మున్నేరు వరదతో తీగల వంతెన పనులు స్లో

  • రూ.180 కోట్లతో కొనసాగుతున్న పనులు 
  • ఇప్పటికే ఆర్నెళ్లు పూర్తి, ఇంకో ఏడాదిన్నర గడువు
  • 110 ఇండ్లను ఖాళీ చేయించేందుకు ఆఫీసర్ల చర్యలు 

ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరాన్ని ఆనుకొని మున్నేరు నదిపై తీగల వంతెన నిర్మాణ పనులు స్లోగా కొనసాగుతున్నాయి. ఆర్నెళ్ల కిందటే పనులు ప్రారంభించినా, ఇటీవల మున్నేరుకు వచ్చిన వరద కారణంగా పనులు మరింత ఆలస్యమవతున్నాయి. వరదతో ఇబ్బంది లేని ప్రాంతాల్లో పనులు కొనసాగిస్తున్నా, వాగు పరిధిలో నిర్మించాల్సిన రెండు ప్రధాన పిల్లర్లలో వర్షాలు రావడానికి ముందు ఒక్క పిల్లర్​ ఫౌండేషన్​ నే కంప్లీట్ చేశారు. ఇంకో పిల్లర్​ కోసం పెద్ద గుంట తవ్వగా దాంట్లోకి నీరు చేరింది. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రెండు వారాల పాటు అక్కడ పనులు నిలిచిపోయాయి. 

 నిధులు మంజూరైనా పనులు స్లో

వర్షాల కంటే ముందుగానే ఈ పనులు కంప్లీట్ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించినప్పటికీ.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఆలస్యమైనట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెళ్ల ముందే బ్రిడ్జి మంజూరైనట్టు ప్రకటించినా, టెండర్లు, ఇతర సాంకేతిక చిక్కులతో ఈ ఏడాది ఫిబ్రవరిలో పనులు ప్రారంభమయ్యాయి. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థకు రెండేళ్లలోగా పనులు కంప్లీట్ చేయాలని కండిషన్​ ఉంది. అయినా గడువులోగా పనులన్నీ పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 

మున్నేరుపై కాలువ ఒడ్డు నుంచి నాయుడుపేటకు వందేళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జిని ఆనుకొని కొత్త తీగల వంతెన నిర్మిస్తున్నారు. ప్లాన్​ ప్రకారం మొత్తం కొత్త బ్రిడ్జిలో 14 పిల్లర్లు ఉంటాయి. ఇందులో ఏడో పిల్లర్​, ఎనిమిదో పిల్లర్లను తీగల వంతెనకు కీలకమైన పైలాన్లుగా ఉపయోగించుకోబోతున్నారు. సూర్యాపేట నుంచి అశ్వారావుపేట వెళ్లే జాతీయ రహదారిపై కిలోమీటర్​ 57.150 నుంచి 58.400 కిలో మీటర్ల వరకు​ ఈ మొత్తం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఇందులో మున్నేరుపై తీగలతో నిర్మించే వంతెన 300 మీటర్లు ఉండనుంది. 

390 మీటర్ల బాక్స్​ టైప్​ వయాడక్ట్ సూపర్ స్ట్రక్చర్​ నిర్మించనున్నారు. దీనితో పాటు మున్నేరుకు రెండు వైపులా అప్రోచ్​ రోడ్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్​ మెంట్ అండ్​ కన్​ స్ట్రక్షన్​) పద్దతిలో చేపట్టిన ఈ టెండర్​ ను రూ.180 కోట్లకు నాసిక్​ కు చెందిన అశోకా బిల్డ్​కాన్​ సంస్థ దక్కించుకుంది. డిజైన్​ ప్రకారం పనులు చేస్తున్నారా లేదా అని ఆర్​ అండ్​ బీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే బ్రిడ్జి, అప్రోచ్​ రోడ్ల కోసం కొంత భూసేకరణ చేయాల్సి ఉంది.
కొత్త బ్రిడ్జి నిర్మాణం జరిగే ప్రాంతంలో, మున్నేరును ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూముల్లో చాలా కుటుంబాలు ఇండ్లు కట్టుకొని నివసిస్తున్నాయి. 

నాయుడుపేట వైపు పాత బ్రిడ్జి కట్టను ఆనుకొని ఇండ్లను కట్టుకున్నారు. ప్రస్తుతం గుడి పక్కనే ఉన్న రోడ్డుపై పిల్లర్​ నిర్మాణం కోసం పనులు జరుగుతుండగా, దాన్ని ఆనుకొని ఓ ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్ వరకు అప్రోచ్​ రోడ్డు నిర్మాణం కానుంది. ఇందులో ప్లాట్లు, ఇండ్లకు సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉందని తెలుస్తోంది. అనధికారిక సమాచారం ప్రకారం 110 ఇండ్ల వరకు తొలగించాల్సి ఉండగా, అందులో ఎక్కువగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టుకున్నవే ఉన్నాయి. వారికి కూడా గతంలోనే ఇందిరమ్మ కాలనీలో ప్లాట్లు కేటాయించినా, అక్కడికి వెళ్లలేదని సమాచారం.

 భూసేకరణ త్వరగా పూర్తిచేసి, నిర్మాణ సంస్థకు అప్పగిస్తే పనులు మరింత స్పీడ్ గా జరిగే అవకాశముంటుంది. మున్నేరుకు పెద్ద ఎత్తున వరద వచ్చిన సమయంలో పాత బ్రిడ్జిపై రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేస్తున్నారు. దీంతో బైపాస్​ రోడ్డులో ఉన్న బ్రిడ్జిపై ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఈ బ్రిడ్జి కంప్లీట్ అయితే ట్రాఫిక్​ సమస్యలకు పరిష్కారం లభించనుంది.