హైదరాబాద్, వెలుగు : గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహారాష్ట్రలోని నాందేడ్ ఎంపీ (కాంగ్రెస్) వసంత్ చౌహాన్ (69) సోమవారం మృతి చెందారు. నాందేడ్ జిల్లాలోని నైగావ్ ఆయన స్వస్థలం. 2002లో ఎమ్మెల్సీగా, 2009 లో ఎమ్మెల్యేగా పనిచేసిన చౌహాన్.. 2024లో నాందేడ్ ఎంపీగా కాంగ్రెస్ తరఫున గెలిచారు.
ఆయన మృతి చెందిన విషయం తెలుసుకున్న ఏఐసీసీ కార్యదర్శి, మహారాష్ట్ర ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆస్పత్రికి వెళ్లి ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వసంత్ చౌహాన్ మృతిపట్ల భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంతాపం ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.