OTT MOVIES : ఏలియ‌‌‌‌న్‌‌తో ఫ్రెండ్‌‌షిప్‌‌

టైటిల్ : అయలాన్
డైరెక్షన్​ : ఆర్ రవికుమార్
కాస్ట్ : శివకార్తికేయన్ , రకుల్ ప్రీత్ సింగ్, యోగిబాబు, శ‌‌ర‌‌ద్‌‌ ఖేల్కర్
లాంగ్వేజ్ : తమిళం, ప్లాట్​ ఫాం : సన్‌‌నెక్స్ట్‌‌

తామిజ్ (శివ‌‌ కార్తికేయ‌‌న్‌‌) ఒక రైతు. ప్రకృతిలోని ఏ ప్రాణికి హాని కలగకూడదు అనుకునే వ్యక్తి. కెమిక‌‌ల్స్‌‌ వాడితే పురుగులకు హాని కలుగుతుందని సేంద్రియ వ్యవసాయం చేస్తుంటాడు. కానీ.. ఇలాంటి వ్యక్తిత్వం వల్ల తామిజ్‌‌కు అన్నీ న‌‌ష్టాలే. అయినా బాధపడకుండా ఆ జీవితాన్నే సంతోషంగా గడుపుతాడు. అప్పులు పెరిగిపోతున్నాయ‌‌ని, అత‌‌ని త‌‌ల్లి (భానుప్రియ‌‌) తామిజ్‌‌ను ఉద్యోగం కోసం బ‌‌ల‌‌వంతంగా సిటీకి పంపుతుంది.

సిటీలో ఈవెంట్లు చేసే ఒక గ్యాంగ్‌‌లో చేరతాడు. అదే టైంలో ఫ్యూయల్‌‌కు బదులుగా వాడేందుకు ‘నోవా గ్యాస్‌‌’ను క‌‌నిపెట్టడానికి సైంటిస్ట్ ఆర్యన్‌‌ (శ‌‌ర‌‌ద్‌‌ ఖేల్కర్) ప్రయత్నిస్తుంటాడు. అందుకోసం స్పార్క్ అనే గ్రహశకలాన్ని వాడతాడు. ఆఫ్రికాలో అత‌‌డు చేసిన ప్రయోగం విక‌‌టించి చాలామంది ప్రాణాలు కోల్పోతారు. దాంతో ఇండియాలోని ఒక మైన్‌‌లో ఎవరికీ తెలియకుండా ప్రయోగాలు చేస్తుంటాడు.

అతని దగ్గర ఉన్న స్పార్క్ కోసం ఒక ఏలియన్ భూమ్మీదకు వ‌‌స్తుంది. తామిజ్‌‌తో స్నేహం చేస్తుంది. ఆర్యన్ దగ్గరున్న స్పార్క్‌‌ని దొంగిలించి తన గ్రహానికి వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తుంది. దానికి తామిజ్ సాయం చేస్తుంటాడు. ఆ ప్రయత్నంలో తామిజ్‌‌ ప్రాణాల మీదికి తెచ్చుకుంటాడు. అసలు ఏలియన్‌‌కు ఆ స్పార్క్‌‌తో పనేంటి? ఆర్యన్‌‌ చేసే ప్రయోగం వల్ల ఎలాంటి నష్టం కలిగింది? తామిజ్ ప్రేమించిన సైన్స్ టీచ‌‌ర్ తార ఎవ‌‌రు?

పనిమనిషిగా ఎందుకు?

టైటిల్ : మిస్ పర్ఫెక్ట్
డైరెక్షన్​ : విశ్వక్ ఖండేరావు
కాస్ట్ : లావణ్య త్రిపాఠి, అభిజిత్, అభిజ్ఞ, హర్షవర్ధన్, ఝాన్సీ, మహేష్ విట్టా, హర్ష్ రోషన్
లాంగ్వేజ్ : తెలుగు
ప్లాట్​ ఫాం : డిస్నీ ప్లస్‌‌‌‌ హాట్ స్టార్

లావణ్య రావు (లావణ్య త్రిపాఠి) ఢిల్లీలో మేనేజ్‌‌మెంట్‌‌ కన్సల్టెంట్‌‌గా పనిచేస్తుంటుంది. అక్కడే ఒకర్ని ప్రేమిస్తుంది. కానీ ఇద్దరి మధ్యా గొడవ వస్తుంది. ఇవన్నీ మామూలే మళ్లీ కలుస్తాడులే అని అనుకుంటున్న లావణ్య చేతిలో వెడ్డింగ్ కార్డు పెడతాడు. విపరీతమైన బాధలో ఉన్న లావణ్యకు సరిగ్గా అప్పుడే హైదరాబాద్​లో వర్క్​ చేసే అవకాశం వస్తుంది. బ్రేకప్​ అయిన బాధతో ఢిల్లీలో ఉండడం కష్టం అని హైదరాబాద్​ వెళ్లిపోతుంది. అక్కడ శాంతి నిలయం అపార్ట్‌‌మెంట్‌‌లో ఉన్న తన ఫ్లాట్​లో దిగుతుంది. కానీ.. ఆమె హైదరాబాద్‌‌కి వచ్చిన కొన్ని రోజులకే కరోనా వల్ల లాక్‌‌డౌన్‌‌ ప్రకటిస్తారు.

దాంతో లావణ్య ఇంట్లో పనిచేసే జ్యోతి (అభిజ్ఞ) పనిలోకి రాదు. తాను రాలేనన్న విషయాన్ని లావణ్యకు ఫోన్‌‌ చేసి చెప్తుంది. అలాగే అదే విషయాన్ని అదే ఫ్లాట్స్​లో ఉంటున్న రోహిత్‌‌ (అభిజిత్‌‌)కు చెప్పమంటుంది. ఆ విషయం చెప్పేందుకు లావణ్య రోహిత్‌‌ ఇంటికి వెళ్తుంది. ఆ ఫ్లాట్‌‌ చిందరవందరగా ఉండడంతో ఓసీడీ ఉన్న లావణ్య ఆ ఇల్లంతా క్లీన్‌‌ చేస్తుంది.  రోహిత్‌‌ ఆమెని పనిమనిషి అనుకుంటాడు. లావణ్య కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. అంతలో రోహిత్‌‌కి లావణ్య మీద ప్రేమ పుడుతుంది. మరి రోహిత్‌‌కు లావణ్య పనిమనిషి కాదనే విషయం తెలుస్తుందా? ఇద్దరికీ పెండ్లి అవుతుందా? 

పొట్టి వాడి గట్టి సాహసం

టైటిల్ : మతి మారన్
డైరెక్షన్​ : మాండ్ర వీరపాండియన్
కాస్ట్ : వెంకట్ సెంగుట్టువన్, ఇవానా, ఎం.ఎస్. భాస్కర్, ఆదుముమ్ నరేన్, భావ చెల్లదురై
లాంగ్వేజ్ : తమిళం, ప్లాట్​ ఫాం : ఆహా తమిళ్

నెడుమారన్ (వెంకట్ సెంగుట్టువన్), మతి (ఇవానా) కవలలు. వాళ్ల కుటుంబం తిరునెల్వేలి జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో ఉంటుంది. తండ్రి (ఎం.ఎస్‌‌. భాస్కర్) అదే ఊళ్లో పోస్ట్‌‌మ్యాన్‌‌గా పనిచేస్తుంటాడు. అయితే.. మతి, నెడుమారన్‌‌ ఒకేసారి పుట్టినా మతి అందరిలాగే ఎత్తు పెరుగుతుంది. కానీ.. నెడుమారన్‌‌ మాత్రం నాలుగు అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతాడు. దాంతో అతన్ని అందరూ హేళన చేస్తుంటారు. మతి, మారన్ ఇద్దరూ ఒకే స్కూల్‌‌లో చదువుతారు. కానీ.. వేర్వేరు కాలేజీల్లో చేరతారు. 
కాలేజీలో చదువుతున్న మతి ఒక ప్రొఫెసర్‌‌తో ప్రేమలో పడి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఆ అవమానం తట్టుకోలేక నెడుమారన్‌‌ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. తర్వాత మారన్‌‌ కూడా ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటాడు. కానీ.. మతి గుర్తొచ్చి ఆగిపోతాడు. తర్వాత ఆమె చెన్నైలో ఉందని తెలుసుకుంటాడు. వెంటనే చెన్నై వెళ్తాడు. మారన్‌‌ కాలేజీలో ఉన్నప్పటి గర్ల్‌‌ఫ్రెండ్‌‌ చెన్నైలో ఎస్‌‌.ఐ. ఆమె సాయంతో మతి అడ్రస్‌‌ తెలుసుకుని, ఆమెని కలుస్తాడు. 

అదే టైంలో చెన్నైలో వరుసగా ఆరుగురు అమ్మాయిలు కనిపించకుండా పోతారు. అందులో మతి ఇంటిపక్కన ఉండే అమ్మాయి కూడా ఉంటుంది. దాంతో మారన్ ఆ అమ్మాయి ఆచూకీ తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్‌‌ మొదలుపెడతాడు. మారన్‌‌ తెలివితేటలు చూసి, పోలీసులు కూడా సపోర్ట్‌‌ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది?

మనిషి పొట్టిగా ఉన్నంత మాత్రాన హేళన చేయకూడదు. తక్కువ చేయకూడదు. అనే మెసేజ్‌‌ ఇవ్వడంలో డైరెక్టర్‌‌‌‌ సక్సెస్‌‌ అయ్యాడు.