నల్లా బిల్లు బకాయిలు రూ. 6.58 కోట్లు

  • వనపర్తిలో కొండలా పేరుకుపోయిన నల్లా బిల్లులు 

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలోని అయిదు మున్సిపాలిటీల్లో నల్లా బిల్లుల బకాయిలు కొండలా పేరుకుపోయాయి.  ఏళ్ల తరబడి పేరుకుపోయిన నల్లా బిల్లుల వసూలు మున్సిపాలిటీలకు భారంగా మారాయి. జిల్లాలోని అయిదు మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం రూ.6.58కోట్ల బకాయిలు పేరుకుపోగా..   అందులో జిల్లా కేంద్రమైన వనపర్తి మున్సిపాలిటీలోనే ఏకంగా రూ.6 కోట్ల బకాయిలున్నాయి. మున్సిపాలిటీలలో కమర్షియల్​, ఇండ్లకు సంబంధించి డొమెస్టిక్​ కనెక్షన్‌‌కు  నిర్ధారించిన మేరకు  ప్రతి నెలా నల్లా బిల్లులు వసూలు చేయాలి. 

 మిషన్​ భగీరథ పథకం రాకముందు నల్లాలున్న వారు సక్రమంగానే బిల్లులు చెల్లించే వారు.  తర్వాత మున్సిపల్​ సిబ్బందే ఆఫ్​లైన్​లో బిల్లులు వసూలు చేసి మున్సిపల్​ ఖాతాలో జమచేయకపోవడంతో బకాయిలు పెరిగిపోతున్నాయనే ఆరోపణలున్నాయి. ప్రజలు కూడా ప్రతి నెలా నల్లా బిల్లులు చెల్లించాల్సి ఉండగా, మున్సిపల్​ అధికారులు దీనిపై పెద్దగా దృష్టి సారించడం లేదు.  ఆర్థిక సంవత్సరం చివరలో ఆదర బాదరగా నల్లా బిల్లుల వసూలు కోసం అధికారులు పరుగులు పెడుతున్నారు 

 వనపర్తిలో 18 ఏళ్ల బకాయిలు

2006 నుంచి వనపర్తి మున్పిపాలిటీలో నల్లా బిల్లుల బకాయిలు వసూలు కాకుండా ఉన్నాయి.అయినా 18 ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిలు రూ.6 కోట్లకు పైగా ఉన్నాయి.  ఈ మధ్య కొత్తగా ఇళ్ల నిర్మాణం జరగడంతో  నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ప్రతి నెలా ఇంటి కనెక్షనుదారుడు రూ.150, కమర్షియల్​ వాడకం దారు రూ.200ల చొప్పున నల్లా బిల్లు చెల్లించాలి.  జిల్లాలోని అయిదు మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 16 వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి.  వనపర్తిలో మున్సిపల్​ కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు నిధుల కొరత వేధిస్తుండడంతో నల్లా బిల్లుల వసూలుపై దృష్టి కేంద్రీకరించారు. 

బిల్లుల వసూలుకు స్టాఫ్​ను నియమించారు. వీరికి బిల్లింగ్​ మిషన్లు ఇచ్చారు.  గతంలో ఇలా బిల్లింగ్​ మిషన్ల ద్వారా వసూలు చేసిన ఔట్​ సోర్సింగ్​ ఎంప్లాయీస్​ వాటిని ఆఫీసు ఖాతాలో జమచేయకపోవడం వల్ల బిల్లు  కట్టిన వారు సైతం కట్టనట్లుగా రిజిస్టర్‌‌‌‌లో చూపిస్తున్నట్లు సమాచారం. ఈ సారీ కూడా బిల్లింగ్​ మిషన్ల ద్వారా వసూలు చేస్తుండడం పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

మున్సిపాలిటీ వారీగా బకాయిలు ఇలా

జిల్లా కేంద్రంలోని వనపర్తి మున్సిపాలిటీలో రూ.6కోట్ల నల్లా బకాయిలు ఉన్నాయి. కొత్తకోట మున్సిపాలిటీలో రూ.36లక్షలు, ఆత్మకూరులో రూ.13లక్షలు, అమరచింతలో రూ.9.10లక్షల చొప్పున బకాయిలు ఉన్నాయి.