బీర్ తాగడం ఎప్పుడు మానేయాలి..? కరెక్ట్ వయస్సు ఏంటి?

మద్యం సేవించేవారిని తాగుబోతులు అనకుండా మద్యం ప్రియులు అని సంబోధించాలని సూచించారు ఓ పెద్ద మనిషి. అలా ఉంది ఈ తతంగం. అసలు తాగడమే తప్పంటే, ఎప్పుడు తాగాలి..? ఎంత తాగాలి..? ఎప్పుడు మానేయాలి..? అని చెప్పాల్సి వస్తోంది. 

నేటి కాలంలో మందు తాగడం అనేది అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. కొందరు ఒత్తిడిని తగ్గించుకోవడానికి తాగితే, మరికొందరు విశ్రాంతి పేరిట.. ఇంకొందరు సరదా కోసం. ఇలా అందరూ తాగేవారే. అడపాదడపా తాగితే పర్లేదు కానీ, దీర్ఘకాలం తాగుతూపోతే పోతార్రోయ్ అని హెచ్చరించారు.. ఓ న్యూరాలజిస్ట్. మద్యానికి అలవాటు పడ్డ వారు అకస్మాత్తుగా మనలేకపోయినా.. 65 ఏళ్లు పైబడ్డాక తాగొద్దని సూచించారు. 

ఆ డాక్టర్ పేరు.. రిచర్డ్ రెస్టాక్. ఈ న్యూరాలజిస్ట్ సూచనల ప్రకారం, 65 సంవత్సరాల వయస్సు వారు మద్యపానాన్ని గణనీయంగా తగ్గించాలి. 70 ఏళ్లు వచ్చేసరికి పూర్తిగా తగ్గించాలి. అందుకు ఆయన ఓ బలమైన కారణాంన్ని లేవనెత్తారు. 65 ఏళ్లు పైబడిన తరువాత శరీరంలో న్యూరాన్ల సంఖ్యలో తగ్గుదల ఉంటుంది. అందువల్ల, మెదడును రక్షించే న్యూరాన్లను సంరక్షించడం వృద్ధాప్యంలో తప్పనిసరి అన్న ఆయన.. ఆల్కహాల్‌కు దూరంగా ఉండమని సూచించారు. అయితే, తరుచూ బీర్ తాగడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధనల్లో తేలడం గమనార్హం.

రోజూ బీరు తాగితే వచ్చే నష్టాలు:

  • బీరు రోజూ తాగితే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆఫీసు ముగించుకుని రాత్రి సమయాల్లో ఎక్కువ మంది తాగుతారు. దీని వల్ల రాత్రి సమయాల్లో నిద్ర పట్టదు. ఉదయానికి హ్యాంగోవర్ గా ఉంటుంది.
  •  రోజూ బీరు తాగటం వల్ల దీర్ఘకాలంలో నిద్రలేమి సమస్యతోపాటు కిడ్నీ, లివర్ డ్యామేజ్ అవుతుంది.
  •  రోజూ బీరు తాగటం వల్ల బీపీ.. బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది.
  • బీర్ మూత్రవిసర్జన మరియు మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి కిడ్నీలుత్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది.
  • డీహైడ్రెషన్‌కు కారణమవుతుంది.
  • రోజూ బీరు తాగడం వల్ల కిడ్నీలపై ఎఫెక్ట్ పడుతుంది. ఈ కారణంగా కిడ్నీ స్టోన్ లేదా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
  • రోజూ బీరు.. నిద్ర, ఆకలి.. రెండింటినీ పాడు చేస్తుంది.

బీరు ఎప్పుడెప్పుడు.. ఎంతెంత తాగాలి

  • బీరు తాగటానికి సమయం అంటూ ఏదీ నిర్ధిష్టంగా లేదు. కాకపోతే దేశంలోని బీరు ప్రియులు 90 శాతం మంది సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య తాగుతున్నారు.
  • బీరులో ఆల్కాహాల్ శాతం కనీసం 5 నుంచి 12 శాతం వరకు ఉంటుంది.
  • దీన్ని వారానికి ఒక్కసారి.. అది కూడా ఒకటి, రెండు బీర్లు తాగితే ఆరోగ్యానికి మంచిది.
  • వారంలో నాలుగు బీర్ల కంటే ఎక్కువ తాగితే మాత్రం దీర్ఘకాలంలో కచ్చితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి.. వారానికి ఒకటి, రెండు.. అది కూడా ఒక రోజు తాగితే ఆరోగ్యంపై ప్రభావం చూపదని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బీరును అధికంగా తీసుకుంటే హాని, అనారోగ్య సమస్యలు, వ్యాధులే.