మాకు కావాలొక మెడికల్​ కంటైనర్ .. వైద్యం అందక తిప్పలు పడుతున్న నల్లమల చెంచులు

నాగర్​కర్నూల్, వెలుగు: వానాకాలంలో సీజనల్,​ విష జ్వరాల బారిన పడినా, ఏ రోగమొచ్చినా వైద్యం అందక నల్లమలలోని చెంచులు తిప్పలు పడుతున్నారు. కనీస వైద్య సదుపాయాలు కల్పించాల్సిన ఐటీడీఏ, జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లమల కోర్​ ఏరియా, ఓపెన్​ ఏరియాలోని పెంటల్లో నివసించే చెంచులు వైద్యం కోసం మన్ననూర్​ లేదంటే అచ్చంపేటకు వెళ్లాల్సిందే.

గతంలో గవర్నర్​ తమిళిసై చెంచు పెంటలను సందర్శించిన సమయంలో రెడ్​క్రాస్​ సొసైటీ ద్వారా సమకూర్చిన రెండు మొబైల్​ బైక్​ క్లినిక్​లు మూలకుపడ్డాయి. సమైక్య రాష్ట్రంలో మొబైల్​ మెడికల్​ యూనిట్(అంబులెన్స్)​ ఏర్పాటు చేసి డాక్టర్, సిబ్బందిని నియమించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత డీజిల్​ లేక అంబులెన్స్​ మూలకు పడగా, డాక్టర్, సిబ్బంది, మందులకు బడ్జెట్​ లేదని అర్దాంతరంగా తీసేశారు.

మన్ననూర్​లో అపోలో హాస్పిటల్స్​ సౌజన్యంతో నడుస్తున్న క్లినిక్​లో వైద్య పరీక్షలు,సేవలు అందుతుండగా, ఆర్డీటీ సంస్థకు చెందిన వైద్య బృందం చెంచు పెంటల్లో తిరిగి వీలైనంత వరకు సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో ములుగులో గిరిజనులకు వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన మెడికల్​ కంటైనర్ ను తమకు అందుబాటులోకి తేవాలని చెంచులు కోరుతున్నారు. దీంతో కొంతమేరకైనా వైద్య సేవలందుతాయని అంటున్నారు.

సెప్టెంబర్​ వరకు ఆంక్షలు..

వన్యమృగాల సంభోగ సమయం కావడంతో ఈ నెల 1 నుంచి బయటి వ్యక్తులను అడవిలోకి అనుమతించడం లేదు. సెప్టెంబర్​ 31 వరకు ఈ ఆంక్షలు అమలవుతాయి. వేటకు వెళ్లి గాయపడినా, జ్వరాలొచ్చినా, గర్బిణులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా వర్షంలో తడుస్తూ బైకులపై మన్ననూర్​ పీహెచ్​సీకి వెళ్లాల్సిందే. పరిస్థితి ఏ మాత్రం తీవ్రంగా ఉన్నా అక్కడి నుంచి అచ్చంపేటకు రెఫర్​ చేస్తున్నారు.

ఇదిలాఉంటే అప్పర్​ ప్లాట్​ ఏరియాలో వైద్యసేవలు అందించేందుకు అమ్రాబాద్, పదర, వటవర్లపల్లి,లింగాల, మన్ననూర్​లో ఏర్పాటు చేసిన పీహెచ్​సీల్లో  డాక్టర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో ఈ పీహెచ్​సీలు చెంచులు, గిరిజనులు, సామాన్యులకు ఫస్ట్​ ఏయిడ్​ అందించే కేంద్రాలుగా మిగిలిపోయాయి.    

 చెంచులను పట్టించుకోవట్లే..

నాగర్ కర్నూల్  జిల్లా పరిధిలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. 8 మండలాల్లో 48 గ్రామ పంచాయితీల పరిధిలోని 111 ఆవాసాలు, చెంచుపెంటల్లో 2,569 చెంచు కుటుంబాలు నివసిస్తున్నాయి. అడవిలో దొరికే  జిగురు, ఇప్ప పలుకు, ఇప్ప పువ్వు, కానుగ పలుకులు, తేనె, నర మామిడి చెక్క, గుడిపాలేర్లు, చీపురు పుల్లలు, కుంకుడు కాయలు, చింతపండు, విస్తరాకులు మొదలైన వాటిని సేకరించి పొట్టపోసుకుంటున్నారు. అయితే నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య పెరగడం, శాఖాహార జంతువుల ఉనికికి ప్రమాదం కలుగుతుందనే కారణంతో ఫారెస్ట్  అధికారులు చెంచులతో పాటు ఇతరులు అడవిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.

అమ్రాబాద్ మండలంలో ముఖ్యంగా శ్రీశైలం ప్రధాన రహదారికి ఇరువైపులా ఉండే వటవర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతల వంటి చెంచు పెంటలతో పాటు జంగంరెడ్డిపల్లి, వెంకటేశ్వర్లబావి, పదర మండలంలోని కొన్ని గ్రామాలు, లింగాల మండలంలోని చెంచు పెంటల్లో విద్య, ఉపాధి సంగతి దేవుడెరుగు.. ప్రాణాల మీది కొచ్చినప్పుడు సూది, మందులు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. చెంచు పెంటల్లో ఏర్పాటు చేసిన సోలార్​ బోర్లు వానాకాలంలో పని చేయకపోవడంతో వాగులు, చెలిమల నీటిని తాగుతున్నారు. దీంతో తరచూ రోగాల బారిన పడు తున్నారు. రక్తహీనతతో బాధపడే గర్బిణులకు వైద్య సదుపాయాలు కరువవుతున్నాయి.  

బడ్జెట్​ లేదని పదేండ్లు గడిపిన్రు..

అంతరించిపోతున్న అరుదైన జాతిగా గుర్తించిన నల్లమల చెంచులకు విద్య, వైద్యం, ఉపాధి, కనీస వసతులు కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఐటీడీఏ వన్​ మ్యాన్​ షోగా మారింది. పీవో, అధికారులు, సిబ్బంది లేకుండానే పదేండ్లు నడిపించారు. ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్​ శరత్​ నల్లమలలో పర్యటించినప్పుడు చెంచులు, గిరిజనులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఏ అవసరం ఉండి ఐటీడీఏకు వెళ్లినా బడ్జెట్​ లేదని చెప్పడానికి ఓ అధికారిని పెట్టి చేతులు దులుపుకున్నారని వాపోయారు. ఇటీవల ములుగు  నియోజకవర్గంలోని అటవీప్రాంతంలో ఏర్పాటు చేసిన మెడికల్​ కంటైనర్​ను తమకు అందుబాటులోకి తేవాలని చెంచులు కోరుతున్నారు.

మనుషులుగా చూడండి..

తాగడానికి నీళ్లు, విద్య, వైద్యం అందకపోతే చెంచులు అడవి విడిచి వెళ్తారని అధికారులు భావిస్తున్నారు. తమను మనుషులుగా గుర్తించి విద్య, వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

గురవయ్య, అప్పాపూర్​ పెంట