బొమ్మలరామారం పీఏసీఎస్  సీఈవో సస్పెన్షన్

  • సెంటర్లను తనిఖీ చేస్తున్న కలెక్టర్లు, అడిషనల్​ కలెక్టర్లు

యాదగిరిగుట్ట, మోత్కూరు, నల్గొండ అర్బన్, వెలుగు : వడ్ల కొనుగోలుపై ఉమ్మడి జిల్లా యంత్రాంగం సీరియస్​గా దృష్టి సారించింది. కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు ఎక్కడికక్కడ సెంటర్లను తనిఖీ చేస్తున్నారు. కొనుగోలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్టాఫ్, మిల్లర్లను హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం వీడకుంటే చర్యలు తీసుకుంటామని, వడ్లను దించుకోని మిల్లులను సీజ్​చేస్తామని ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు. 

పీఏసీఎస్ సీఈవో జహేందర్ నాయక్ పై సస్పెన్షన్ వేటు..

విధుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా అనధికారికంగా విధులకు గైర్హాజరు అవుతున్న బొమ్మలరామారం పీఏసీఎస్ సీఈవో జహేందర్ నాయక్ పై సస్పెన్షన్ వేటు పడింది. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు చేయకుండా రైతుల ఇబ్బందులకు కారణమైన పీఏసీఎస్ సీఈవోను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు ప్రకటించారు. సోమవారం బొమ్మలరామారంలోని పీఏసీఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సెంటర్ లో ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడమే కాకుండా.. లారీ ఏజెన్సీలతో సమన్వయం లేకపోవడంతో పీఏసీఎస్ సీఈవోపై ఆయన సీరియస్ అయ్యారు. వడ్లకు సంబంధించి ఒక్క ట్యాబ్ లో కూడా ఎంట్రీ చేయకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పీఏసీఎస్ సీఈవోను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్​ చెప్పారు. తుర్కపల్లి, నాగినేనిపల్లి, మైలారంలోని వడ్ల కొనుగోలు సెంటర్లను సందర్శించారు. 

కటింగ్ పెట్టకుండా వడ్లను దించుకోవాలి..

కొనుగోలు సెంటర్ల నుంచి వచ్చే వడ్లను తేమ, తాలు పేరుతో కటింగ్ పెట్టకుండా దించుకోవాలని యాదాద్రి అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి రైస్ మిల్లర్లను ఆదేశించారు. మోత్కూరులోని రైస్ మిల్లుల, కొనుగోలు సెంటర్లను సోమవారం ఆయన సందర్శించి పరిశీలించారు. కొనుగోలు సెంటర్లలో ఏఈవోలు మాయిశ్చర్ చూసి క్వాలిటీ చెక్ చేసిన తర్వాతే వడ్లు కొంటున్నారని, అలాంటప్పుడు తేమ పేరుతో కొర్రీలు పెట్టడం సరికాదన్నారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆఫీసర్లను, సిబ్బందిని ఆదేశించారు. 

ధాన్యం సేకరణలో ఏఈవోలు పాత్ర కీలకం 

ధాన్యం సేకరణలో ఏఈవోలు కీలక పాత్ర పోషించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టరేట్​లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏఈవోలు తప్పనిసరిగా వారి పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నాణ్యతా ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.