నల్గొండ అర్బన్, వెలుగు : 2025 మార్చిలో నిర్వహించనున్న ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థిగా అలుగుబెల్లి నర్సిరెడ్డిని మరోమారు నిలపాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, రవి తెలిపారు. గురువారం నల్గొండలోని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీగా అలుగుబెల్లి నర్సిరెడ్డి గత ఐదేండ్లుగా విద్యారంగం అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు.
ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలతోపాటు వివిధ వర్గాల ప్రజా సమస్యలను కౌన్సిల్ లో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ, అధ్యాపక మిత్రులకు ఇచ్చిన హామీ మేరకు తను నిరంతరం పనిచేశానని తెలిపారు. విద్యారంగంలో వివిధ స్థాయిల్లో ఉన్న ప్రభుత్వ, మోడల్ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీ, కాంటాక్ట్ జూనియర్ లెక్చరర్ సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేశానని చెప్పారు.
సమావేశంలో సంఘం ఉపాధ్యక్షుడు రాములు, రాష్ట్ర కార్యదర్శులు నాగమణి, రాజశేఖర్ రెడ్డి, మోడల్ స్కూల్ రాష్ట్ర కన్వీనర్ కొండయ్య, మైనార్టీ గురుకులాల రాష్ట్ర కన్వీనర్ రాంబాబు, బీసీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ జనరల్ సొసైటీ గురుకుల జిల్లా బాధ్యులు, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.