నడిగడ్డ ఎమ్మెల్యేలకు పదవీ గండం!

  • కోర్టులో కేసులు వేసిన ప్రత్యర్థులు
  • ఈ నెల 18 వరకు సమాధానం చెప్పాలని గద్వాల, అలంపూర్  ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ
  • గతంలోనూ గద్వాల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తీర్పు 

గద్వాల, వెలుగు: నడిగడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పదవీ గండం వెంటాడుతోంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులు, అప్పులు సరిగా చూపించలేదని, ఆయన చేతిలో ఓటమి పాలైన కాంగ్రెస్  అభ్యర్థి సరిత హైకోర్టులో కేసు ఫైల్  చేశారు. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేసిన అలంపూర్  ఎమ్మెల్యే విజయుడు, జాబ్​కు రిజైన్​ చేయకుండా నామినేషన్ వేశారని బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకుమార్  హైకోర్టును ఆశ్రయించారు.

ఏప్రిల్ 18 వరకు సమాధానం చెప్పాలంటూ ఇద్దరు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించడం జోగులాంబ గద్వాల జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి డీకే అరుణ హైకోర్టులో కేసు వేయగా, అతనికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఎమ్మెల్యే పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొని ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇంతలోనే మళ్లీ ఎలక్షన్  రావడం, ఎన్నికల్లో గెలిచాక మళ్లీ కోర్టులకు వెళ్లాల్సి రావడం చర్చనీయాంశంగా మారుతోంది.

ఆస్తులు, అప్పులు చూపించలేదని..

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్  వేసే టైంలో ఆస్తులు, అప్పులు సరిగా చూపించలేదని బీజేపీ అభ్యర్థి బలిగేర శివారెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా ఎన్నికల ఆఫీసర్ కు కంప్లైంట్ చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అఫిడవిట్ లో బ్లాంక్ పెట్టకూడదని, ఫైన్లు ఉన్నప్పటికీ ఆయన అందులో చూపించలేదని ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి పట్టించుకోకపోవడంతో ఆయన నామినేషన్  యాక్సెప్ట్  చేశారు. ఎన్నికల్లో ఆయన గెలిచారు. ఇదిలాఉంటే కాంగ్రెస్  అభ్యర్థి సరిత ఆయనపై కోర్టులో కేసు ఫైల్  చేశారు.

ఎన్నికల అఫిడవిట్ లో బ్లాంక్  పెట్టారని, హైకోర్టు రూ.2.50 లక్షలు ఫైన్ చెల్లించాలని తీర్పు ఇచ్చిన విషయాన్ని అఫిడవిట్ లో చూపించలేదని, రెవెన్యూ రికార్డుల ప్రకారం గోదాములు ఆయన పేరుపై ఉన్నప్పటికీ వివరాలు తెలపలేదని, రోడ్ టెక్  కంపెనీలో ఆయన పార్టనర్ గా ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నప్పటికీ, ఆ కంపెనీపై రూ.కోటి పెనాల్టీ ఉన్న విషయాన్ని దాచి పెట్టారని, అలాగే అకౌంట్స్, ఆస్తులు, అప్పులు చూపించలేదనే ఆరోపణలు చేస్తూ ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 18 వరకు నోటీసుకు సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

గతంలోనూ ఇదే పరిస్థితి..

గత ఎన్నికల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి పదవీ గండం తప్పలేదు. 2019 ఎన్నికల్లో ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులు, అప్పులు సరిగా చూపించలేదని అప్పటి కాంగ్రెస్  అభ్యర్థి డీకే అరుణ 2019లో హైకోర్టులో కేసు ఫైల్  చేశారు. అప్పట్లో కోర్టు నోటీసు జారీ చేసింది. రూ.2.50 లక్షలు ఫైన్ విధిస్తూ, ఎమ్మెల్యేను డిస్​క్వాలిఫై చేస్తూ హైకోర్టు 2023లో తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పు ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్  కూడా జారీ చేసింది. ఆ తర్వాత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొని ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ కేసు కోర్టులో ఉండగానే, 2023 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలవడం, మళ్లీ ఓడిపోయిన అభ్యర్థి ఆయనపై కోర్టుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారుతోంది.

జాబ్​కు రాజీనామా చేయలేదని..

అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అలంపూర్  ఎమ్మెల్యే విజయుడు ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామ ఫీల్డ్  అసిస్టెంట్ గా విధులు నిర్వహించేవారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు బీఆర్ఎస్  పార్టీ టికెట్  ఇచ్చింది. నామినేషన్  కంటే ముందు ఫీల్డ్ అసిస్టెంట్  జాబ్​కు రాజీనామా చేయలేదని, అప్పట్లోనే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకుమార్, కాంగ్రెస్  అభ్యర్థి సంపత్ కుమార్  ఎలక్షన్​ ఆఫీసర్ కు కంప్లైంట్ చేశారు.

ఈ విషయాన్ని అప్పట్లో పట్టించుకోలేదు. దీనిపై బీఎస్పీ అభ్యర్థి హైకోర్టులో కేసు ఫైల్  చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే తప్పనిసరిగా ఫీల్డ్ అసిస్టెంట్  ఉద్యోగానికి రాజీనామా చేసి ఉండాలని, అలా చేయకుండా నామినేషన్  వేశారని ఆయన కోర్టులో కేసు వేయడంతో విజయుడుకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇలా జిల్లాలోని  ఇద్దరు బీఆర్ఎస్  ఎమ్మెల్యేలకు నోటీసులు వచ్చాయి.