రోజూ సాయంత్రం తన పెట్ డాగ్ స్పానియల్ కాస్సీని బయటికి తీసుకెళ్లే అలవాటు ఉంది ఎలిస్ ట్రెవోరోకు. అలా 2014లో ఒకరోజు ఆ కుక్కని తీసుకుని ఓ బ్రిడ్జి మీదుగా వెళ్తోంది. అక్కడి వాతావరణం హాయిగా అనిపించింది ఆమెకు. ఆ పచ్చదనంలో కాసేపు సేద తీరాలి అనుకుంది. అలా అనిపించడం ఆలస్యం వెంటనే కారు ఆపింది. కారు డోర్ తెరవడం ఆలస్యం ఆమె కంటే ముందే కుక్క కిందికి దూకి బ్రిడ్జి మధ్యకు పరిగెత్తింది. ఆ తరువాత బ్రిడ్జి మీద నుంచి కిందకి దూకేసింది. ఒళ్లంతా గాయాలైన స్పానియల్ని తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్లారు. అదృష్టవశాత్తు దాని ప్రాణాలు దక్కాయి. కానీ.. అదే బ్రిడ్జి, అదే ప్లేస్ నుంచి అప్పటికే దాదాపు 600 వరకు కుక్కలు దూకాయి. అందులో యాభై కుక్కలకి పైగా ప్రాణాలు కోల్పోయాయి. ఇదంతా ఎందుకు జరుగుతోంది? కుక్కలు ఆత్మహత్య చేసుకోవడమేంటి? అనిపిస్తుంది కదా! అయితే.. ఈ మిస్టరీ చదవాల్సిందే.
మనుషులు ఆత్మహత్యలు చేసుకోవడం తెలుసు. కానీ.. జంతువులు ఎక్కడైనా ఆత్మహత్య చేసుకోవడం గురించి విన్నారా? దాదాపు విని లేదా చూసి ఉండకపోవచ్చు. కానీ.. స్కాట్లాండ్ వాసులు మాత్రం.. జంతువులు ఆత్మహత్య చేసుకోవడం చూశామని చెప్తున్నారు. పైగా అవి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక సూసైడ్ స్పాట్ కూడా ఉందంటారు వాళ్లు.
స్కాట్లాండ్‌లోని గ్లాస్గో సిటీకి ఉత్తరాన అరగంట జర్నీ చేస్తే వచ్చే డంబార్టన్ గ్రామానికి దగ్గర్లో ఓవర్‌టౌన్ హౌస్ అని పిలిచే19వ శతాబ్దపు నాటి కోట ఉంది.160 ఏండ్లుగా దాన్ని అనేక రకాలుగా వాడుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం టైంలో మిత్రరాజ్యాల సైనికులకు వైద్యం చేయడానికి హాస్పిటల్‌గా మార్చారు దాన్ని. ఆ తర్వాత నుంచి ఇక్కడ రెగ్యులర్‌గా సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయి. ఇక్కడి ఎస్టేట్‌లో వ్యవసాయం కూడా చేస్తుంటారు. దీన్ని ఒక పారిశ్రామికవేత్త కుటుంబం కట్టించింది. అయితే..
సాధారణంగా ఇలాంటి పాత కోటల చుట్టూ అతీంద్రియ శక్తులు, దెయ్యాల పేరుతో పుకార్లు చక్కర్లు కొడుతుంటాయి. ఈ కోటకు అలాంటి సమస్య లేదు. కానీ.. ఈ కోట పక్కనే ఉన్న ఓవర్‌టౌన్ బ్రిడ్జ్‌కు మాత్రం చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ బ్రిడ్జిని1895లో స్కాటిష్ బారోనియల్ స్టయిల్‌లో మూడు పెద్ద ఆర్చ్‌లతో కట్టారు. లోయ నుండి15 మీటర్ల ఎత్తు ఉంటుంది. కొన్ని దశాబ్దాలుగా ఇది వాడకంలో లేదు. 1950ల్లో మాత్రం దీని గురించి ప్రజల్లో బాగా చర్చ జరిగింది. అప్పట్నుంచే దీన్ని ‘ది బ్రిడ్జ్ ఆఫ్ డెత్’ అని పిలవడం మొదలుపెట్టారు. అందుకు కారణం.. 1950ల్లో ఈ బ్రిడ్జి కుక్కలకు సూసైడ్ స్పాట్‌గా మారడమే.
ఆరు వందల కుక్కలు
ఈ కోట కట్టిన దాదాపు యాభై ఏండ్ల వరకు ఎలాంటి సమస్యాలేదు. కానీ.. 1950ల్లో ఈ బ్రిడ్జి నుంచి కుక్కలు దూకడం గమనించారు గ్రామస్తులు. అందుకు కారణాలు తెలుసుకోవడానికి ఎంత ట్రై చేసినా లాభం లేకపోయింది. ఏండ్లు గడిచే కొద్దీ అక్కడ చనిపోయే కుక్కల సంఖ్య పెరుగుతూ పోయింది. కొన్నేండ్లలోనే దాదాపు 600 కుక్కలు ఆ వంతెన పైనుంచి దూకాయి.
కానీ.. వాటిలో చాలావరకు ప్రాణాలతో బయటపడ్డాయి. 50 కుక్కలు మాత్రం అక్కడికక్కడే చనిపోయాయి. అప్పటినుంచి అటువైపు జనాలు వెళ్లడం తగ్గిపోయింది. కుక్కల యజమానులు అయితే... ఆ బ్రిడ్జిని చూస్తేనే భయపడ్డారు.
ఎందుకు చనిపోతున్నాయి?
ఈ బ్రిడ్జి పైనుంచి దూకే కుక్కలన్నీ పొడవాటి ముక్కు ఉండే జాతులకు చెందినవే. ఇలాంటి జాతులే ఎందుకు ఎక్కువగా దూకాయి అనేదానికి ఇప్పటికీ సరైన కారణం తెలియలేదు. ఇలాంటి జాతులను వేట సమయంలో వాసన పసిగట్టేందుకు వాడుతుంటారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఈ కుక్కలన్నీ ఆ బ్రిడ్జిపైన ఒకే స్థలం నుంచి దూకాయి.
బ్రిడ్జి మీద కుడివైపు ఉన్న చివరి రెండు ప్రాకారాల మధ్య నుంచే కుక్కలు దూకాయని చెప్తున్నారు అక్కడివాళ్లు. అలా దూకిన వాటిలో ఎక్కువ కుక్కలు కింద ఉన్న రాళ్ల మీద పడటం వల్లే చనిపోయాయి. రాళ్ల పక్కన పడ్డవి బతికాయి. అక్కడ చనిపోయిన కుక్కల ముక్కుల నుంచి రక్తం కారేది. కొన్ని బతికినా మళ్లీ రెండోసారి కూడా దూకేందుకు ట్రై చేసేవట!
నిర్మాణంలో లోపం
లండన్‌కి చెందిన డాక్టర్ డేవిడ్ సాండ్స్ అనే కుక్కల మనస్తత్వవేత్త 2005లో ఈ మిస్టరీని చేధించేందుకు బ్రిడ్జి దగ్గరికి వెళ్లాడు. ఆయనతోపాటు కెమెరా టీంని కూడా తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లేటప్పుడు ఆయన తనతో పాటు తీసుకెళ్లిన19 ఏళ్ల కుక్క హ్యాండ్రిక్స్ కూడా ఆయన చూస్తుండగానే బ్రిడ్జి మీది నుంచి దూకింది. కాకపోతే అప్పుడక్కడ చాలామంది జనాలు ఉండడం వల్ల దాని ప్రాణాలు కాపాడగలిగారు. అయితే ఆ కుక్క దూకేముందు చాలా ఒత్తిడికి లోనైనట్లు కనిపించింది. దాని ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి.
అయోమయంగా ప్రవర్తించింది. అక్కడి నుంచి దూకిన చాలా కుక్కలు ఇలాగే చేశాయి. కొన్ని కుక్కలు ఏదో పసిగట్టినట్లుగా నిశ్చలంగా మారిపోయేవి. అంతెందుకు కాసేపటి తర్వాత డేవిడ్ సాండ్స్‌కి కూడా వింత భావన కలిగింది. ఒళ్లంతా మండిపోతున్నట్లు అనిపించింది. కాబట్టి ఆ బ్రిడ్జి నిర్మాణంలోనే ఏదో లోపం ఉండి ఉంటుందని చెప్పాడు డేవిడ్. ఈ బ్రిడ్జి దగ్గర గందరగోళాన్ని కలిగించే ఫ్రీక్వెన్సీ ఉంది.
ఆ ఫ్రీక్వెన్సీని గ్రహించే కెపాసిటీ కుక్కలకు చాలా ఎక్కువ. అందుకే అవి దూకేస్తున్నాయి. అంతేకానీ.. కుక్కలు ప్రత్యేకంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో దూకడం లేదని తేల్చాడు ఆయన. అలాగయితే చెప్పాడు కానీ దాన్ని సైంటిఫిక్‌గా ప్రూవ్ చేయలేకపోయాడు. ఆ తర్వాత కూడా చాలామంది ఈ బ్రిడ్జి మీద రీసెర్చ్‌లు చేశారు. కానీ.. ఎవరూ ఈ మిస్టరీని చేధించలేకపోయారు.
కుక్క ఆత్మహత్య చేసుకుంటుందా?
ఒక కుక్క తన మరణాన్ని ముందే ఊహించడం, ఆత్మహత్య చేసుకోవడం అసాధ్యం. మనుషుల్లా కుక్కలు ఆత్మహత్య చేసుకోలేవు. కాకపోతే చావుకి దగ్గరగా ఉన్న జంతువులు ఆఖరి క్షణాలను గడపడానికి ప్రశాంతమైన స్థలాన్ని వెతుక్కుంటాయి. అయితే.. బాగా వయసుపైబడి, శరీరం క్షీణిస్తున్న దశలో అవి అలా ప్రవర్తిస్తాయి. తక్కువ వయసున్న కుక్కలు అలా చేయవు.
కానీ.. కొన్నిసార్లు ఫుడ్ తినకుండా ఉండడం వంటివి చేస్తాయి. అలాగని.. అవి ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడం కాదు. కొన్ని రకాల పరాన్నజీవులు లేదా వ్యాధిని కలిగించే వైరస్ శరీరంలో ఉన్నప్పుడు కుక్కలు ఇలా ప్రవర్తిస్తాయి. కానీ.. ఓవర్‌టౌన్ బ్రిడ్జి నుంచి దూకిన కుక్కలన్నీ హెల్దీగానే ఉన్నాయి.
దెయ్యం ఉందా?
ఈ బ్రిడ్జి గురించి స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆ ప్రాంతంలో పారానార్మల్ యాక్టివిటీస్ ఉన్నాయంటారు. తెల్లగా మెరుస్తున్న ఒకామెని చూశామని చాలామంది చెప్పారు. అది ఆత్మ అయ్యి ఉంటుందని ఆ ఆత్మే కుక్కలను చంపేస్తుందని బలంగా నమ్ముతారు. కొందరైతే ఆ బ్రిడ్జి మీది నుంచి నడుస్తున్నప్పుడు ఆమె వెంబడించిందని కూడా చెప్పారు.
మింక్‌ల కోసమా?
జంతు ప్రవర్తన నిపుణులు కూడా దీని వెనక ఒక సిద్ధాంతం చెప్పారు. కుక్కలు మింక్‌ల పట్ల ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతాయి. మింక్‌లు ఉడుములను పోలిన జంతువులు. వాటి నుంచి ఒకరకమైన కుళ్ళిన వాసన వస్తుంది. వాటి మూత్రం కూడా చాలా గాఢమైన వాసన ఉంటుంది.1950ల్లో మింక్‌లు ఈ ప్రాంతంలో పిల్లల్ని పెట్టడం మొదలుపెట్టాయి. ఆ బ్రిడ్జి చుట్టుపక్కల కూడా అవి తిరుగుతుంటాయి.
కాబట్టి వాటికోసమే కుక్కలు కిందికి దూకి ఉండొచ్చని చెప్తున్నారు. ఇక్కడ చనిపోయినవన్నీ ఎక్కువగా వాసన పసిగట్టే జాతులకు చెందిన కుక్కలే కావడంతో ఈ థియరీకి బలం చేకూర్చినట్టు అయ్యింది. పైగా.. ఒక రీసెర్చ్‌లో కుక్కలు, ఉడతలు, ఎలుకల కంటే మింక్‌ల వాసనకి ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతాయని తేలింది.
ఆప్టికల్ ఇల్యూజినేషన్
ఈ బ్రిడ్జి చుట్టూ పచ్చని గడ్డి, ఎత్తయిన చెట్లు ఉన్నాయి. కుక్కలు అలాంటి పచ్చని వాతావరణంలో ఉన్నప్పుడు గ్రౌండ్ లెవల్‌ని అంచనా వేయడంలో గందరగోళానికి గురవుతాయి. చెట్లు, ఆకుల వల్ల లోయ ఎంత లోతు ఉన్నదనేది వాటికి తెలియదు. కాబట్టి అలాంటి టైంలో ఆప్టికల్ ఇల్యూజినేషన్ కలిగి వస్తువులను దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో కిందికి దూకుతుండొచ్చు. అంటే.. మింక్‌ల వాసన రాగానే బ్రిడ్జి ఎత్తు15 మీటర్లు ఉందని తెలియక మింక్‌ల వైపు దూకేందుకు ప్రయత్నిస్తున్నాయి కాబోలు.