ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి : కుందూరు జైవీర్​రెడ్డి

  • ఎమ్మెల్యే కుందూరు జైవీర్​రెడ్డి 

హాలియా, వెలుగు : నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల నుంచి ఇబ్బంది ఉన్నా వెంటనే తనకు ఫోన్ చేయాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్​రెడ్డి రైతులకు సూచించారు. గురువారం హాలియా పరిధిలోని వజ్ర తేజ రైస్ ఇండస్టీను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిల్లర్లు తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయడం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం కొనని మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ధాన్యం కొనుగోళ్ల విషయమై ఇప్పటికే కలెక్టర్ తో సమీక్ష నిర్వహించామమన్నారు. తక్కువ తేమ శాతం ఉన్న ధాన్యాన్ని మానవతాదృక్పథంతో మిల్లర్లు కొనుగోలు చేయాలని సూచించారు. అంతకుముందు మండలంలోని పేరూరు స్వయం భూసోమేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుందూరు వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సలహాదారు నరేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ నారాయణగౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చంద్రారెడ్డి, ఆలయ చైర్మన్​కొండారెడ్డి ఉన్నారు.