క్లైమాక్స్​కు ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్​

  • ఓటర్లతో అభ్యర్థుల ములాఖత్  
  • మారుతున్న బలాబలాలు

నాగర్ కర్నూల్, వెలుగు : లోకల్​ బాడీస్​ ఎమ్మెల్సీ ఎలక్షన్స్​ కాక మొదలైంది. ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాలవారీగా జడ్పీటీసీ, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఓటర్ల  లెక్క తేలింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 1,439 మంది ఓటు వినియోగించుకోనున్నారు. 14 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలు ఎక్స్​ అఫిషీయో హోదాలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఉమ్మడి జిల్లాలో ఓటర్లను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్​ అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

ఇప్పటికే పలు మున్సిపాలిటీలు, మండల పరిషత్​లు కాంగ్రెస్​ ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఉమ్మడి జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గంలో ప్రతిరోజు ఎంపీటీసీలు, కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరుతున్నారు. ఓటమిని జీర్ణించుకోలేని బీఆర్ఎస్​ లీడర్లు ముఖం చాటేస్తుంటే, కింది స్థాయిలో క్యాడర్​ చెల్లాచెదురవుతోంది. ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ ఎలక్షన్స్​కు ముందున్న వాతావరణం ఇప్పడు లేదు.

.14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్, మెజార్టీ మున్సిపాలిటీలు బీఆర్ఎస్​ చేతిలో ఉండేవి. అసెంబ్లీ రిజల్ట్స్​ తర్వాత పరిస్థితి తారుమారైపోయింది. చేజారుతున్న మున్సిపల్​ కౌన్సిల్స్, మండలాలను కాపాడుకోలేక మాజీ ఎమ్మెల్యేలు చేతులెత్తేశారు. 

ఈ ఎన్నికలు మరీ స్పెషల్..

ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్​లో స్థానిక సంస్థల అభివృద్ది, నిధులు, బాధ్యతలు, హక్కులు ఇతర అంశాల కంటే పోయిన చోటే వెతుక్కోవాలన్న ఫిలాసఫీ  ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోవడంతో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపలేదు. దీంతో బీఆర్ఎస్​ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్​రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పోటీ లేకపోవడంతో పైసా ఖర్చు చేయాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు జరుగుతున్న బై ఎలక్షన్స్​లో పోయినసారి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలన్న ఆరాటంతో ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులు లీడర్లు చెప్పిన దానికి తలూపుతున్నా, ఓటింగ్​ విషయానికి వచ్చేసరికి ఏం చేస్తారోననే ఆందోళన రెండు పార్టీల​ క్యాండిడేట్లలో ఉంది.

సీరియస్​గా తీసుకుంటున్న కాంగ్రెస్..

ఎమ్మెల్సీ ఉప ఎన్నికను కాంగ్రెస్​ పార్టీ నేతలు సీరియస్​గా తీసుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్​ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి రెండు సార్లు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఓటర్లను కలిశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతను తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా మున్సిపల్​ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను కలుస్తున్నారు.  ఎమ్మెల్యేల అధ్యక్షతన మీటింగులు నిర్వహిస్తున్నారు.

బీఆర్ఎస్  అభ్యర్థి నవీన్​రెడ్డికి మద్దతుగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మీటింగులు పెడుతున్నారు. ఫస్ట్​ ప్రియారిటీ ఓటుతో బయటపడేందుకు రెండు పార్టీల నాయకులు ప్లాన్​ చేస్తున్నారు. పోలింగ్​ నాటికి పార్టీల బలాబలాలు మారే అవకాశం ఉంది. అవసరమైతే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లను క్యాంప్​లకు తరలించే యోచనలో కాంగ్రెస్  నేతలు ఉన్నారు. 

అధికార పార్టీకి దగ్గరవుతున్రు..

బీఆర్ఎస్​ రెండోసారి అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు. అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు కాకపోవడం, చేయడానికి పనులు లేకపోవడంతో గ్రామాల్లో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ ఎన్నికలతో అధికార పార్టీకి దగ్గర కావడం ద్వారా రాజకీయ భవిష్యత్​కు ఇబ్బంది ఉండదని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు భావిస్తున్నారు.

ఇదే జరిగితే కాంగ్రెస్​ అభ్యర్థి మన్నె జీవన్​రెడ్డి ఫస్ట్​ ప్రియారిటీ ఓట్లతో గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలాఉంటే ఒక వైపు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మరోవైపు పార్లమెంట్​ ఎలక్షన్స్​ బీఆర్ఎస్​ నాయకత్వానికి ఊపిరాడకుండా చేస్తున్నాయి.