కథ..నవ్వింది నాగమల్లీ : పొత్తూరి జయలక్ష్మి

మురళీ ఒక్కసారి ఇలారా!’’ అంటూ కేకేసింది సరోజనమ్మ.వస్తున్నా’’ అంటూ వరండాలో కూర్చొని పేపరు తిరగేస్తున్నవాడల్లా చేతిలోవున్న పేపర్ని టీపాయ్​మీద పెట్టి లోపలికొస్తూ...... ‘‘ఓ వంకాయలు తరుగుతున్నావా? ఇవ్వాళ గుత్తొంకాయ కూర చేస్తున్నావా?’’ అన్నాడు మురళి సరోజనమ్మకు ఎదురుగా కూర్చుంటూ.
 మురళి అంటున్న మాటలేవీ పట్టించుకోకుండా ‘‘ఏంలేదు మురళీ! నీ పెళ్ళి విషయం మాట్లాడదామనీ’’ అంది సరోజనమ్మ.
 ‘‘అబ్బా! పెళ్ళి గోల మొదలుపెట్టావా? నేను పెళ్ళి చేసుకోకపోతే ఇప్పుడేమైంది? పెళ్ళొక్కటే జీవితానికి ముఖ్యమా చెప్పు. ఆలంపటం తగిలించుకోకపోతే ఇప్పుడు మనందరం సుఖంగా లేమా” అన్నాడు మురళి చిరాగ్గా ముఖం పెట్టి.

అదికాదురా మురళీ. ఎంతో పెద్ద చదువులు చదివి అందరి పిల్లల్లా నువ్వూ పట్నంలో పెద్ద ఉద్యోగస్తుడివి అవుతావని నేనూ, మీ నాన్నా కలలుగన్నాం. కానీ నువ్వు అంత చదువు చదివి ఎంత చెప్పినా వినకుండా వ్యవసాయంలో దిగి ఈ పల్లెనే అంటిపెట్టుకుని ఉన్నావ్. ఇప్పుడు చూడు ఏమైందో? పల్లెల్లో ఉండటానికీ, ఒక రైతును పెళ్ళి చేసుకోవటానికీ ఏ ఆడపిల్లా ఇష్టపడటంలేదు. కాలం చాలా మారిపోయిందిరా. నీకేమో దగ్గర దగ్గర ముప్ఫై సంవత్సరాల వయసొస్తోంది. అసలు నీకు పెళ్ళి యోగం ఉందా ? అనేదే నా దిగులు’’ అంది వంకాయలు తరిగి పక్కనే ఉన్న గిన్నెలోని నీళ్ళల్లో వేస్తూ సరోజనమ్మ.

అయిపోయిందా నీ సోదీ? పెళ్ళి.. పెళ్ళి.. పెళ్ళి... ఎప్పుడూ ఇదే గోల. నువ్వు ప్రశాంతంగా ఉండవు. నన్ను ఉండనివ్వవు’’ అంటూ కోపంగా కూర్చున్న చోటినుండి లేవబోయిన మురళిని గట్టిగా చేయి పట్టుకుని ఆపి ‘‘పెళ్ళి మాటెత్తితే చాలు. అలా రుసరుసలాడిపోతావు. నువ్వు కాలేజీ చదివే రోజుల్లో ఎవరైనా అమ్మాయిని ఇష్టపడితే చెప్పు. ఆ అమ్మాయినే చేసుకుందువు’’ అంది మురళి మనసులో ఏ అమ్మాయైనా ఉందేమో తెలుసుకునే ప్రయత్నంలో సరోజనమ్మ 
‘‘అలాంటిదేం లేదమ్మా. ఉంటే చెప్తా కదా! అయితే నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి బీదింటి పిల్ల ఎవరైనా చూడటానికి బాగుండి. మనలో కలిసిపోయే పిల్ల దొరికితే చూడు. పెళ్ళికయ్యే ఉభయ ఖర్చులూ మనమే పెట్టుకుందాం’’ అన్నాడు మురళి సంభాషణకు ముక్తాయింపుగా.

అయితే షాపింగ్ మాల్లో కలిసిందని ఈ మధ్య నా చిన్ననాటి స్నేహితురాలిని మనింటికి తీసుకొచ్చాను చూడు. పెళ్లీడుకి వచ్చిన ఆమె మనవరాలు ఉందట. తల్లీతండ్రికి దూరమైన పిల్లట. మేనమామ అండలో అమ్మమ్మ దగ్గర... అంటే తన దగ్గరే పెరుగుతున్నదట. పిల్ల చాలా బుద్ధిమంతురాలు. అందంగా ఉంటుందట. వాళ్ళది మనకు దగ్గరలోవున్న సీతాపురమే. మేము కట్నకానుకలు ఇచ్చుకోలేము. మాకు తగిన సంబంధమేదైనా ఉంటే చెప్పమని ఆ పిల్ల ఫోటో ఒకటి ఇచ్చింది. ఉండు... ఆ ఫొటో నా పర్స్​లో ఉందనుకుంటా’’ అంటూ సరోజనమ్మ అక్కడనుండి లేచి బెడ్రూంలోని బీరువాలో ఉన్న పర్స్​లో నుండి ఫొటో తీసి, తానొకసారి తేరిపార చూసి దాన్ని మురళి చేతిలో పెడుతూ ‘‘చూడరా ఈ పిల్ల ఎంత బాగుందో! ఒకసారి ఫొటో చూసి సరేనంటే తరువాతి సంగతి తరువాత’’ అంటూ వంటగదివైపు నడిచింది సరోజనమ్మ.

ఏంటో? అమ్మ తెల్లారి లేచింది మొదలు పెళ్ళి చేసుకోమని తెగ విసిగిస్తున్నది’’ అంటూ నిర్లక్ష్యంగా చేతిలో ఉన్న ఫొటోని పక్కనే ఉన్న టేబుల్​పైకి విసిరేశాడు. అది కాస్తా కిందపడింది. దాంతో మెల్లగా వంగి ఆ ఫొటోని చేతిలోకి తీసుకుంటుంటే  అప్రయత్నంగా మురళి చూపులు ఆ ఫొటో పైకి మళ్ళాయి. అంతే.... పది నిమిషాలపాటు చూపు తిప్పుకోలేకపోయాడు. అమ్మ చెప్పినట్లు అమ్మాయి ఎంత బాగుందో. ఆ అందానికి తోడు చక్కటి చిరునవ్వు. సింపుల్​గా మెడలో ఒంటిపేట ముత్యాల హారం. ఫొటోలోనే ఈ అమ్మాయి ఇంతందంగా ఉంటే రియల్​గా చూస్తే! నాకు భార్యగా ఉండాల్సిన అమ్మాయి ఈమే అనిపించింది. మురళి ఆ ఫొటో మీదనుండి చూపు తిప్పలేకపోతున్నాడు. తన ప్రమేయం లేకుండానే పదే పదే ఆ ఫొటోని చూస్తూ తృప్తిగా ఒక నిట్టూర్పు విడిచాడు ఏదో నిర్ణయానికొచ్చిన వాడిలా.

‘‘ఇక మర్యాదలు చాలు గానీ అమ్మాయిని... అదే పెళ్ళి కూతురిని తీసుకురండి సుశీలా”అంది సరోజనమ్మ.
మరుక్షణంలోనే ఒకామె అమ్మాయిని తెచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది.
‘‘సరోజా! ఇది నా మనవరాలు. వది వరకు చదువుకుంది. పై చదువులు చదివించే తాహతు లేక మాన్పించాము” అంది పెళ్ళి పిల్లను పరిచయం చేస్తూ సుశీల.
తెల్లటి షిఫాన్ చీరలో అడుగులో అడుగేసుకుంటూ తలదించుకొని వస్తున్నప్పుడే ఓరకంట చూసిన మురళి... ఆమె మీద నుండి చూపు తిప్పలేకపోతున్నాడు. కన్నార్పకుండా అలానే చూస్తుండిపోయాడు. మురళి మనసు ఊహల్లో విహరిస్తోంది.
‘‘నీ పేరేంటమ్మా” అంది సరోజనమ్మ పెళ్ళికూతురును.
‘‘మల్లి’’ అంది లోగొంతుకతో.

పూర్తి పేరు చెప్పాలమ్మా’’ అంది అమ్మమ్మ సుశీల.
వంచిన తల ఎత్తకుండానే ‘‘నాగమల్లి’’ అంది నెమ్మదిగా.
ఆ మృదు మధుర స్వరం మురళి చెవులకు తాకగానే పరవశించిపోయాడు. ‘నాగమల్లి’ ఈ అమ్మాయి అందానికి తగ్గ పేరు. సిగ్గులు మూటగట్టుకున్న ఈ అందాల భరిణె నా అర్ధాంగి కావాల్సిందే. ఇన్నాళ్ళూ నేను పెళ్ళి విషయం పై మొగ్గు చూపనిది ఈ అందాల రాశికోసమే కాబోలు అనుకుంటూ ‘‘అమ్మా! ఇక మనం బయల్దేరదామా’’ అన్నాడు కుర్చీలోంచి లేస్తూ మురళి.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరోజనమ్మ కొడుక్కి పెళ్ళి ఘడియ రానేవచ్చింది. ఇల్లంతా బంధువులు, స్నేహితులతో కిటకిటలాడిపోతున్నది. పనివాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్నారు. ఇంటిముందున్న ఖాళీ స్థలంలో తాటాకు పందిళ్ళు రంగురంగుల కాగితాలతో, మామిడితోరణాలతో అలంకరించారు. కొబ్బరాకులతో ఏర్పాటు చేసిన పెళ్ళి మండపంలో పట్టుబట్టలతో మెరిసిపోతున్నాడు మురళి. సరోజనమ్మ బంధువులను పలకరిస్తూ తెగ హడావిడి పడుతూ మధ్య మధ్యలో ఆడపెళ్ళివారిని తన బంధువులకు పరిచయం చేస్తూ పందిట్లోకి అవసరమైన వస్తువులందిస్తున్నది. అనుకున్న ముహూర్తానికి వధూవరులు జీలకర్ర బెల్లం పెట్టుకునే శుభముహూర్తం ముగిసింది. పెళ్ళికి వచ్చిన బంధువులంతా ‘ముచ్చటైన జంట’ అంటూ పొగుడుతుంటే సుశీల, సరోజనమ్మల ఆనందానికి అవధులు లేవు.

పక్కనే కూర్చున్న మల్లి స్పర్శ తగలగానే మురళికి అనిర్వచనీయమైన కొత్త అనుభూతి కలుగుతున్నది. ఆమెతో మాట్లాడాలనీ, సన్నిహితంగా మెలగాలనీ మనసు ఉవ్విళ్ళూరుతున్నది. నవ్వుతూ మెల్లగా మల్లి పక్కకు జరిగాడు.  అంతే ఉలిక్కిపడ్డట్టు తలెత్తి చూసిన మల్లి దూరం జరిగి... తల వంచుకుని కూర్చుంది. ఆ పరిణామానికి మురళి గుండె ఝల్లుమన్నది. ఏంటీ! ఆడపిల్లకి ఎంత బిడియమైతే మాత్రం ఇలానా? ఇవ్వాళ్టి నుండి ఇద్దరం భార్యాభర్తలం కదా. తనకుతాను ముందుగా నాతో మాట్లాడటానికి సిగ్గుపడుతుంటే నేనే ఆ అవకాశాన్ని ఇస్తున్నా కదా! అయినా తనలో స్పందన లేదేంటీ? ఈ పెళ్ళి ఈమెకి ఇష్టమా? కాదా?  పెద్దవాళ్ళ బలవంతంమీద చేసుకుంటుందా?  పరిపరి విధాల ఆలోచనలు మనసును సుడిగుండంలోకి నెడుతున్నా మధ్య మధ్యలో తనకు అభినందనలు చెప్తున్న వాళ్లకి నవ్వుతూ కృతజ్ఞతలు చెప్తున్నాడు.

యాంత్రికంగానే మల్లి మెడలో మూడుముళ్ళు వేశాడు మురళి. అప్పటిదాకా పెళ్ళిమండపంలో ఆ పక్కగా నిలబడ్డ సుశీలమ్మ అక్షింతలతో ముందుకొచ్చి ‘‘మిమ్మల్ని భర్తగా పొందిన మా మల్లి ఎంత అదృష్టవంతురాలో బాబూ! చాలా అమాయకురాలు. 21 సం॥లుగా దీన్ని పెంచి పెద్ద చేసి మీకు అప్పజెపుతున్నా జాగ్రత్తగా చూసుకో’’ అంటూ చేతిలోని అక్షింతలు చల్లి ఊపిరి పీల్చుకుంది.

మల్లి అత్తవారింట అడుగుపెట్టిన నాటినుండి సంతోషంగా లేదనే చెప్పుకోవాలి. అటు అత్తగారితో లేదా ఇటు భర్తతో ఉలుకూ పలుకూ లేదు. భయం భయంగా ఆ మూల ఈ మూల కూర్చుంటోంది. అది గమనించిన సరోజనమ్మ ‘‘అదేంటమ్మా! ఇంకా ఇక్కడే ఉన్నావ్. అబ్బాయి గదిలోకి వెళ్ళాడుగా, నువ్వూ వెళ్ళి పడుకోపో” అంటూ మల్లిని గదిలోకి పంపింది. గదిలోకి అడుగుపెట్టిన మల్లి బిత్తర చూపులు చూస్తూ, వణికిపోతూ ఒక మూలన నేలమీద ముడుచుకొని పడుకుంది. 
‘‘ఏంటి మల్లీ! ఎందుకలా భయపడుతున్నావ్? ఏమైందీ? నేను నిన్నేం చేయనులే భయవడకు. రా. ఇలా వచ్చి కూర్చో’’ అన్నాడు మురళి. మురళి పడుకున్నవాడల్లా మంచం మీద నుండి లేచి వచ్చి ‘‘నువ్వు ఆ మంచంమీద పడుకో. నేను వరండాలో పడుకుంటాలే’’ అంటూ మల్లిని భుజాలు పట్టుకొని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నాడు.

వద్దు... వద్దు. నన్ను వదలండి’’ అంటూ రెండు చేతులతో ముఖాన్ని దాచేసుకుంది మల్లి.
‘‘సరే... సరే... భయపడకు. నేను వేరే గదిలో పడుకుంటాలే’’ అంటూ అవతలికి వెళ్ళిపోయాడు మురళి. మర్నాడు ఉదయం తొమ్మిదైనా పడకగది తలుపులు తెరుచుకోలేదు. సరోజనమ్మ, చేతిలోని పనంతా పూర్తయ్యాక మెల్లగా వాళ్ళు పడుకున్న గది తలుపులు తట్టింది. లోపలినుండి ఎటువంటి సమాధానం లేదు. గది తలుపులు కొంచెం తెరిచి ఉన్నట్లనిపించి మెల్లగా తెరిచి, లోపలికి తొంగి చూసింది. లోపల ఎవరూ లేరు. అరే! మురళీ, ఆ అమ్మాయి ఏరీ? పొద్దున్నే కాఫీ అయినా తాగకుండా ఎక్కడికెళ్ళినట్టూ... అని అనుకుంటూ కంగారుగా పెరటి వైపుకి వెళ్లి చూసింది. అక్కడ ఎవరూ లేరు. వరండా తలుపులు తీసుకొని బయటికొచ్చి నలువైపులా తేరిపార చూసింది. అల్లంత దూరంలో పదిరోజులనాడు ఈ భూమ్మీదకు వచ్చిన కుక్కపిల్లలను వాటి తల్లి దగ్గర పాలు తాగిస్తున్న మల్లి కనిపించింది. ఈ పిల్ల ఇక్కడ ఉందేంటీ? మరి వాడూ...?  అనుకుంటూ లోపలికొచ్చి పక్కనున్న గదిలో చూసింది. గాఢంగా నిద్రపోతున్న మురళిని చూసి ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుంది సరోజనమ్మ.  రాత్రి ఆ గదిలో పడుకున్న వాడు కాస్తా ఇప్పుడు ఈ గదిలో? ఆ పిల్ల చూస్తే కుక్కల దగ్గర. అసలే కొత్తగా పెళ్ళైన జంట. అంతా అయోమయంగా ఉంది. వచ్చినప్పటినుంచీ ఈ పిల్ల ఏదోలా ఉంటున్నది. కొంచెం పిచ్చిలాంటిదేమైనా ఉందేమో! ఆ విషయం బయటపడనీయకుండా కప్పిపుచ్చి ఈ పెళ్ళి జరిపించి ఉంటారు. కర్మకాలి అదే నిజమైతే ‘వద్దు వద్దంటున్నా’ నేనే వాడి గొంతుకోసా అని ఆలోచిస్తూ ‘‘అమ్మాయ్ మల్లీ! అక్కడేం చేస్తున్నావ్ కాఫీ తాగుదుగాని రా” అంటూ కేకేసింది సరోజనమ్మ. అప్పుడే నిద్రలేస్తున్న మురళి ‘అమ్మా నాక్కూడా’ అన్నాడు. మరోనిమిషంలో సరోజనమ్మ ఇద్దరికీ కాఫీ గ్లాసులు ఇచ్చింది. ‘‘ఏంటిరా ఇది? నువ్విక్కడ. ఆ అమ్మాయి అక్కడ ఏమైంది?’’
‘‘ఏమోనమ్మా! నాకేం అర్ధం కావటంలేదు” అంటూ కాఫీ గ్లాసుతో బయటికి నడిచాడు మురళి. రోజులు గడుస్తున్నాయి కానీ మల్లి ప్రవర్తనలో మార్పు లేదు. ఆ రోజు రాత్రి మురళికి అన్నం వడ్డిస్తున్న సరోజనమ్మ ‘మురళీ..’అంటూ ఏదో చెప్పేందుకు ప్రయత్నించింది. ఆమె ఏమి చెప్పబోతుందో గ్రహించిన మురళి ‘‘ఆ అమ్మాయి మనింట్లో సంతోషంగా ఉన్నట్లు అనిపించటంలేదు. రేపు నువ్వు ఆమెని వాళ్ళ వాళ్ళ దగ్గర దింపేసిరా. తనెక్కడుంటే ఆనందంగా ఉంటుందో అక్కడే ఉండనీ’’ అన్నాడు వంచిన తల ఎత్తకుండా,

ఇంటిముందు ఆటో ఆగిందో లేదో గభాల్న ఒక్క దూకు దూకి ‘అమ్మమ్మా...’ అంటూ ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వెళ్ళి సుశీలను చుట్టేసుకుంది మల్లి.
‘‘మల్లీ! నువ్వేంటి ఇలా?’’ అంటూ ఎదురుగా నిలబడున్న సరోజనమ్మను చూసి ‘‘సరోజినీ రారా! అబ్బాయి ఏడీ?’’ అని ప్రశ్నార్థకంగా చూసింది. సరోజనమ్మ నుండి ఎటువంటి సమాధానం లేదు. ముళ్ళమీద కూర్చున్నట్లు ఐదు నిమిషాలు కూర్చుని వాళ్ళు అడిగినదానికి ముక్తసరిగా సమాధానం చెప్పి వెనుదిరిగింది.

నాలుగు నెలల సమయం ఇట్టే దొర్లిపోయింది. ఆ నాడు అర్ధాంతరంగా పుట్టింటి దగ్గర దించిన మల్లిని అత్తింటివారు తిరిగి చూడలేదు. మంచి సంబంధం, పిల్ల సుఖపడుతుంది అనుకున్నా. వాళ్ళది మంచి కుటుంబం. వాళ్ళను అనుకోవలసిన పనిలేదు. ఇదే ఏదో చేసి వాళ్ళ మనసులు కష్టపెట్టి ఉంటుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని దృఢ నిశ్చయానికొచ్చింది సుశీల.

నాకు ఇవ్వాళ కలెక్టర్ ఆఫీసుకు వెళ్ళాల్సిన పనుంది. రావటానికి ఆలస్యమవుతుంది’’ అంటూ గుమ్మం దాటబోయిన వాడల్లా ఆగిపోయి ‘‘అమ్మా తొందరగా రా’’ అంటూ బిగ్గరగా కేకేశాడు.
‘‘ఏమైందిరా’’ అంటూ గాబరాగా చీరకొంగుకు చేతులు తుడుచుకుంటూ వచ్చిన సరోజనమ్మకు ఆటో దిగి నడిచి వస్తున్న సుశీల కనిపించింది.
‘‘బాబూ! బయటికెళుతున్నట్టున్నారు. మీతో మాట్లాడదామని వచ్చాను. కొంచెంసేపు అలా లోపలికి రండి బాబూ!’’ అంది సుశీల బతిమాలుతున్నట్లు.
‘‘నాకు అర్జెంట్ పనుంది. అమ్మతో మాట్లాడండి’’  అంటూ విసురుగా ముందుకు అడుగు వేయబోయిన మురళి చేయి పట్టుకొని ‘‘ఒక్క పదినిమిషాలు బాబూ. మీ ఇద్దరితో కొంచెం మాట్లాడి వెళతాను. నేను చెప్పే నాలుగు మాటలు విని వెళుదురు” గాని అంటున్న సుశీలను లోపలికి తెచ్చి ముందు గదిలో ఉన్న కుర్చీలో కూర్చోబెట్టారు. . ఆమె ఏం మాట్లాడుతుందో విందామని సరోజని, మురళి కూడా అక్కడే ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు.

నా మనవరాలు పెళ్ళి జరిగిన సంతోషం నుండి మేమింకా బయటకు రాకముందే విధి దాన్ని మళ్ళీ నా ఇంటికి చేర్చింది. కారణం ఏదైనా కావచ్చు. అది ఒక అమాయకపు ఆడపిల్ల బాబూ! తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని నిర్భాగ్యురాలు. కళ్ళు తెరవకముందే తల్లిని పోగొట్టుకున్నది. తాను తల్లిగా భావించిన మారుతల్లి చేతిలో చిత్రహింసలు అనుభవించింది. దాంతో ఎవరితో ప్రేమగా మెలగాలో తెలియక దాని మనసంతా భయం ఆవహించి ఎవరు తనవారో, ఎవరు పరాయివారో తెలుసుకోలేని నిస్సహాయతతో మూగజీవాల పంచన చేరి సాంత్వన పొందింది. అంతేగాని దానిలో ఏ కల్మషం లేదు. 

ఇప్పుడది పదిహేను రోజులనుండి జ్వరంతో బాధపడుతోంది. డాక్టర్లు టైఫాయిడ్ అంటున్నారు. మూసినకన్ను తెరవకుండా పడుకొని ఉంది. మాకా ఇంకా పెద్ద డాక్టర్​కి చూపించే శక్తి లేదు. మిమ్మల్ని మోసం చేసి దాన్ని మీ ఇంటి కోడల్ని చేయాలని అనుకోలేదు. అది ఎవరి ప్రేమకూ నోచుకోని దురదృష్టవంతురాలు’’ అని చెప్పి కళ్ళనీళ్ళు తుడుచుకుని వెనుదిరిగింది సుశీల.

ఇల్లంతా నిశ్శబ్దం చోటు చేసుకుంది. మురళి, సరోజనమ్మల మనసులకు ప్రశాంతత కరువైంది. మురళి ఆలోచనలతో సతమతమైపోతున్నాడు. పడుకున్నాడే కానీ నిద్ర పట్టడం లేదు. మురళి మనసంతా కకావికలమైపోతోంది. ధర్మపన్నాలు వల్లించిన తాను చేసిందేమిటి? ఒక నిరుపేద అమ్మాయిని సప్తపదుల సాక్షిగా పెళ్ళి చేసుకొని, జీవితమంతా తోడుంటానని ప్రమాణం చేసి, తెలియక చేసిన తప్పిదానికి ఆ అమ్మాయికి ఇంత పెద్ద శిక్ష వేసే హక్కు నాకు ఎవరిచ్చారు. ఆమెలో మార్పు తీసుకురావటానికి ఏదో ఒకటి చేయాలి అని ఓ నిశ్చయానికి వచ్చాడు.

మర్నాడు పొద్దున పది గంటలకల్లా మురళి బైక్ సుశీలమ్మ ఇంటి ముందు ఆగింది. మరుక్షణంలో అంబులెన్స్ రావటం. మల్లిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేయటం జరిగిపోయింది.15 రోజుల్లో జ్వరం తీవ్రత తగ్గి మల్లి మామూలు మనిషైంది. డాక్టర్​ డేవిడ్​తో మల్లి మానసిక స్థితిని వివరించాడు మురళి. ఈ15 రోజులు హాస్పిటల్లో రాత్రింబవళ్ళు మల్లి దగ్గరే ఉండి సపర్యలు చేసిన మురళికి ఆటుపోట్లు ఎదురైనా ఓర్పుతో సహించాడు. క్రమేణా ఇద్దరి మధ్యా చనువు చోటుచేసుకుంది. డాక్టర్​ డేవిడ్ చెప్పిన సైకియాట్రిస్ట్ దగ్గరకు మల్లిని తీసుకెళ్ళాడు మురళి. 

డాక్టర్ పర్యవేక్షణలో థెరపీ జరిగి కొద్ది రోజుల్లోనే ‘‘మన ప్రయత్నం సఫలీకృతమైంది మురళీ...’’ అన్న డాక్టర్ మాటలు మురళి మనసుని ఆనందంతో నింపేశాయి.
మర్నాటి ఉదయం ఆలస్యంగా నిద్రలేచిన మురళి ‘‘అమ్మా కాఫీ’’ అని కేకేశాడు. మరుక్షణంలో కాఫీ కప్పుతో నవ్వుతూ ఎదురుగా నిలబడ్డ మల్లిని చూసిన మురళి ‘‘నువ్వు...! నువ్వు....!’’ అంటున్నాడే కానీ నోట మాట పెగలటం లేదు.
మల్లి పకపకా నవ్వుతూ ‘‘నేనేనండీ మల్లిని. అత్తయ్య వేరే పనిలో ఉన్నారు. అందుకనే నేను...’’ అంటూ చేతిలోని కాఫీ కప్పును పక్కనపెట్టి, ఆప్యాయంగా మురళిని పెనవేసుకుంది. ఈ పరిణామానికి ఉక్కిరిబిక్కిరవుతూ ‘‘నవ్వింది నాగమల్లీ...’’ అంటూ మల్లిలో సగభాగమై ఒదిగిపోయాడు మురళి.

  ఫోన్ :   9490233148