2024 ఎన్నికల్లో బీజేపీకి కొత్త సవాళ్లు!

ప్రజలంతా అనుకున్న విధంగా ఏ సార్వత్రిక ఎన్నికలు సునాయాసంగా, సామాన్యంగా జరగవు. చాలా ఆశ్చర్యకరమైన, అనూహ్య సంఘటనలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలు  షాకింగ్ ఫలితాలను ఇస్తాయి. 2016లో  హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. నవంబర్ 9వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు ఆమె కచ్చితంగా విజయం సాధిస్తుందని అంతా ఊహించారు. కానీ, తెల్లవారుజామున 3 గంటలకు, ఫలితాలు ఆమెకు షాక్​కు గురిచేసి ఓటమిని అందించాయి. అదేవిధంగా 2004లో  ప్రధానమంత్రి వాజ్‌పేయికి విజయం ఖాయమని, మొత్తం 543 ఎంపీ స్థానాల్లో బీజేపీ 300 ఎంపీ స్థానాల్లో గెలుపొందుతుని ఆ పార్టీ వర్గాలు భావించాయి. అయితే,  కేవలం 138 స్థానాలే దక్కడంతో  వాజ్‌పేయి అధికార పీఠానికి దూరమయ్యారు. 

2004 నాటి పరిస్థితికి 2024 నాటి పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. నరేంద్ర మోదీ, వాజ్ పేయి కంటే భిన్నమైన ప్రధాని. అయితే, మోదీ ప్రధానిగా ఎన్నికయ్యే సమయంలో దేశంలో కొన్ని ఊహించని సమస్యలు తలెత్తాయి. బీజేపీ భారీ విజయం సాధిస్తుందని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. సహజంగానే, ఒక రాజకీయ పార్టీ విశ్వాసాన్ని వెదజల్లుతుంది. లేకపోతే ప్రజల మద్దతును కోల్పోతుంది. ప్రధాని మోదీ ఈసారి బీజేపీకి 370 మంది ఎంపీలు, ఎన్డీయేతో కలిపి 400 మందికి ఎంపీల గెలుపును లక్ష్యంగా పెట్టుకున్నారు.

2024 ఎన్నికల్లో బీజేపీకి సానుకూలాంశాలు

బీజేపీకి 2024 లోక్​సభ ఎన్నికల్లో కలిసొచ్చే అంశాల్లో ప్రధానంగా అత్యంత ప్రజాదరణ ఉన్న నరేంద్ర మోదీ కమలం పార్టీకి సారథిగా ఉన్నారు.  కేరళ, తమిళనాడు, ఆంధ్రలో గత లోక్​సభ ఎన్నికల్లో  బీజేపీ ఒక్క  ఎంపీ స్థానం గెలవకున్నా ఈ రాష్ట్రాల్లో బీజేపీకి ఓటింగ్ షేర్​ గణనీయంగానే ఉంది. ప్రస్తుతం బీజేపీ తన పాత మిత్రపక్షాలను కూడా తిరిగి పొందగలిగింది. బిహార్​లో బీజేపీకి నితీశ్​కుమార్, చిరాగ్ పాశ్వాన్,  ఆంధ్రాలో  చంద్రబాబు నాయుడు, జనసేన, తమిళనాడులో కొన్ని చిన్న పార్టీలు, అదేవిధంగా ఇతర పార్టీల నుంచి చాలామంది సీనియర్ నాయకులు అండగా ఉన్నారు. 

రోడ్లు, విమానాశ్రయాలు మొదలైన భారీ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించి బీజేపీ తన  విజయాలను గొప్పగా ప్రదర్శిస్తోంది. బీజేపీ 80 కోట్ల మందికి ఉచిత రేషన్లు, టాయిలెట్లు, గ్యాస్ కనెక్షన్లు, ఆరోగ్య సౌకర్యాలు మొదలైనవి అందజేసి వాటిని హైలైట్ చేసింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎకనామిక్ సర్వేలు 2019 కంటే 2024లో మొత్తం వినియోగదారుల విశ్వాసం చాలా ఎక్కువగా ఉందని,  దీంతో ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరును కనబరుస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది.

 బీజేపీ ఎదుర్కొంటున్న సమస్యలు

ఎలక్టోరల్ బాండ్లను చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇది బీజేపీకి చాలా ఇబ్బందిని కలిగించింది.  కేజ్రీవాల్ అరెస్ట్  దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం దేశంలో ఇదే మొదటిసారి. ఎన్నికల సమయంలో అరెస్టు చేయడం భారతదేశమంతటా కలకలం రేగింది. 

ఎన్నికల సమయం, చట్టపరమైన అంశాలను పక్కనపెడితే, చిరకాల శత్రువులైన కాంగ్రెస్, కేజ్రీవాల్‌లను ఏకం చేసేందుకు బీజేపీ పరోక్షంగా సహకరించినట్లయింది. మరోవైపు కేజ్రీవాల్​అరెస్టు బీజేపీ రాజకీయ కుట్ర అని మెజారిటీ ప్రజల అభిప్రాయంగా ఉంది. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలితే..ప్రత్యర్థి కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి బలీయంగా మారవచ్చు. బెంగాల్, ఒడిశా, ఆంధ్ర మినహా దాదాపు మిగిలిన రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయి. 

ఇండియా కూటమి ఆశాజనకం

బీజేపీ అణచివేత రాజకీయాలు చాలా ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్‌ పార్టీకి  దగ్గర చేశాయి. కర్నాటక, తెలంగాణల్లో కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంతో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 2019లో కాకుండా, కర్ణాటక కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్‌లకు బలమైన అభ్యర్థులు ఉన్నారు. వారి వెనుక బలమైన ప్రభుత్వాలు ఉన్నాయి. 2019 లోక్​సభ ఎన్నికల్లో కర్నాటక, తెలంగాణలోని మొత్తం 45 మంది ఎంపీలకుగానూ కాంగ్రెస్‌  కేవలం 4 ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. ఇప్పుడు కర్నాటక, తెలంగాణల్లో కాంగ్రెస్ కచ్చితంగా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుంది. 

మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాల్లో ఇప్పటికీ బీజేపీకి సీట్ల కేటాయింపుపై స్పష్టత లేదు. మహారాష్ట్ర, బీహార్‌లో 88 మంది ఎంపీలు ఉన్నారు. 2019లో 88 ఎంపీలకు గాను 81 ఎంపీలను బీజేపీ కూటమి గెలుచుకున్నది. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో పరిస్థితి ఇంకా కొలిక్కి రాలేదు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ నష్టాలను ఎదుర్కోవచ్చు. మోదీ కేబినెట్​లో  సీనియర్​ నాయకులే కీలకపాత్ర పోషిస్తున్నారు. నరేంద్ర మోదీ తన పాపులారిటీని పెంచుకున్నా, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ,  జైశంకర్, పీయూష్ గోయల్, మరికొంత మంది మినహా మిగిలిన వారు పాతబడిపోయారు.

తెలంగాణాలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు?

తెలంగాణలో బీజేపీ గెలుపును అడ్డుకునే ప్రధాన ప్రత్యర్థి ఎవరు.. బీఆర్ఎస్ పార్టీనా​ లేక కాంగ్రెస్ పార్టీయా అనేది పెద్ద ప్రశ్న కాదు.  రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ చైతన్యవంతమైన శక్తిగా మారి తన ఎంపీలను పెంచుకుని బీజేపీ గెలుపుని పరిమితం చేస్తుందనేది సుస్పష్టం. కేసీఆర్‌తో  పోరాడి  బీజేపీ, ఆ తర్వాత ఊహించని విధంగా తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించింది. బీజేపీ జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసింది.  బీజేపీ కూడా10 సంవత్సరాలు అధికారంలో ఉన్నందున కోటరీలు అభివృద్ధి చెందాయి. ఆయా పార్టీల్లో నాయకులు తమ వ్యక్తిగత ఎదుగుదల, ప్రత్యర్థులపై ప్రతీకారం గురించి ఆలోచిస్తున్నారు. 

రాజకీయ ప్రమాదాల గురించి మోదీకి తెలుసు 

2024 ఎన్నికల్లో హోరాహోరీ రాజకీయ పోరు జరుగుతుందని నరేంద్ర మోదీకి తెలుసు. దీనికి నిదర్శనమే మోదీ అవిశ్రాంత ఎన్నికల ప్రచారం. మోదీ వివిధ రాష్ట్రాలను సందర్శించినా లేదా టెస్లా ఫేమ్ ఎలాన్ మస్క్,  మైక్రోసాఫ్ట్​కు చెందిన బిల్ గేట్స్‌ భారతదేశం సందర్శించి, ఎన్నికల సమయంలో మోదీని కలిసేందుకు వచ్చినా, ప్రధాని మోదీకి ఎన్నికల్లో విజయం సాధించడానికి చివరివరకూ శాయశక్తులా పోరాడాలని తెలుసు. ఎన్నికలు మోదీ గ్యారంటీల లాంటివి కాదు. ఒకవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నిస్సందేహంగా దేశవ్యాప్త ప్రజాదరణ ఉంది. 

కానీ, మరోవైపు ప్రతిపక్షాలు అందించే  ఉచితాలు, సంక్షేమ హామీల ఎర ఓటర్లను ప్రభావితం చేస్తాయి. దీంతో దేశ ప్రజలు ఉచితాలకు ఓటేస్తారా లేక మోదీ పాలనా పటిమకు ఓటు వేస్తారా అనేది కీలక పరీక్షగా మారింది.  బీజేపీ 2019 నుంచి సాధించిన ఓట్లు కంటే 4%  తగ్గితే అది ఓడిపోతుంది. ఒకవేళ 4% ఓట్లు పెరిగితే బీజేపీకి భారీ విజయం లభిస్తుంది. అయితే భారీ పోరాటం జరగడం ఖాయం. బీజేపీ నాయకులకు నిద్రలేని రాత్రుళ్లు తప్పవు. హ్యాట్రిక్​ విజయం కోసం మోదీ కూడా పూర్తిస్థాయిలో తన శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు

పెంటపాటి పుల్లారావు,పొలిటికల్​ ఎనలిస్ట్