పంచాయతీల్లో మహిళా ఓటర్లే ఎక్కువ

  • ముసాయిదా ఓటరు జాబితా విడుదల
  • యాదాద్రిలో 5,20,297 ఓటర్లు
  • సూర్యాపేటలో 6,82,938 ఓటర్లు
  • నల్గొండలో 10,53,837 ఓటర్లు

యాదాద్రి/ సూర్యాపేట/ నల్గొండ, వెలుగు : పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. ఈ ఓటర్లలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఓటర్ల జాబితాను అన్ని పంచాయతీల్లో ఎక్కడికక్కడ ప్రదర్శించారు. దీంతో పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైనట్టయింది. ముసాయిదా ఓటరు జాబితాపై శనివారం నుంచి ఈనెల 21 వరకు అభ్యంతరాలను స్వీకరించి, 26న వాటిని పరిష్కరిస్తారు.

ఈ నెల 18,19 తేదీల్లో జిల్లా, మండల స్థాయిలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి సలహాలు, సూచనలు తీసుకుంటారు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం 28న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు.  

1774 పంచాయతీల్లో ఓటర్ల జాబితా విడుదల..

యాదాద్రి జిల్లాలో గతంలో 421 పంచాయతీలు ఉండగా, కొత్తగా ఏడు పంచాయతీలు ఏర్పాటుతో 428కి చేరుకున్నాయి. 3,666 వార్డులు ఉండగా 3,712కు చేరుకున్నాయి. అయితే సాంకేతిక కారణాల వల్ల 426 పంచాయతీల ఓటర్ల జాబితానే విడుదల చేశారు.

సూర్యాపేట జిల్లాలో గతంలో 475 పంచాయతీలు ఉండగా, కొత్తగా 11 పెంచడంతో 486కు చేరుకున్నాయి. వార్డులు 4,388కు చేరుకున్నాయి. సాంకేతిక కారణాల వల్ల 483 పంచాయతీల ఓటర్ల జాబితానే విడుదల చేశారు. నల్గొండ జిల్లాలో 868 పంచాయతీలు ఉండగా, 865 పంచాయతీల ఓటర్ల జాబితానే రిలీజ్ చేశారు. 

మహిళా ఓటర్లే ఎక్కువ..

ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 22,57,072 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 11,39,908 మహిళా ఓటర్లు, 11,17,088 మంది పురుష ఓటర్లు, ఇతరులు 76 మంది ఉన్నారు.

యాదాద్రి జిల్లాలో 5,20,297 మంది ఓటర్లు ఉండగా, మహిళలు 2,61,127 మంది, పురుషులు 2,59,167 మంది, ముగ్గురు ఇతరులు ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 6,82,938 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3,47,348 మంది మహిళలు, 3,35,570 మంది పురుషులు, ఇతరులు 20 మంది ఉన్నారు.నల్గొండ జిల్లాలో 10,53,837 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 5,31,433 మంది మహిళా ఓటర్లు ఉండగా, పురుషులు 5,22,351 మంది, ఇతరులు 53 మంది ఉన్నారు. 

 

మూడు దశల్లో ఎన్నికలు..

షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా గతంలో మాదిరిగా ఈసారి కూడా పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్నారు. జిల్లాలోని పంచాయతీలను మూడు భాగాలుగా విభజించి.. ఫేజ్​ల వారీగా లిస్ట్​ రూపొందిస్తారు. మొదటి దశ ఎన్నికల్లో బాధ్యతలు నిర్వర్తించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్​ప్రిసైడింగ్​ఆఫీసర్లను మూడో దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం కల్పిస్తారు.

ఎన్నికలకు అవసరమైన పోలింగ్​ బాక్సులు కూడా రెడీగా ఉన్నాయి. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుంచి పంచాయతీల్లో స్పెషలాఫీసర్ల పాలన సాగుతున్న సంగతి తెలిసిందే.