క్లీన్ ఎయిర్ సిటీల్లో దేశంలోనే నల్గొండ సెకండ్

  • ‘వాయు సర్వేక్షణ్’ అవార్డులు అందజేసిన కేంద్రం 
  • 3 లక్షల లోపు జనాభా కేటగిరీలో నల్గొండకు అవార్డు 

న్యూఢిల్లీ, వెలుగు: స్వచ్ఛమైన గాలి ఉన్న నగరాల్లో నల్గొండ దేశంలోనే సెకండ్ ప్లేస్​లో నిలిచింది. దేశంలో మూడు లక్షలు, అంతకంటే తక్కువ జనాభా కలిగిన నగరాల జాబితా(కేటగిరీ 3)లో మన సిటీకి ఈ అవార్డు లభించింది. శనివారం కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో రాజస్థాన్​లోని జైపూర్​లో అంతర్జాతీయ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్( స్వచ్ఛ వాయు దివస్) నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రొగ్రాం(ఎన్సీఏపీ)లో భాగంగా131 సిటిల్లో గాలి నాణ్యత రికార్డులను ప్రదర్శించారు.

అనంతరం దేశంలో బెస్ట్ క్లీన్ ఎయిర్ సిటీలకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ అవార్డులను అందజేశారు. కేటగిరీ 3లో యూపీలోని రాయ్ బరేలీ ఫస్ట్ ప్లేస్​లో నిలవగా.. నల్గొండ సెకండ్ ప్లేస్​లో, హిమాచల్ ప్రదేశ్​లోని నలగఢ్ థర్డ్ ప్లేస్ లో నిలిచాయి. కేటగిరీ–1(10 లక్షలకు పైగా జనాభా ఉన్న సిటీలు)లో గుజరాత్ లోని సూరత్ అగ్ర స్థానం దక్కించుకుంది. మధ్యప్రదేశ్​లోని జబల్ పూర్ రెండో స్థానం, యూపీలోని ఆగ్రా మూడో స్థానంలో నిలిచాయి.

కేటగిరీ–2(3 లక్షల నుంచి10 లక్షల మధ్య జనాభా ఉన్న సిటీలు)లో యూపీలోని ఫిరోజాబాద్, మహారాష్ట్రలోని అమరావతి, యూపీలోని ఝాన్సీ వరుసగా తొలి మూడు స్థానాల్లో అవార్డులను దక్కించుకున్నాయి. అవార్డులను ఆయా సిటీల మున్సిపల్ కమిషనర్లు అందుకున్నారు. అవార్డు పొందిన సిటీలకు నగదు బహుమతితో పాటు ట్రోఫీ, సర్టిఫికెట్లు అందజేశారు. కేటగిరీ–3లో నిలిచిన నల్గొండకు రూ. 1.5 కోట్ల క్యాష్ ప్రైజ్ లభించింది. 2017–18తో పోల్చితే ఎన్సీఏపీలోని మొత్తం 131 సిటీలకుగాను 95 నగరాల్లో ఎయిర్ పొల్యూషన్ తగ్గిందని భూపేందర్ యాదవ్ తెలిపారు.