసారి పెళ్లికి రెడీ అవుతుంది. ఈ పెండ్లికి కూడా కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి.
అయినా.. చివరకు ఆనంద్ (నందు)తో పెళ్లి జరుగుతుంది. అత్తారింటిలో అడుగుపెట్టగానే ఇందుకు చాలా అనుమానాలు కలుగుతాయి. మరిది ఆర్య (అలీ రెజా)కి అప్పటికే పెళ్లి అయిందన్న విషయం తెలుస్తుంది. అప్పటికే అతని భార్య వైష్ణవిని ఇంట్లోంచి వెళ్లగొడతారు. ఆ తర్వాత ఇందు అనుకుని ఆమె ఆడపడుచుని ఎవరో చంపేందుకు ప్రయత్నిస్తారు. ఇంట్లో ప్రతీ ఒక్కరు అర్థం కాని వ్యక్తుల్లా.. అనుమానించే విధంగానే ఉంటారు. ఆనంద్ పెద్దమ్మ కూతురిని ఇందూతో మాట్లాడకుండా దాచిపెడతారు.
అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడుతుంది ఇందు. ఇంతకీ ఆమె అనుమానాలు నిజమయ్యాయా? ఇందుకు కాబోయే భర్తతో ఇందు చెల్లి ఎందుకు వెళ్లిపోతుంది? మతిస్థిమితం లేని ఆనంద్ పెద్దమ్మ కూతుర్ని ఇందుకు కనిపించకుండా ఎందుకు జాగ్రత్తపడ్డారు?ఇది పెళ్లి చుట్టూ తిరిగే కథ. ఇందులో చాలా ట్విస్ట్‌లు ఉన్నాయి. అయితే.. కొన్ని ట్విస్ట్‌లను ఈ సీజన్‌లో ఇంకా రివీల్ చేయలేదు. కథ లోపలికి వెళ్లేకొద్దీ ఎన్నో మలుపులు తిరుగుతుంది.
కల నిజమైందా?
టైటిల్ : లాస్ ఫరాడ్
డైరెక్షన్ : మరియానో బరోసో
కాస్ట్ : పెడ్రో కాసాబ్లాంక్, నోరా నవాస్, మిగ్యుల్ హెరాన్, సుసానా అబైటువా
లాంగ్వేజ్ : ఇంగ్లిష్
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓస్కర్ (మిగ్యుల్ హెరాన్) ఒక అనాథ. జిమ్‌లో ఏరోబిక్స్ ట్రైనర్‌గా పనిచేస్తుంటాడు. ఏదోవిధంగా తన మామ మాన్యువల్ (ఫెర్నాండో టెజెరో)తో కలిసి సొంతంగా జిమ్ పెట్టుకుని, ఉద్యోగం మానేయాలని ఆలోచిస్తుంటాడు ఓస్కర్. అదే టైంలో అనుకోకుండా సారా ఫరాద్ (సుసానా అబైతువా)ని కలుస్తాడు. ఆమె కుటుంబీకులను కలిశాక ఓస్కర్ జీవితం పూర్తిగా మారిపోతుంది. వాళ్లలో లియో, కార్మెన్ (పెడ్రో కాసాబ్లాంక్, నోరా నవాస్)కు చాలా ఆస్తులు ఉంటాయి. వాళ్ల లైఫ్ స్టయిల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్లు ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నామని చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఓస్కర్ జిమ్ పెట్టాడా? ఇంతకీ లియో, కార్మెన్ చేస్తున్న బిజినెస్ ఏంటి?
లీడ్ రోల్స్ చేసినవాళ్లంతా బాగా నటించారు. ఓస్కర్ జీవితంలో ఎదురయ్యే ట్విస్ట్‌లు బాగుంటాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే బాగుంది. చివరి ఆఖరి రెండు ఎపిసోడ్స్‌లో ఊహించని మలుపులు బాగున్నాయి.
తమిళనాడు నుంచి శ్రీలంకకు
టైటిల్ : 800
డైరెక్షన్ : ఎం.ఎస్. శ్రీపతి
కాస్ట్ : మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, ఆడుక్కాలమ్ నరేన్
లాంగ్వేజ్ : తమిళం
ప్లాట్ ఫాం : జియో సినిమా
శ్రీలంక స్టార్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ లైఫ్ స్టోరీ ఆధారంగా తీసిన సినిమా ఇది. టెస్ట్ మ్యాచ్‌ల్లో 800 వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్ ఆయన. టెస్ట్ మ్యాచ్‌ల్లో 22 సార్లు పది వికెట్లు, 67 సార్లు ఐదు వికెట్లు పడగొట్టిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉంది. క్రికెటర్‌గానే కాదు... వ్యక్తిగత జీవితంలోనూ ఆయన ఎంతో మందికి స్ఫూర్తి.
కథలోకి వెళ్తే.. తేయాకు తోటల్లో పనిచేస్తున్న తమిళ కుటుంబంలో పుట్టి పెరుగుతాడు ముత్తయ్య మురళీధరన్(మధుర్ మిట్టల్). 1940కి ముందు ఆంగ్లేయుల రాజ్యం విస్తరిస్తున్న టైంలో ఒక దేశం నుంచి మరో దేశానికి అనేక రకాలుగా వలసలు వెళ్లేవాళ్లు. ముత్తయ్యది కూడా అలా తమిళనాడు నుంచి శ్రీలంకకు వలస వెళ్లిన కుటుంబమే.
వాళ్లు శ్రీలంకలోని కాండీలో ఉండేవాళ్లు. అయితే.. 70వ దశకంలో సింహళ, తమిళం మాట్లాడే వాళ్ల మధ్య ఘర్షణలు చెలరేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం అక్కడ్నించి దూరంగా వెళ్లి బతుకుతుంటుంది. తన బిడ్డపై ఆ గొడవల ప్రభావం పడకూడదని ముత్తయ్య తల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆసక్తి ఎప్పుడు? ఎలా ఏర్పడింది? తను శ్రీలంక జట్టులో చోటు ఎలా సంపాదించాడు? సరిగ్గా 800 వికెట్లతోనే ఎందుకు రిటైర్ అయ్యాడు?
తన పర్సనల్ లైఫ్‌లో సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ సినిమాలో చూపించారు.
ముత్తయ్య మురళీధరన్ పాత్రలో మధుర్ మిత్తల్ బాగా నటించాడు. ఆయన బౌలింగ్ స్టయిల్‌ని, హావభావాల్ని అచ్చు దింపేశాడు. భావోద్వేగాల్ని బాగా పండించాడు. మురళి భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ కూడా మెప్పించింది.