అక్రమాలకు రాచబాట .. ఎమహారాష్ట్రకు బియ్యం, మద్యం, ఎరువులు అక్రమ రవాణా

  • మహారాష్ట్రకు బియ్యం, మద్యం, ఎరువులు అక్రమ రవాణా 
  • అటు నుంచి వడ్లు, నకిలీ విత్తనాలు, కలప,  గంజాయి ఇటు.. 
  • ఎన్నికలప్పుడే చెక్ పోస్ట్ పెట్టి  ఆపై ఎత్తేస్తున్న అధికారులు 

మంచిర్యాల, వెలుగు: తెలంగాణ, మహారాష్ర్ట, ఛత్తీస్​గఢ్ రాష్ట్రాలను కలుపుతూ నిర్మించిన నేషనల్​ హైవే 63 అక్రమాలకు రాచబాటగా మారింది. తెలంగాణ, మహారాష్ర్ట సరిహద్దుల్లోని ప్రాణహిత బ్రిడ్జి వద్ద ఇంటర్​స్టేట్​ చెక్​పోస్ట్​ ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే చెక్​పోస్ట్​ ఏర్పాటు చేసి ఆపై ఎత్తేస్తున్నారు. అక్రమ రవాణాతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ప్రాణహిత బ్రిడ్జి దగ్గర చెక్​పోస్ట్​పెడతామని అధికారులు పేర్కొంటున్నా ఆచరణలోకి రావడం లేదు. మహారాష్ర్ట వైపు ఫారెస్ట్ ​చెక్​పోస్ట్​పెట్టి కొంతవరకు కంట్రోల్​ చేస్తున్నారు. ఇటువైపు అది కూడా లేకపోవడంతో అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.  

యథేచ్ఛగా అక్రమ రవాణా 

ఎన్​హెచ్​63 మీదుగా మంచిర్యాల జిల్లా నుంచి రేషన్ ​బియ్యం, మద్యం, ఎరువులు మహారాష్ర్టకు యథేచ్ఛగా తరలిపోతున్నాయి. సిరొంచ సమీపంలో ఓ వ్యాపారి రేషన్ ​బియ్యం దందా నిర్వహిస్తున్నాడు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆటోలు, బొలెరోలు, డీసీఎంలలో పెద్ద ఎత్తున రేషన్​బియ్యాన్ని సిరొంచకు తరలిస్తున్నాడు. పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతం నుంచి అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా మహారాష్ర్టకు రవాణా చేస్తున్నాడు.

చెన్నూర్​తో పాటు సరిహద్దు మండలాల నుంచి యూరియా, ఎరువులను వ్యాపారులు సిరొంచకు తరలిస్తున్నారు. చెన్నూర్​, కోటపల్లి మండలాల నుంచి పెద్ద ఎత్తున మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. గడ్చిరోలి జిల్లాలో మద్య నిషేధం​అమలులో ఉండడం వల్ల అక్రమార్కులు మద్యం దందాతో సొమ్ము చేసుకుంటున్నారు. పోలీస్​, రెవెన్యూ, సివిల్ ​సప్లయీస్ ​అధికారులు అడపాదడపా తనిఖీలు చేసి పట్టుకోవడం మినహా అక్రమ దందాను అరికట్టడంలో విఫలమవుతున్నారు.  

ఎన్నికలప్పుడే చెక్​పోస్ట్​  

అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల టైంలో మాత్రమే మహారాష్ర్ట, తెలంగాణ రెండు వైపులా చెక్​పోస్ట్​లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తర్వాత ఎత్తేయడం వల్ల రెండు రాష్ర్టాల మధ్య అక్రమ రవాణాను అడ్డుకునేవారు కరువయ్యారు. అంతేగాకుండా, మహారాష్ర్ట, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువ.

కానీ, ఇక్కడ నిఘా లేకపోవడంతో అసాంఘికశక్తులు జిల్లాలో ప్రవేశించడానికి వెసులుబాటు కలుగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రాణహిత బ్రిడ్జి దగ్గర ఇంటర్​ స్టేట్​చెక్​ పోస్ట్​ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. పోలీస్, ఫారెస్ట్​, సివిల్​సప్లయీస్ ​డిపార్ట్​మెంట్ల అధికారులు, సిబ్బందితో మూడు షిఫ్టుల్లో నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరముందని పేర్కొంటున్నారు. చెక్​పోస్ట్​ వద్ద వచ్చిపోయే వెహికల్స్​ను తనిఖీలు చేసి పంపడం వల్ల అక్రమ దందాలు కంట్రోల్ ​అవుతాయని అభిప్రాయపడుతున్నారు.  

మహారాష్ట్ర నుంచి తెలంగాణకు.. 

మహారాష్ట్ర నుంచి తెలంగాణకు ఎన్​హెచ్ ​63 మీదుగా నకిలీ విత్తనాలు, గంజాయి, టేకు కలపను అక్రమంగా తరలిస్తున్నారు. సిరొంచ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి టేకు కలపను మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్​ జిల్లాలకు రవాణా చేస్తున్నారు. ప్రాణహిత బ్రిడ్జి దగ్గర సిరొంచ వైపు ఫారెస్ట్​ చెక్​ పోస్ట్ ​ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో కంట్రోల్ ​చేయలేకపోతున్నారు.

అలాగే, జిల్లాకు చెందిన కొంతమంది మహారాష్ర్ట నుంచి నకిలీ పత్తి విత్తనాలతో పాటు నిషేధిత గ్లైపోసెట్ ​గడ్డిమందును అక్రమంగా తరలిస్తున్నారు. కొంతమంది దళారులు వానాకాలం, యాసంగి సీజన్లలో పండించిన వడ్లను జిల్లాకు తరలించి ఇక్కడి రైతుల పేరిట కొనుగోలు కేంద్రాల్లో అమ్ముతున్నారు. మహారాష్ర్టతో పాటు ఛత్తీస్​గఢ్​ నుంచి గంజాయి సైతం మంచిర్యాల జిల్లాకు వస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాణహిత బ్రిడ్జి వద్ద ఇంటర్​ స్టేట్​ చెక్​పోస్ట్​ లేకపోవడం వల్లే దందా జోరుగా సాగుతోందని ఆరోపిస్తున్నారు.