విద్యుత్​పై దర్యాప్తు షురూ 

  • పాత చైర్మన్ రిపోర్ట్​ను పరిశీలిస్తున్న జస్టిస్ లోకూర్

హైదరాబాద్, వెలుగు : విద్యుత్ జ్యుడీషియల్ కమిషన్ కొత్త చీఫ్ మదన్ భీమ్ రావు లోకూర్ దర్యాప్తు షురూ చేశారు. గతంలో విచారణ చేపట్టిన కమిషన్ మాజీ చైర్మన్ ఎల్.నరసింహారెడ్డి రూపొందించిన నివేదికను లోకూర్ పరిశీలిస్తున్నారు. దీని పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి విచారణపై ముందుకు వెళ్లనున్నారు. కరెంట్ ఒప్పందాలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర సర్కారు విద్యుత్ జ్యుడీషియల్ కమిషన్ వేసిన సంగతి తెలిసిందే. విద్యుత్ ఒప్పందాలు గత ప్రభుత్వ హయాంలో జరిగిన నేపథ్యంలో అప్పటి ఉన్నతాధికారులు, అప్పటి విద్యుత్​శాఖ మంత్రి

మాజీ సీఎం కేసీఆర్​ను వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో జస్టిస్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడారని ఆరోపిస్తూ విచారణను నిలిపివేయాలని మాజీ సీఎం కేసీఆర్ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మాజీ సీఎం వాదనలను తిరస్కరించడంతో కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎంక్వైరీ కొనసాగించవచ్చని చెప్పింది. అయితే జస్టిస్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడడాన్ని తప్పుపట్టింది.

కమిషన్​ చీఫ్​గా వేరొకరిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. కాగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కమిషన్ విచారణ బాధ్యతలను జస్టిస్ మదన్ భీమ్ రావు లోకూర్ కు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఎంక్వైరీ కమిషన్ కొత్త చీఫ్​గా లోకూర్ బాధ్యతలు స్పీకరించి విచారణ షురూ చేశారు. దీనిలో భాగంగా గత చైర్మన్ రూపొందించిన రిపోర్ట్ ను స్టడీ చేస్తున్నారు.