టెక్నాలజీ : మెదడులో చిప్​!

టెక్నాలజీని అందిపుచ్చుకుని ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు తెస్తుంటాడు ఎలాన్​ మస్క్. డ్రైవర్​ లేకుండా నడిపే కారు టెస్లా వచ్చేవరకు ఊహించని విషయం. కానీ, మస్క్​ తలచుకుంటే ఊహల్లో ఉన్నవాటికి రూపం పోయగలడు అని ప్రూవ్ చేశారు.

ఇప్పుడు అదే వరుసలో మరో కొత్త ఆవిష్కరణ  చేశాడు. అదే.. మైక్రోచిప్ ఎన్​1. ఈ చిప్​ని మనిషి మెదడులో అమర్చడానికి కొన్నేండ్లుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ ఎక్స్​పరిమెంట్​ ఫలించిందని చెప్పాడు మస్క్​. ఇంతకీ మనిషి బుర్రలో చిప్​ పెట్టడం వల్ల ఎలాంటి లాభం? అదసలు ఎలా ఉపయోగపడుతుంది?

మస్క్​కు సంబంధించిన సంస్థ ‘న్యూరాలింక్’​ మైక్రోచిప్​ల తయారీపై ప్రయోగాలు చేస్తోంది. నాడీ సంబంధిత రోగులు, బ్రెయిన్ స్ట్రోక్​ వల్ల కమ్యూనికేషన్ సామర్థ్యం కోల్పోయిన వాళ్లకు ఈ చిప్ బాగా ఉపయోగపడుతుంది! అదెలాగంటే.. గతంలో స్విట్జర్లాండ్​కు చెందిన సైంటిస్ట్​లు పక్షవాతం బారిన పడిన గెర్ట్ జాన్ అనే వ్యక్తిని తిరిగి మామూలు స్థితికి తెచ్చేందుకు అతని మెదడులో చిప్ పెట్టారు.

దెబ్బ తిన్న అతని మెదడు, వెన్నెముక మధ్య వైర్​లెస్​ కనెక్షన్​ ఇచ్చారు. దాంతో మెదడు ఇచ్చే సిగ్నల్స్​ను ఏఐ ద్వారా ట్రాన్స్​లేట్ చేసి వెన్నెముకకు పంపుతుంది ఆ చిప్​. పక్షవాతం వల్ల పన్నెండేండ్లు బెడ్ మీద ఉన్న వ్యక్తి... చిప్​ పెట్టాక నడవగలిగాడు. మెడికల్​గా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు మైక్రో చిప్​లు తయారుచేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేసింది న్యూరాలింక్.

ఎప్పుడు మొదలైంది?

కంప్యూటర్​తో మనిషి మెదడు కనెక్ట్​ అయ్యేలా చేసే ‘బ్రెయిన్ – కంప్యూటర్ ఇంటర్​ ఫేస్’ (బిసిఐ) ఎక్స్​పరిమెంట్స్​కు అమెరికా ‘ఫుడ్ అండ్ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్​డిఏ) పోయినేడాది పర్మిషన్​ ఇచ్చింది. ​ ఇప్పటికే పందులు, కోతుల్లో న్యూరాలింక్​ చిప్​ను సక్సెస్​ఫుల్​గా టెస్ట్ చేశారు. ఈ డివైజ్ సురక్షితమైనది, నమ్మకమైనదని చెప్తున్నారు ఆ న్యూరాలింక్ సైంటిస్ట్​లు. దీని సాయంతో ఒక కోతి ‘పాంగ్’ అనే వీడియోగేమ్​ను కూడా ఆడింది. ప్రస్తుతం ఒక వ్యక్తి మెదడులో ఈ చిప్​ అమర్చారు. 

ఇలా పనిచేస్తుంది..

ఎన్​1 చిప్​కి సన్నటి అంటే... వెంట్రుక కంటే తక్కువ మందం కలిగిన ఎలక్ట్రోడ్​లు ఉంటాయి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే వెంట్రుకలో 20వ వంతు. ఈ ఎలక్ట్రోడ్​లు ఎటైనా వంగుతాయి. న్యూరాన్ల నుంచి వచ్చే సిగ్నల్స్​ని అవి చిప్​కు పంపిస్తాయి. ఒక చిప్​లోని ఎలక్ట్రోడ్​లు వెయ్యి న్యూరాన్ల చర్యలను అబ్జర్వ్​ చేస్తాయి. అంటే, ఈ విధంగా ఒక మనిషికి10 చిప్​లు పెట్టొచ్చు.

ఒకసారి చిప్ ఇన్​స్టాల్ చేశాక మెదడు నుంచి ఎలక్ట్రికల్ సిగ్నల్స్​ను పంపడం, రిసీవ్ చేసుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. ప్రమాదాల వల్ల పూర్తిగా మాట పడిపోయిన వ్యక్తులు వాళ్ల ఆలోచనల్ని ఈ చిప్​ సాయంతో పంచుకోగలుగుతారు. అదెలాగంటే... ఆ వ్యక్తి మెదడులోని ఆలోచనలు చిప్​ ద్వారా కంప్యూటర్ లేదా ఫోన్​కు అందుతాయి. అందిన సమాచారాన్ని కంప్యూటర్ డీకోడ్ చేసి అక్షరాల రూపంలో చూపిస్తుంది. ముఖ్యంగా పక్షవాతం బారిన పడినవాళ్లు మెదడు ద్వారా సిగ్నల్స్​ పంపొచ్చు. 

రోబో సాయంతో సర్జరీ

ఈ చిప్​ని పుర్రెలో పెట్టేందుకు ఒక సర్జరీ చేస్తారు. పుర్రె మీద చిన్న భాగాన్ని తీసి, రంధ్రం చేసి ఎన్​1 డివైజ్​పెడతారు. అయితే, ఈ చిప్​ పెట్టేది మనుషులు కాదు. రోబో. సరైన ప్లేస్​లో సరిగ్గా అమర్చేందుకు రోబోను కూడా తయారుచేసింది న్యూరాలింక్ సంస్థ. ఈ చిప్​ బ్యాటరీ వైర్​లెస్​ పద్ధతిలో ఛార్జింగ్​ అవుతుంది. అయితే ఇలాంటి ఎక్స్​పరిమెంట్స్​ను న్యూరాలింక్​ సంస్థ ఒక్కటే కాకుండా.. మరికొన్ని కంపెనీలు కూడా చేస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన ‘సింక్రాన్’​ అనే సంస్థ 2022 జులైలో అమెరికాకు చెందిన ఒక వ్యక్తికి ఇలాంటి చిప్​ అమర్చించింది. అయితే, న్యూరాలింక్ లాగ పుర్రె మీద కోత పెట్టలేదని ఆ కంపెనీ చెప్పింది.