- అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్ ఘన విజయం
- 48 స్థానాల్లో గెలుపు.. బీజేపీకి 29 సీట్లు
- చతికిలపడ్డ పీడీపీ.. ఖాతా తెరిచిన ఆప్
- పదేండ్ల తర్వాత జమ్మూలో ప్రభుత్వ ఏర్పాటు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో పదేండ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. ఒకప్పుడు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన ప్రజలే.. తాజాగా జరిగిన ఎలక్షన్లలో ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాశ్మీరీ ఓటర్లంతా నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమికే పట్టం కట్టారు. హంగ్ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
కానీ, వాటికి భిన్నంగా 48 సీట్లతో కాంగ్రెస్-, ఎన్సీ కూటమి ఘన విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు దక్కించుకుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్) 42 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 29 స్థానాల్లో, కాంగ్రెస్ ఆరు స్థానాల్లో గెలిచింది. మాజీ సీఎం మహబూబా ముఫ్తీ నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (జేకేపీడీపీ) చతికిలపడిపోయింది.
కేవలం మూడు స్థానాలకే పీడీపీ పరిమితమైంది. జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ (జేపీసీ), సీపీఐ (ఎం), ఆమ్ ఆద్మీ పార్టీలు ఒక్కో స్థానంలో గెలిచాయి. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. బుద్గామ్ సెగ్మెంట్ నుంచి గెలిచిన ఒమర్ అబ్దుల్లానే సీఎంగా బాధ్యతలు చేపడతారని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దులా ప్రకటించారు.
2014తో పోలిస్తే పుంజుకున్న ఎన్సీ
2014లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 87 సీట్లలో బీజేపీ 25 చోట్ల గెలిచింది. పీడీపీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పీడీపీకి 25 సీట్లు, ఎన్సీకి 15 సీట్లు, కాంగ్రెస్ కు 12 సీట్లు వచ్చాయి. నియోజకవర్గాల పునర్విభజనతో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో సీట్లు 90కి పెరిగాయి. అయితే, గవర్నర్ కోటాలో ఐదు నామినేటెడ్ సీట్లు ఉన్నాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ 48గా ఉంది. 2019లో ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలు (జమ్మూ కాశ్మీర్, లడఖ్)గా కేంద్రం విభజించింది. ఈ నేపథ్యంలో జరిగిన తొలి ఎన్నికల్లో ఎన్సీ కూటమి గెలిచింది. ఇండియా కూటమిలో భాగమైన ఆప్.. ఇక్కడ తొలిసారి పోటీ పడి, ఖాతా తెరిచింది.