అనగనగా ఒక ఊరు.. డైనోసార్​ల ఊరు మన దగ్గరే!

డైనోసార్లను జురాసిక్ పార్క్ సినిమాలో చూసుంటారు. కానీ అవన్నీ టెక్నాలజీ మాయాజాలం.  నిజమైన డైనోసార్​లను చూడాలంటే.. గుజరాత్ వెళ్లాల్సిందే! డైనోసార్లు ఎప్పుడో అంతరించిపోతే అక్కడెలా కనిపిస్తాయి అంటున్నారా? అవి అంతరించిపోయినా.. అప్పట్లో అవి తిరిగిన నేల ఇది అనడానికి సాక్ష్యంగా వాటి గుడ్ల శిలాజాలు, అవశేషాలు ఇక్కడ కనిపిస్తాయి. వాటన్నింటినీ జాగ్రత్తగా మ్యూజియంలో దాచారు. ఆ మ్యూజియంకి వెళ్తే మరెన్నో ఇంట్రెస్టింగ్ సంగతులు తెలుస్తాయి. మరింకెందుకాలస్యం.. పదండి డైనోసార్ల ఊరికి వెళ్దాం.  

డైనోసార్లు చూడాలంటే రాయ్​ యోలి అనే ఊరికి వెళ్లాలి. ఈ ఊరు గుజరాత్​లోని మహిసాగర్ జిల్లాలో బాలాసినోర్‌ అనే సిటీకి దగ్గర్లో ఉంది. ఈ ఊరి గురించి చెప్పాలంటే...1980ల్లోకి వెళ్లాలి. ఖనిజ సంపద బాగా ఉండే ఈ ప్రాంతంలో జియాలాజిస్ట్ లు తవ్వకాలు జరిపించారు. అప్పుడు అక్కడి మట్టి పొరల్లో గుడ్లు, ఎముకల శిలాజాలు బయటపడ్డాయి. వాటి గురించి తెలుసుకోవడానికి పరిశోధనలు చేపట్టారు. అప్పుడు వాళ్లకు తెలిసిన విషయం ఏంటంటే.. ఈ ప్రాంతంలో లక్షల సంవత్సరాల కిందట డైనోసార్లు నివసించాయి అని. ఆ ఊళ్లోనే కాదు.. మహిసాగర్ జిల్లాలో వేరే ప్రాంతాల్లో కూడా డైనోసార్ శిలాజాలు, వాటి గుడ్లు దొరికాయి.

ప్రపంచంలోనే..

ప్రపంచంలోనే డైనోసార్లు సంచరించిన ప్రధాన ప్రాంతాల్లో బాలాసినోర్‌ నగర ప్రాంతం మూడోది. ఇది రాయ్​యోలికి 16 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అప్పట్లో డైనోసార్లు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టేవట! ఇక్కడే ఎందుకు అంటే బాలాసినోర్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో నేల డైనోసార్​ గుడ్లు పొదగటానికి, వాటి రక్షణకు అనుకూలంగా ఉండేదట. అందువల్లే  టైరానోసారస్‌, మెగాలోసారస్‌, టిటానోసారస్‌ వంటి ఏడు రకాల డైనోసార్లు ఈ నేల మీద తిరగగలిగాయి అంటున్నారు రీసెర్చర్లు. అయితే, దాదాపు పది కోట్ల సంవత్సరాల వరకు ఈ ప్రాంతం అరుదైన డైనోసార్‌లకు ఆవాసంగా ఉంది. అందుకే ఇక్కడ టిటానరస్ అనే డైనోసార్​ల అవశేషాలు కనిపించాయి.

డైనోసార్ల గుడ్లను తినే పాము

మామూలుగా డైనోసార్లలో వివిధ రకాల జాతులన్నీ జురాసిక్‌ కాలంలోనే పుట్టాయని పరిశోధకులు చెప్తారు. అయితే ఈ గ్రామంలో దాదాపు వెయ్యి వరకు డైనోసార్ల గుడ్ల శిలాజాలు దొరికాయట. అన్ని ఉండడానికి గల కారణం ఏంటంటే... డైనోసార్‌ ఒకసారికి 20 నుంచి 30 గుడ్లు పెడుతుంది. పైగా డైనోసార్ల గుడ్లు పెద్దగా, చాలా గట్టిగా ఉంటాయి. మరి అవి గుడ్లను ఎందుకు దాచుకుంటాయి? వీటికి రక్షణ అవసరమా? వాటిని తినే జంతువులు ఉంటాయా? అంటే.. అవును వాటిని తినే జంతువులు ఉన్నాయి. అవి అరుదైన సర్ప జాతి సానాజే ఇండికస్‌ అనే పాములు. ఈ పాము డైనోసార్​ గుడ్లను తింటుంది. ఆ విషయానికి సంబంధించిన ఆనవాలు కూడా ఇక్కడే దొరికింది. ఆ పాముకి సంబంధించిన శిలాజాలు కూడా ఇక్కడ బయటపడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న సైంటిస్ట్​లు కూడా ఆశ్చర్యపోయారు. 

మ్యూజియం విశేషాలు

అరేబియా సముద్రం, నర్మదా నదీ పరీవాహక ప్రాంతంలో వందల సంఖ్యలో రాకాసి బల్లుల గుడ్లు, ఎముకలు, వెన్నుపూస, కడుపులో భాగాలు, తల ఇలా... ఎన్నో అవశేషాలు బయటపడ్డాయి. అందుకే బాలాసినోర్‌ను ‘శిలాజవనం’ అని పిలుస్తారు. ఈ శిలాజాలను జాగ్రత్తగా సేకరించి మ్యూజియంలో ఉంచారు. దాని పేరే ‘బాలాసినోర్​ డైనోసార్ ఫాజిల్ పార్క్ అండ్ మ్యూజియం’. అయితే ఈ మ్యూజియం పెట్టిన దగ్గర  డైనోసార్లు తిరగలేదు. 

కానీ... డైనోసార్ల గురించి ప్రతి చిన్న విషయం ఇక్కడ తెలుసుకోవచ్చు. అన్ని వివరాలు ఉంటాయి ఈ మ్యూజియంలో. ఇక్కడ ఎంట్రన్స్​లోనే పెద్ద డైనోసార్‌ విగ్రహం కనిపిస్తుంది. నోరు తెరిచి గాండ్రిస్తున్నట్లు ఉన్న ఈ డైనోసార్‌ పక్కన ఫొటోలు దిగుతుంటారు టూరిస్ట్​లు. అలాగే... ఓ రాయి మీద పొడవాటి వెన్నెముక అచ్చు కనిపిస్తుంది. గుడ్డు శిలాజాన్ని రాతి నుంచి వేరు చేశాక మిగిలిన గుడ్డు ఆకారపు గుంటలు కనిపించాయి. రెండు డైనోసార్లు పక్క పక్కనే ఉన్న ఆనవాళ్ళు ఉన్నాయి. ఆరున్నర కోట్ల సంవత్సరాల కిందట అరేబియా సముద్రం నుంచి వచ్చిన భీకర వరదలు, అగ్నిపర్వత పేలుళ్ళతో ఈ జాతి పూర్తిగా అంతరించిందని శాస్త్రవేత్తల అంచనా. ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకమైన విషయాలు ఈ మ్యూజియంలో ఉంటాయి.

టెక్నాలజీ మామూలుగా ఉండదు

ఈ మ్యూజియం 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీని బేస్‌మెంట్​లో మొత్తం10 గ్యాలరీలున్నాయి. రాక్షస బల్లుల చరిత్రను ఇక్కడ చూడొచ్చు. ఈ మ్యూజియంలో అల్ట్రా మోడర్న్​ టెక్నాలజీ, త్రీడీ ప్రొజెక్షన్, వర్చువల్ రియాలిటీ ప్రదర్శనలుంటాయి. అయితే ఈ మ్యూజియంలో డైనోసార్ల ఎవల్యూషన్​ ప్రాసెస్​తోపాటు వాటి భారీ బొమ్మలు కూడా ఉంటాయి. స్టూడెంట్స్​, సైంటిస్ట్​ ఈ మ్యూజియంను విజిట్​ చేస్తే డైనోసార్లకు సంబంధించిన బోలెడు విషయాలు తెలుసుకోవచ్చు. 

మరిన్ని సంగతులు

బాలాసినోర్​ డైనోసార్ ఫాజిల్ పార్క్​లో ఎంట్రన్స్​ ఫీజు పెద్ద వాళ్లకు 20 రూపాయలు. ఐదు నుంచి పన్నెండేండ్ల లోపు పిల్లలకు 10 రూపాయలు. మ్యూజియంలోకి వెళ్లాలంటే మాత్రం ఒక్కో మనిషి500 రూపాయల టికెట్​ కొనుక్కుని వెళ్లాల్సిందే.బాలాసినోర్​లో సుదర్శన్ కొలను ఉంది. అక్కడ ఎన్నో రకాల పక్షులు కనిపిస్తాయి. అలాగే ఇక్కడ కేదారేశ్వర, శివ్​ శంభు మహదేవ్​, ఖోడియార్ మాత, హనుమాన్​ జీ టెంపుల్స్ ఉన్నాయి. అలాగే తరన్ షాహిద్​ దర్గా కూడా ఉందిక్కడ. నవంబర్​ నుంచి ఫిబ్రవరి మధ్య ఈ ఊరికి వెళ్తే బాగుంటుంది. ఆ టైంలో వాతావరణం చాలా బాగుంటుంది. మార్చి నుంచి మే మధ్యలో వెళ్తే అవుట్​డోర్​ యాక్టివిటీస్​లో పార్టిసిపేట్ చేయొచ్చు. జూన్​ నుంచి అక్టోబర్​ కూడా విజిట్​ చేయడానికి బెస్ట్​ టైం. 

ఎలా వెళ్లాలి?

అహ్మదాబాద్​ నుంచి 83 కిలో మీటర్ల దూరంలో ఉంది బాలాసినోర్​. బాలాసినోర్​కి 16 కిలో మీటర్ల దూరంలో రాయ్​యోలి గ్రామంలో డైనోసార్​ పార్క్ ఉంది. కాబట్టి బాలాసినోర్​ నుంచి రాయ్​ యోలికి అరగంట ప్రయాణం చేయాలి.