ప్రజలకు మంచి చేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

 

చౌటుప్పల్, వెలుగు : ప్రజలకు మంచి చేస్తుంటే కేటీఆర్, హరీశ్, కవిత జీర్ణించుకోలేకపోతున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో చేనేత, జౌళిశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలు పదేండ్లు అధికారం ఇస్తే ఏం చేశారని బీఆర్ఎస్​నాయకులను ప్రశ్నించారు. పదేండ్లుగా ప్రజాస్వామ్యాన్ని, ఆర్థిక వ్యవస్థలను బీఆర్ఎస్​ చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు. 

కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పు చేస్తే.. ఆ అప్పులకు వడ్డీలు కడుతున్నామని తెలిపారు. ఆలస్యమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి త్వరలోనే చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. చేనేత కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చేనేత, జౌళిశాఖ ఆర్డీడీ పద్మ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.