మిస్టరీ : బస్సు నెంబర్ 375

కారు చీకట్లు కమ్ముకున్న ఓ నడిరాత్రి చైనాలో ఒక బస్సు మాయమైంది. దాన్ని దెయ్యాలే మాయం చేశాయని అందరూ నమ్ముతున్నారు. అందుకే ఈ సంఘటన జరిగి 29 ఏండ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆ ఏరియాలో చీకటి పడ్డాక బస్సు ప్రయాణం చేయడానికి వణికిపోతుంటారు జనాలు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? ఆ దెయ్యాలు బస్సుని ఏం చేశాయి? 

చైనాలోని బీజింగ్ సిటీకి దగ్గర్లో జరిగిన ఈ సంఘటనను జనాలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఈ హాంటెడ్ బస్సు కథనాలను రెండు దశాబ్దాలకు పైగా బీజింగ్‌‌లోని అనేక వెబ్‌‌సైట్‌‌లతో సహా కొన్ని ఇంగ్లిష్‌‌ వెబ్‌‌సైట్లు కూడా రాశాయి. 
 

అది 1995  నవంబర్ 14. చలికాలం కావడంతో రోడ్లన్నీ దట్టమైన పొగమంచుతో నిండిపోతున్నాయి. వేగంగా వీచే గాలులు వణుకు పుట్టిస్తున్నాయి. అందుకే చీకటి పడడంతోనే జనాలు ఇండ్లకు చేరుకుంటున్నారు. పైగా ఆగస్టు మధ్య నుంచి నవంబర్ చివరికి భూమ్మీద దెయ్యాలు తిరుగుతాయని చైనీయుల నమ్మకం. అందుకే రాత్రి 9 దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. 

అలాంటి టైంలో రూట్ నంబర్ 375 బస్సు ‘యువాన్ మింగ్ హువాన్’ బస్ టెర్మినల్ నుంచి జియాంగ్ షాన్‌‌కి బయలుదేరింది. ఆ రూట్‌‌లో అదే చివరి బస్‌‌. బస్‌‌ స్టార్టింగ్‌‌ పాయింట్‌‌లో జనాలు బాగానే ఎక్కారు. ఎండింగ్​ పాయింట్​కి వచ్చేలోపులోనే .. దారిలో ఉన్న బస్ స్టేషన్లలోనే అందరూ దిగిపోయారు. దాంతోబస్సు ఖాళీ అయిపోయింది. చివరకు డ్రైవర్, కండక్టర్ మాత్రమే మిగిలారు.

అర్ధరాత్రి దాటాక.. 

జియాంగ్ షాన్  వెళ్లడానికి ఇంకా ఏడు స్టాప్‌‌లు మిగిలి ఉన్నాయి. అర్ధరాత్రి దాటింది. చుట్టూ నిశ్శబ్దం. బస్సు వెళ్లే మార్గంలో గ్రామాల మధ్య చాలా దూరం ఉంటుంది. బస్సు దట్టమైన అడవుల గుండా వెళ్తోంది. అలా వెళ్తూ.. సమ్మర్ ప్యాలెస్ అనే బస్​స్టాప్‌‌లో ఆగింది. అక్కడ ఒక పెద్దావిడ, 19 ఏండ్ల యువకుడు, ఒక యువ జంట బస్సు ఎక్కారు. డ్రైవర్ వెనక సీటులో యువ జంట కూర్చున్నారు. 

డోర్ పక్కన ఉన్న సీటులో అబ్బాయి, అతని వెనక సీటులో పెద్దావిడ కూర్చున్నారు. కండక్టర్‌‌‌‌, డ్రైవర్‌‌‌‌తో కలిపి బస్సులో మొత్తం ఆరుగురు ఉన్నారు. బస్సు బయలుదేరింది. దారిలో కూడా మనుషులు ఎవరూ కనిపించలేదు. మరో నాలుగు స్టాప్‌‌లు దాటాక బస్​ డ్రైవర్‌‌కు రోడ్డు పక్కన ఇద్దరు వ్యక్తులు నిలబడి కనిపించారు. వాళ్ల వేషధారణ చూసిన డ్రైవర్ మొదట బస్సును ఆపడానికి తడబడ్డాడు. పైగా వాళ్లు నిలబడిన ప్లేస్‌‌కి దగ్గర్లోఎక్కడా  బస్‌‌స్టాప్‌‌ లేదు. కానీ.. ఆ దారిలో అదే చివరి బస్సు కావడంతో డ్రైవర్​తో బస్సును బలవంతంగా ఆపించింది లేడీ కండక్టర్​. బస్సు ఆగిన వెంటనే వెనక తలుపు నుంచి లోపలికి ఎక్కారు. 

ఇద్దరు కాదు.. ముగ్గురు

వాళ్లు బస్సు ఆపినప్పుడు ఇద్దరే ఉన్నారు. కానీ.. బస్సు ఎక్కిన తర్వాత  చూస్తే.. ఆ ఇద్దరి మధ్యలో మరో వ్యక్తి ఉన్నాడు. అతడు ఇద్దరి భుజాల మీద చేతులు వేసి, వాళ్ల సాయంతో నిలబడ్డాడు. తల కిందికి వాల్చి ఉంది. ముఖం కనిపించడం లేదు. చిందరవందరగా ఉన్న వెంట్రుకలు అతని ముఖాన్ని కప్పేశాయి. చూడ్డానికి స్పృహలోఉన్నట్టుగా అనిపించలేదు. 

పైకి చూస్తున్న ఇద్దరి ముఖాలు చైనీయుల ముఖాల కంటే చాలా తెల్లగా ఉన్నాయి. ముగ్గురూ పురాతన చైనీస్ బట్టలు వేసుకున్నారు. అవి దాదాపు 16వ శతాబ్దం నాటివి. ముగ్గురూ వెనుక సీట్లో ఒకేచోట కూర్చున్నారు. వాళ్లను చూసిన ప్రయాణికులు కాస్త భయపడ్డారు. కానీ.. ‘‘వాళ్లంతా డ్రామా కంపెనీలో పనిచేస్తుండొచ్చు. రాత్రి పొద్దు పోవడంతోనో.. ఇంటికి వెళ్లే తొందరలోనో బట్టలు మార్చుకోవడం మర్చిపోయి ఉంటార’’ని కండక్టర్ ప్రయాణికులతో చెప్పింది. దాంతో అందరూ కాస్త కుదుటపడ్డారు. 

అనుమానం వచ్చి... 

బస్సు ముందుకు కదిలింది. అయితే.. బస్సులో ఉన్న పెద్దావిడకు ఎందుకో వాళ్ల మీద అనుమానం కలిగింది. అందుకే పదే పదే వెనక్కి తిరిగి వాళ్ల వైపు చూస్తోంది. ఆ తర్వాత స్టాప్‌‌లో దంపతులు దిగిపోయారు. ఇప్పుడు బస్సులో మొత్తం ఏడుగురు ఉన్నారు. పెద్దావిడ మళ్లీ పదే పదే వెనక్కి తిరుగుతూ ఆ ముగ్గురి వైపే చూస్తోంది. మిగిలిన వాళ్ళు మాత్రం ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. 

లేడీ కండక్టర్.. డ్రైవర్‌‌తో మాట్లాడుతోంది. అలా 2.. 3 కిలోమీటర్లు వెళ్లగానే పెద్దావిడ తన ఎదురుగా కూర్చున్న అబ్బాయి దగ్గరకు వెళ్లి గట్టిగా చెంపదెబ్బ కొట్టింది. పెద్దగా అరుస్తూ ‘‘నా పర్సు ఎందుకు దొంగిలించావ్‌‌. మర్యాదగా ఇచ్చెయ్‌‌’’ అన్నది. ఆ గొడవ విన్న కండక్టర్ పెద్దావిడతో  ‘‘అతను నీ పర్సు దొంగిలించలేదు. నీ ఎదురుగా కూర్చున్న వ్యక్తి, వెనక కూర్చున్న నీ పర్స్‌‌ని ఎలా దొంగిలిస్తాడు?’’ అని అడిగింది. 

ఆ అబ్బాయి కూడా దొంగతనం చేయలేదనే చెప్పాడు. అయినా.. ఆ పెద్దావిడ వినకుండా మొండిగా ప్రవర్తించింది. అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు తిట్టింది. బస్‌‌ని దగ్గర్లో ఉన్న పోలీస్‌‌స్టేషన్‌‌కు తీసుకెళ్లాలని డ్రైవర్‌‌‌‌కు చెప్పింది. అతన్ని పోలీసులకు అప్పగిస్తా అన్నది. డ్రైవర్ ఎంత చెప్పినా వినకుండా తరువాతి స్టాప్‌‌లో బస్సును ఆపించింది. ఆ అబ్బాయి కాలర్ పట్టుకుని మరీ లాగి, బలవంతంగా బస్సులో నుంచి దింపేసింది. బస్సు ప్రయాణం మళ్లీ మొదలైంది. 

ఆ ముగ్గురూ దెయ్యాలే!

పెద్దావిడ అలా చేయడంతో  అబ్బాయి చాలా మనస్తాపానికి గురయ్యాడు. బస్సు దిగిన తర్వాత చూస్తే.. దగ్గర్లో ఎక్కడా పోలీస్‌‌స్టేషన్‌‌ కనిపించలేదు. పెద్దావిడతో.. ‘నేను మీ పర్సు దొంగిలించలేదు. మీ తప్పుడు ఆరోపణల వల్ల నేను నా చివరి బస్సు మిస్‌‌ అయ్యాను. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్లాలి. నన్ను ఏ పోలీస్ స్టేషన్‌‌కి తీసుకెళ్తున్నారు? ఇక్కడెక్కడా పోలీస్​స్టేషన్ లేదు’ అని వాదించడం మొదలుపెట్టాడు.  


అప్పుడామె గట్టిగా ఊపిరి పీల్చుకుని... ఆ అబ్బాయితో అసలు విషయం చెప్పింది. ‘‘నిన్ను పోలీస్ స్టేషన్‌‌కి తీసుకెళ్లడానికి బస్సు నుండి దింపలేదు. పైగా నా పర్సు నా దగ్గరే ఉంది. ఎవరూ దొంగిలించలేదు. నీ ప్రాణాలను కాపాడేందుకే అలా చేశాను’’ అన్నది. దాంతో ఆ అబ్బాయి ఆశ్యర్యపోయాడు. ‘‘ఇందాక బస్సు ఎక్కిన ముగ్గురు వ్యక్తులను నువ్వు గమనించావా? వాళ్లు నాకు మొదటి నుంచి వింతగానే అనిపించారు. అందుకే దారి పొడవునా వాళ్లపై ఓ కన్నేసి ఉంచా. అలా వెనక్కి తిరిగి వాళ్లను చూస్తున్నప్పుడు ఒకసారి బలమైన గాలి వీచింది. 

ఆ గాలికి వాళ్ల బట్టలు ఎగిరాయి. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే.. వాళ్లకు కాళ్లు లేవు. ఒక్కసారిగా నా కళ్లను నేనే నమ్మలేకపోయా. దాంతో మరింత తీక్షణంగా గమనించా. వాళ్ల భుజాలపై ఉన్న మూడో వ్యక్తి ముఖం కనిపించింది. అప్పుడు నిర్ధారించుకున్నా వాళ్లు మనుషులు కాదు దెయ్యాలు అని. అందుకే వాళ్లకు అనుమానం రాకుండా వీలైనంత త్వరగా నేను బస్సు దిగి, నిన్నూ దింపేసి నీ ప్రాణాన్ని కాపాడా’’ అని చెప్పింది. అది విన్న అబ్బాయి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.  

పోలీస్‌‌స్టేషన్‌‌లో.. 

పెద్దావిడ, ఆ అబ్బాయి కలసి వెంటనే పోలీస్‌‌స్టేషన్‌‌కు వెళ్లి, తమకు జరిగిన సంఘటన గురించి చెప్పారు. కానీ.. వాళ్ల మాటలు ఎవరూ నమ్మలేదు. వాళ్లను ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పారు. దాంతో చేసేదేమీలేక ఎవరి ఇండ్లకు వాళ్లు వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం నవంబర్ 15న యువాన్ మింగ్ హువాన్ బస్ టెర్మినల్ నుండి వెళ్లిన బస్సు తప్పిపోయినట్లు పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బస్‌‌ డిపో వాళ్లు రాత్రి షెడ్యూల్ చేసిన టెర్మినల్‌‌కు బస్సు చేరుకోలేదని కంప్లయింట్‌‌ చేశారు. వెంటనే పెద్దావిడని, అబ్బాయిని పోలీస్​స్టేషన్‌‌కు పిలిపించారు. వాళ్లు చెప్పిన విషయాలను రికార్డ్ చేశారు. కొద్దిసేపటికే ఈ వార్త చైనాలోని బీజింగ్ అంతటా దావానంలా వ్యాపించింది.

నదిలో దొరికింది

రూట్ నంబర్ 375 బస్సు ఎంత ప్రయత్నించినా దొరకలేదు. అప్పటికి అందుబాటులో ఉన్న అన్ని సీసీ కెమెరాల్లో వెతికారు. కానీ.. లాభం లేకుండా పోయింది. పెద్దావిడ, అబ్బాయి దిగాక స్టాప్‌‌కు కూడా బస్సు వెళ్లలేదు. చుట్టు పక్కల ప్రాంతాలన్నీ గాలించారు. చివరకు నవంబర్16న ఒక నదిలో బస్సు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. చూస్తే.. అదే బస్సు. క్రేన్ సాయంతో బయటకు తీశారు. 

 

బస్సులో మొత్తం ఐదు శవాలు ఉన్నాయి. వాటిలో ఒకటి డ్రైవర్‌‌, మరొకటి మహిళా కండక్టర్‌‌విగా గుర్తించారు. షాకింగ్ విషయం ఏంటంటే.. మిగిలిన మూడు బాగా కుళ్లిపోయిన శవాలు. అవి ఎవరివో కూడా గుర్తుపట్టలేకపోయారు. రెండు రోజుల క్రితం చనిపోయిన వాళ్ల శవాలు అంతలా ఎందుకు కుళ్లిపోయాయి? అనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తప్పిపోయిన ప్లేస్‌‌ నుంచి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో బస్సు దొరికింది.  కానీ.. డిపో మేనేజర్ చెప్పిన దానిబట్టి.. అసలు ఆ బస్సులో వంద కిలోమీటర్లు వెళ్లేంత ఫ్యూయల్ లేదు. అందుకే పోలీసులు ఫ్యూయల్ ట్యాంక్ తెరిచి చూశారు. అందులో డీజీల్‌‌కు బదులు ట్యాంక్ నిండా రక్తం ఉంది. 
 

అసలు ఆరోజు రాత్రి ఏం జరిగింది? బస్సులో ఎక్కింది ఎవరు? బస్సు నది వరకు ఎలా వెళ్లింది?.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు దొరకలేదు.1995లో దీని గురించి చాలా పెద్ద చర్చ జరిగింది. ఈ వార్తను గ్లోబల్ టైమ్స్ ఛానెల్‌‌లో కూడా చూపించారు. ఆ పెద్దావిడని, అబ్బాయిని అందరూ అదృష్టవంతులుగా చెప్పుకున్నారు.