కథ బాగుంది
టైటిల్ : ది ట్రయల్
డైరెక్షన్ : రామ్ గన్ని
కాస్ట్ : స్పందన, యుగ్ రామ్, వంశీ, ఉదయ్ పులిమె, సాక్షి ఉత్తాడ, జశ్వంత్ పెరుమాళ్ల, వజీర్ ఇషాన్
లాంగ్వేజి :
తెలుగుప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
పోలీస్ ఆఫీసర్ రూప (స్పందన) మొదటి వెడ్డింగ్ యానివర్సరీ రోజున ఆమె భర్త అజయ్ (యుగ్ రామ్) బిల్డింగ్ పై నుంచి కింద పడి మరణిస్తాడు. అయితే అజయ్‍ను రూప హత్య చేసిందని అజయ్ కుటుంబం అనుమానిస్తుంది. ఈ కేసును రాజీవ్ (వంశీ కొటు) ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్లో స్పందన, యుగ్ రామ్ మధ్య జరిగిన కొన్ని షాకింగ్ విషయాలు బయటికి వస్తాయి. దాంతో ఇన్వెస్టిగేషన్ ఇంకా లోతుగా చేయడం మొదలవుతుంది. ఇంతకీ అజయ్ మృతి ప్రమాదమా? హత్యా? అనేది తెలుసుకోవడమే కథ.సెకండాఫ్ స్క్రీన్‌ప్లేలో కొన్ని అంశాలు ఆడియన్స్‌ని కట్టిపడేస్తాయి. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా స్టోరీ పరంగా ఆసక్తికరంగా ఉంది. కథనం స్లో అయింది.
యధార్థ గాధ
టైటిల్ : జహ బోలిబో షొత్తొ బోలిబో
డైరెక్షన్ : చంద్రాశిష్ రే
కాస్ట్ : మిమి చక్రవర్తి, తోట రాయ్ చౌధురి, అనుజోయ్ ఛటోపాధ్యాయ్, కౌశిక్ చక్రవర్తి, దేబేష్ ఛటోపాధ్యాయ్, అనింద్యా బెనర్జీ, జోయ్‌దీప్ ముఖర్జీ
లాంగ్వేజి : బెంగాలీ
ప్లాట్ ఫాం : హోయ్‌చోయ్
బపిసేన్ అనే పోలీస్ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ షో తెరకెక్కించారు. బపిసేన్ను తోటి రౌడీ పోలీస్‌లు చంపేస్తారు. ఈ సిరీస్‌లో కోర్ట్ రూమ్ డ్రామా, ఎమోషనల్ సీన్‌తో నడుస్తుంటుంది. మొదటి మూడు ఎపిసోడ్లు కోర్ట్ రూమ్ డ్రామాతో కట్టి పడేస్తాయి. మిమి, ప్రీత ఇద్దరూ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను స్క్రీన్ ముందు కదలకుండా కూర్చోపెడతారు. మొదటి రెండు ఎపిసోడ్లలో డ్రామా ఉంటే మూడో ఎపిసోడ్ కోర్ట్ రూమ్‌కి చేరుతుంది. అక్కడ అసలు కథ మొదలవుతుంది. తోట డైలాగ్స్‌తో కట్టిపడేస్తాడు. అప్పుడప్పుడు ఇంటిపేరును గొణుక్కుంటూ సరిచేయడం గమ్మత్తుగా ఉంటుంది. ప్రీత, జోయ్రాజ్ మధ్య సన్నివేశాలు కొన్నే ఉన్నప్పటికీ బాగుంటాయి.ప్రీత తన బాయ్‌ఫ్రెండ్‌తో ‘‘నీకు నీ కెరీర్ ముఖ్యం అయినప్పుడు నా కెరీర్ ఎందుకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అవ్వాలి” అని అడగడం, ఆ తరువాతి సంభాషణల్లో పంచ్ ఉంటుంది. ఆరు ఎపిసోడ్ల ఈ షోలో ఒక్కో ఎపిసోడ్ దాదాపు 20 నిమిషాలు ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కథ చాలా ఫాస్ట్‌గా నడుస్తుంటుంది. మిమి, తోట ఇద్దరూ చాలా బాగా చేశారు.
ఎమోషన్స్ తేలిపోయాయి
టైటిల్ : తొల్వి ఎఫ్.సి.
డైరెక్షన్ : జార్జ్ కోరా
కాస్ట్ : షరాఫుద్దీన్, జానీ ఆంటోనీ, జార్జ్ కోరా, అల్తాఫ్ సలీమ్
లాంగ్వేజి : మలయాళం
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
ఒక మధ్య తరగతి కుటుంబం తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో పడే ఇబ్బందులే కథాంశం. కథలోకి వెళ్తే... క్రిప్టో కరెన్సీతో పాటు డబ్బులు వేగంగా సంపాదించడంలో ఉన్న ఇతర మార్గాల గురించి స్కీంలు వేస్తుంటాడు కురివిల. ఆయన భార్య షోషమ్మ క్రైం థ్రిల్లర్ నవలలు రాయాలి అనుకుంటుంది. వీళ్ల కొడుకులు ఊమెన్, తంబి.. వీళ్లిద్దరూ వాళ్లకున్న అభిరుచులను ఫాలో అవుతుంటారు. మొదటి వాడు ‘చాయ్ నేషన్’ పేరుతో ఒక వెంచర్ మొదలుపెట్టి ఎంట్రప్రెనూర్ కావాలనుకుంటాడు. తరువాతి వాడు అతని పిల్లలు ఆడుతున్న ఫుట్‌బాల్ టీం తంబి ఎఫ్‌సి గెలవాలి అనుకుంటాడు. కానీ పరిస్థితులు అన్నిసార్లు అంత ఈజీగా ఉండవు.ఇది కామెడీ డ్రామానే కానీ ఇందులో పలు రకాల టాపిక్స్ టచ్ చేశారు. కుటుంబంలో మారుతున్న పరిస్థితులు, జెండర్ స్టీరియోటైప్స్ గురించి ఉంటాయి. ఇందులో కొన్ని సీన్స్ ప్రేక్షకుల మనసు మీద తీవ్రమైన ముద్ర వేస్తాయి. ఈ సినిమాలో ఒక్కో క్యారెక్టర్ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. వాళ్ల మధ్య ఉన్న బంధం అనేది చూడదగ్గ ఎలిమెంట్. వాళ్ల ప్రయాణంలో ఎన్ని కష్టాలు అడ్డంకులు ఎదురైనప్పటికీ చిన్న చిన్న ఆనందాలను ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే వాళ్ల ప్రియమైన కుటుంబ సభ్యులను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటారు.అయితే ఈ సినిమాలో ఆసక్తిగా చూడాలి అని చెప్పుకునేందుకు ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఎమోషనల్‌గా ఏ సీన్లో కూడా ఇన్వాల్వ్ కానీయదు. మొత్తంమీద చెప్పాలంటే ఈ కామెడీ డ్రామాను ఒకసారి చూడొచ్చు. అదికూడా సినిమా గురించి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తేనే. ఎమోషనల్‌గా సినిమాకు కనెక్ట్ కానప్పటికీ సింపుల్ ప్లాట్ ఉన్న ఈ సినిమా వీకెండ్ ఛాయిస్.
కాసేపు నవ్వుకోవచ్చు
టైటిల్ : కంజూరింగ్ కన్నప్పన్
డైరెక్షన్ : సెల్విన్ రాజ్
కాస్ట్ : సతీష్, రెజీనా, నాజర్, శరణ్య, రిడిన్, ఆనందరాజ్, ఎలీ అవరం, వీటీవీ గణేష్
లాంగ్వేజి : తమిళం (తెలుగు, కన్నడ, మలయాళం)
ప్లాట్ ఫాం : నెట్‌ఫ్లిక్స్
కన్నప్ప (సతీష్) వీడియో గేమ్ డెవలపర్. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు అటెండ్ అవడమే అతని పని. కొడుక్కి ఉద్యోగం వస్తే చూడాలనేది తల్లి లక్ష్మి (శరణ్య)కోరిక. తండ్రి (వీటీవీ గణేష్)కి వస్తున్న పెన్షన్ డబ్బులే ఆ కుటుంబానికి ఆధారం. ఒకరోజు వాటర్ మోటర్ పని చేయదు. దాంతో స్నానానికి బావిలో నీళ్లు తోడుకోవాల్సి వస్తుంది కన్నప్పకు. నీళ్లు తోడుకుంటున్నప్పడు నీళ్లతో పాటు డ్రీమ్ క్యాచర్ కూడా వస్తుంది. ఒక ఈక పీకి పక్కన పడేస్తాడు. రాత్రి నిద్రపోయాక కలలో బ్రిటిషర్ల బిల్డింగ్‌కు వెళ్తాడు. అక్కడ మూడు దెయ్యాలు కనిపిస్తాయి. అది పీడకల అని వదిలేస్తాడు. కానీ ఆ తర్వాత కలల్లో శరీరానికి ఏం జరిగితే బయట అదే జరుగుతుంటుంది. అంటే కలలో షర్ట్ చినిగిపోతే బయట కూడా చినిగిపోతుంది. శరీరం మీద ఎక్కడన్నా గాయం అయితే కల నుంచి బయటకు వచ్చాక అదే ప్లేస్‌లో గాయం ఉంటుంది.
అయితే కన్నప్ప ఒక్కడే కాకుండా అతని తల్లిదండ్రులు, మామయ్య, సైక్రియాట్రిస్ట్ (రిడిన్), డెవిల్ (ఆనంద రాజ్) డ్రీమ్ క్యాచర్ ఈకలు ఎందుకు? ఎలా పీకారు? బంగ్లాలో దెయ్యాలు వాళ్లను ఏం చేశాయి? వాటినుంచి తప్పించుకోవడంలో ఎక్సార్సిస్ట్ ఏడుకొండలు (నాజర్), డార్క్ డెవ్స్ (రెజీనా) కన్నప్పతో పాటు మిగతా వాళ్లకు ఎలా సాయం చేశాయి? చివరకు ఏమైంది? అనేది ‘కంజూరింగ్ కన్నప్ప’ సినిమా. ఈ సినిమాలో డ్రీమ్ క్యాచర్ ఒక్కటే కొత్తగా ఉంటుంది. కథ కష్టంగా ముందుకు కదులుతుంది. దానికి తోడు బ్రిటిషర్ల పాయింట్ తప్ప ఫ్లాష్ బ్యాక్ కొత్తగా లేదు. క్లైమాక్స్ మాత్రం క్యూరియాసిటీ కలిగిస్తుంది. కాసేపు నవ్వుకోవడానికి ఒక ఆప్షన్ ఈ సినిమా.
కార్పొరేట్ కష్టాలు
టైటిల్ : క్యూబికల్స్ సీజన్ 3
డైరెక్షన్ : దివ్యాన్ష్ మల్హోత్రా
కాస్ట్ : అభిషేక్ చౌహాన్, బద్రీ చవాన్, ఆయుషి గుప్తా, కేతకీ కులకర్ణి, నిమిత్ కపూర్
లాంగ్వేజి : హిందీ
ప్లాట్ ఫాం : సోనీలివ్
కార్పొరేట్ ఆఫీస్ కల్చర్‌ను కళ్లకు కట్టేలా చూపిస్తున్న ‘క్యూబికల్స్’ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేసింది. కార్పొరేట్ ఉద్యోగం అంటే లగ్జరీ లైఫ్ అనుకునే వాళ్లకు క్యూబికల్స్ వెబ్ సిరీస్ చూస్తే ఆ విషయం మీద ఒక క్లారిటీ వస్తుంది.పియూష్ ప్రజాపతి (అభిషేక్ చౌహాన్) కార్పొరేట్ ఎంప్లాయి. అతని చుట్టూ తిరిగే కథ ఇది. సరిగా చెప్పడం రావాలే కానీ... ఏ సబ్జెక్ట్ నుంచైనా అద్భుతమైన కథలు వస్తాయనిపిస్తుంది క్యూబికల్స్ చూస్తే. మొదటి రెండు సీజన్లలో పియూష్ సాధారణ ఉద్యోగిగా చేరి టీమ్ లీడ్ వరకూ వెళ్లే జర్నీ ఉంటుంది. ఈ మూడో సీజన్లో తన కొలిగ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అయిన గౌతమ్ (బద్రీ చవాన్), శెట్టి (నిమిత్ కపూర్), సునయన(ఆయుషి గుప్తా) ఉన్న టీమ్‌కే లీడ్ అవుతాడు. అది అతనికి ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చిందనేది ఈ సీజన్.
సొంత టాలెంట్‌తో టీమ్‌లోని సీనియర్ల కంటే ముందే టీమ్ లీడ్ అవుతాడు పియూష్. అయితే అదే టీమ్ సభ్యులతో పని చేయించుకునే క్రమంలో ఎదుర్కొనే ఇబ్బందులు, వాటిని అధిగమించడానికి వేసే ఎత్తుగడలు ఉంటాయి. ఆ క్రమంలో తన ఫ్రెండ్స్‌తోనే ఏర్పడే అభిప్రాయ భేదాలు ఎమోషనల్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. చివరికి లీడర్‌గా ఎదిగినా ఫ్రెండ్‌గా ఓడిపోయిన తీరు మనసును మెలిపెడుతుంది. ఇందులో లీడ్ రోల్ చేసిన అభిషేక్ చౌహాన్ ఈ సిరీస్‌ను ముందుండి నడిపించాడు. అతని టీమ్ సభ్యులుగా నటించిన బద్రీ చవాన్, నిమిత్ కపూర్, ఆయుషి గుప్తాల నటన చాలా బాగుంది.
చావు ప్రేమ
టైటిల్ : స్వాతి ముత్తిన మలే హనియే
డైరెక్షన్ : రాజ్ బి శెట్టి
కాస్ట్ : రాజ్ బి శెట్టి, సిరి రవి కుమార్, జేపీ తుమ్మినాడు, బాలాజీ మనోహర్, రేఖ కుడ్లగి
లాంగ్వేజి : కన్నడ
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
ప్రేరణ (సిరి రవికుమార్) హోస్పైస్ సెంటర్లో కౌన్సెలర్‌గా పనిచేస్తుంటుంది. ఆ సెంటర్లో కళ్ల ముందే రాలిపోతున్న పేషెంట్లను చూస్తూ... జీవితాన్ని మొనాటనస్‌గా గడుపుతుంటుంది. ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే... సాగర్ అనే వ్యక్తితో పెండ్లి అవుతుంది. అతను పనుల్లో ఎప్పుడూ బిజీగా ఉంటాడు. భర్తకు మరో స్త్రీతో సంబంధం ఉందని తెలిసినా ఆ విషయంలో ఆమె అతన్ని కోపగించుకోదు. గొడవపడడం ఇష్టం లేక ఆ విషయాన్ని వదిలేసినట్టు ఉంటుంది.
ఉదయం నిద్రలేచి ఇంటిపనులు చేసి, ఎప్పుడూ బిజీగా ఉండే భర్త ముందు ఒక కప్పు కాఫీ పెట్టి వర్క్‌కి వెళ్లడం ఆమె దిన చర్య. వర్క్ ప్లేస్‌కి వెళ్లాక తన పేషెంట్స్ పరిస్థితి గురించి తెలుసుకుని. వాళ్లతో మాట్లాడుతూ, వాళ్లను సేదదీరుస్తుంటుంది. అనికేత్ (రాజ్ బి శెట్టి) ఆమె జీవితంలోకి వచ్చాక ఈ రొటీన్‌కి బ్రేక్ పడుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టెయినల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న అతను ఆమె పనిచేస్తున్న హోస్సైస్ సెంటర్లో చేరతాడు. వాళ్లిద్దరి మధ్య ఒక స్పెషల్ బాండ్ డెవలప్ అవుతుంది. రచయిత, దర్శకుడు రాజ్ బి శెట్టి చాలా అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు. చావు, చావు తరువాత జీవితం గురించి సాగే సంభాషణలు విని తీరాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా స్లో పాయిజన్‌లా ఎక్కుతుంది. ఏ మాత్రం ఆసక్తి లేని జీవితాన్ని గడుపుతున్న ప్రేరణ జీవితంలో మరణానికి చేరువలో ఉన్న అనికేత్ జీవాన్ని నింపుతాడు. ఈ జర్నీలో ప్రభాకర్ (జేపీ తుమ్మినాడు), డాక్టర్ మను(బాలాజీ మనోహర్), ప్రేరణ తల్లి (రేఖ కుడ్లగి) వాల్యూ ఎడిషన్. నెమ్మదిగా సాగే ఈ సినిమా చూస్తున్న వాళ్ల కళ్లనుంచి తెలియకుండానే నీళ్లు తెప్పిస్తుంది. అయితేనేం.... సంతోషంగా బతకడం గురించి మళ్లీ మళ్లీ ఆలోచించేలా చేస్తుంది.