సర్కార్ దవాఖానలో అడుగడుగునా నిర్లక్ష్యం!

  • గద్వాల హాస్పిటల్​లో వృథాగా ఎస్డీపీ మెషీన్
  • ఎక్స్ రే తీసినా ఫిలిం ఇవ్వని డాక్టర్లు
  • నిరుపేద పేషెంట్లకు తప్పని తిప్పలు

గద్వాల, వెలుగు: పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన జిల్లా ఆసుపత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌలతులు కల్పించాలని ఆదేశించినా, డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. గద్వాల సర్కార్  దవాఖానలో ఆరు నెలల కింద రూ.2 కోట్లతో సింగిల్  డోనర్  ప్లేట్ లెట్(ఎస్డీపీ) మెషీన్  తెప్పించినా.. నేటికి దానిని వినియోగించడం లేదు. అలాగే ఎక్స్​రే తీసినా ఫిలిం ఇవ్వకపోవడంతో.. మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్​కు వెళ్తే మరోసారి ఎక్స్ రే తీయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

దవాఖానలో అన్ని మెషీన్లు, సౌలతులు, సిబ్బంది ఉన్నప్పటికీ.. డాక్టర్ల నిర్లక్ష్యంతో సరైన వైద్యం అందడం లేదంటున్నారు. ఇక్కడి డాక్టర్లు తమ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లు, హాస్పిటల్స్ లో పేషెంట్ల సంఖ్య పెంచుకోవడానికి ప్రభుత్వ హాస్పిటల్ లో సరైన వైద్యం అందించడం లేదనే ఆరోపణలున్నాయి.

ఎస్డీపీ మెషీన్  మూలకు పెట్టేశారు..

రూ. 2 కోట్ల విలువ చేసే ఎస్డీపీ మెషీన్​ను ప్రభుత్వం ఆసుపత్రికి కేటాయించింది. డెంగ్యూ, రక్తస్రావం, ప్లేట్ లెట్స్ సంఖ్య పడిపోయిన సందర్భాల్లో పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్లడ్  నుంచి ప్లేట్​లెట్లను వేరు చేసి పేషెంట్లకు ఎక్కించేందుకు ఈ మెషీన్​ వినియోగిస్తారు. ప్రైవేట్  హాస్పిటల్​లో ఈ మెషీన్​ ద్వారా ప్లేట్ లెట్స్  ఎక్కించాలన్నా, టెస్టులు చేయాలన్నా రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చవుతుంది.

పేదలు ఇంత మొత్తం చెల్లించలేక అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం డెంగ్యూ జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో, అలాంటి పేషెంట్లకు ఎమర్జెన్సీలో ప్లేట్​లెట్లు కావాలంటే ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్ లో ఉన్న ఎస్డీపీ మెషీన్​ను అందుబాటులోకి తెస్తే ఉపయోగకరంగా ఉంటుందని పేషెంట్లు, వారి బంధువులు చెబుతున్నారు.

ఎక్స్ రే ఫిలిం ఇవ్వరు..

గద్వాల సర్కార్  దవాఖానలో ఎక్స్ రే తీసినా ఫిలిం ఇవ్వడం లేదని పేషెంట్లు వాపోతున్నారు. యాక్సిడెంట్లు, టీబీ, ఇతర పేషంట్లు గంటల తరబడి లైన్ లో నిలబడి ఎక్స్ రే తీయించుకున్న తరువాత ఫిలిం ఇవ్వకుండా డాక్టర్  దగ్గరికి వెళ్లండని చెబుతున్నారు. ఆన్ లైన్ లో డాక్టర్​కు పంపిన ఎక్స్​రేను పరిశీలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలాఉంటే ఫిలిం ఇవ్వకపోవడంతో ఎక్స్ రే తీశారా? లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్ రేలో వాస్తవంగా ఫిలిమ్​కు మాత్రమే ఖర్చవుతుంది. ఫిలిమ్  ఇవ్వకపోతే ఎక్స్ రే తీసినా.. తీయకపోయినా ఒకటేనని నిపుణులు చెబుతున్నారు.

ఫిలిమ్​లు ఇవ్వకుండా ఇచ్చినట్లు బిల్లులు దండుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పేషెంట్ కు అత్యవసర పరిస్థితిలో వేరే హాస్పిటల్ కు వెళ్లాల్సి వస్తే అక్కడ ఈ ఫిలిం ఉపయోగపడుతుంది. ఫిలిం లేకపోవడంతో మరోసారి ఎక్స్​రే తీయించుకోవాల్సి వస్తోందని, దీనికి రూ.600 నుంచి రూ. 1,000 ఖర్చవుతుందని అంటున్నారు. మళ్లీ మళ్లీ ఎక్స్ రేలు తీసుకోవడం వల్ల పేషెంట్లు రేడియేషన్  బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు.

పర్మిషన్​ కోసం దరఖాస్తు చేశాం..

ఎస్డీపీ మెషీన్  వినియోగంలోకి తెచ్చేందుకు పర్మిషన్  కోసం దరఖాస్తు చేశాం. ఎక్స్ రే ఫిలిమ్​లు ఇవ్వడం లేదనే మాట వాస్తవమే. డాక్టర్ కు ఆన్ లైన్ లో మెసేజ్  పంపి ట్రీట్​మెంట్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. త్వరలో ఫిలిమ్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం.

వినోద్, ఇన్​చార్జి సూపరింటెండెంట్