ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి : రాజగోపాల్ రెడ్డి

  • ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

చండూరు (మర్రిగూడ, నాంపల్లి), వెలుగు : శివన్నగూడ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. మండలంలోని శివన్నగూడెంలో రూ.20 లక్షలతో నిర్మించే నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

 కొట్టాల గ్రామంలో రూ.12 లక్షలతో అంగన్​వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, నాంపల్లి మండలంలో దేవత్ పల్లి గ్రామ పంచాయతీ నుంచి సాగర్ హైవే రోడ్డు వరకు రూ.4.35 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. నాంపల్లి మండల కేంద్రంలో కస్తూర్బా పాఠశాల నుంచి గుర్రంపూడ్ రోడ్డు వరకు రూ.15 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

 అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో నర్సరీని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మర్రిగూడ, నాంపల్లి మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్, కత్తి రవీందర్ రెడ్డి, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రావు, మాజీ జడ్పీటీసీలు సురేందర్ రెడ్డి, ఏవీ రెడ్డి, మేతరి యాదయ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.