నేత్రపర్వంగా నారసింహుడి చక్రస్నానం

  • ఉదయం మహాపూర్ణాహుతి, చక్రతీర్థం
  • సాయంత్రం శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం
  • నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 11న ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. పదో రోజు బుధవారం ప్రధానాలయంలో మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను నిర్వహించారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మంటపంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఉదయం పూర్ణాహుతి నిర్వహించారు. ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల అర్చకత్వంలో మహాపూర్ణాహుతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 

తర్వాత స్వామివారి చక్రతీర్థం ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు. ప్రత్యేక అలంకారంలో స్వామివారిని విష్ణుపుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి.. గుండం వద్ద నూతన దంపతులైన లక్ష్మీనరసింహుల కల్యాణమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మహా సుదర్శన చక్ర ఆళ్వార్కు పుష్కరిణిలో చక్రతీర్థస్నానం నిర్వహించారు. విష్ణుపుష్కరిణిలోని పుణ్యజలాన్ని ఆలయ ప్రచార రథంలో కొండ కిందికి తీసుకెళ్లి.. లక్ష్మీపుష్కరిణిలో కలిపారు.  

దేవత ఉద్వాసన పలికిన అర్చకులు

ఆలయంలో నిత్యారాధనలు ముగిశాక సాయంత్రం 6 గంటలకు శ్రీపుష్పయాగం నిర్వహించారు. తర్వాత దేవతోద్వాసన, దోపు ఉత్సవాలు నిర్వహించారు. నరసింహుడి కల్యాణం కోసం ధ్వజారోహణం, డోలారోహణం ద్వారా సకల దేవతలను భువికి ఆహ్వానించిన అర్చకులు.. దోపు ఉత్సవం ద్వారా ముక్కోటి దేవతలను దివికి పంపే దేవతా ఉద్వాసన కైంకర్యాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవోలు గజవెల్లి రఘు, శ్రావణ్, సూపరింటెండెంట్ రాజన్ బాబు పాల్గొన్నారు.

నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదకొండో రోజు గురువారం ఉదయం స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోల్సోత్సవం నిర్వహించనున్నారు. దీంతో గత 11 రోజులుగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి.