పర్మిషన్ ఒకటి .. కట్టేది మరోటి .. సెట్ బ్యాక్, సెల్లార్ పర్మిషన్స్ లేకుండానే యథేచ్ఛగా నిర్మాణాలు

  • నాలాలను ఆక్రమించి బిల్డింగ్ కట్టడాలు 
  • కాసులిస్తే ప్రభుత్వ స్థలంలో సైతం పర్మిషన్స్ 
  • టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్వాకం

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట మున్సిపాలిటీ లో అధికారులు పర్మిషన్స్ ఇచ్చి వదిలేస్తున్నారు. పర్మిషన్  పొందిన నిర్మాణాదారుడు అనుమతులకు విరుద్ధంగా సెల్లార్లు, అదనపు అంతస్తులతో చెలరేగిపోతున్నా అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఫిర్యాదు చేస్తే కేవలం నోటీసులతో సరిపెడుతున్నారే తప్ప.. చర్యలు తీసుకోవడం లేదు. ఇదే సమయంలో షోకాజ్‌‌ నోటీసులు అందుకున్న నిర్మాణదారుడు.. డబ్బులిస్తే చాలు అధికారులు అతడి జోలికి వెళ్లరు. అదేమని అడిగితే సరైన ఎన్‌‌ఫోర్స్‌‌ మెంట్‌‌ లేదని స్థానిక టౌన్‌‌ ప్లానింగ్‌‌ అధికారులు చెబుతున్నారు.

రూల్స్ బేఖాతర్​..

సూర్యాపేట మున్సిపాలిటీలో ఒక అంతస్తుకు అనుమతి తీసుకొని రెండు, మూడు ఫ్లోర్లును నిర్మిస్తున్నారు. పెంట్ హౌస్ లేకున్నా నిర్మాణాలు చేపడుతున్నారు. ఓ సర్వే నంబర్​లో పర్మిషన్స్ తీసుకొని మరోచోట నిర్మాణాలు చేపడుతున్నారు. సెట్ బ్యాక్ ఎక్కడా వదలడం లేదు. ఇంటి నిర్మాణం పేరుతో పర్మిషన్స్ తీసుకొని కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నా పట్టించుకునే నాధుడే లేడు. మరోవైపు కొందరు ప్రభుత్వ స్థలాలు, నాలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.  

టౌన్ ప్లానింగ్ లో ఇష్టారాజ్యం..

టౌన్ ప్లానింగ్ విభాగంలో కాసులిస్తే ఎవరికైనా పర్మిషన్ ఇస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విభాగంలో పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పర్మిషన్స్ కోసం వస్తే అడిగినంత చేతిలో పెడితే చాలు.. ఎలాంటి రూల్స్ లేకున్నా నిర్మాణాలను అడ్డుకోరనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదులు చేసినా టాస్క్ ఫోర్స్ పేరు చెబుతూ ఆఫీసర్లను పక్కదారి పట్టిస్తున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో తాళ్లగడ్డలో జీ+2 పర్మిషన్ తీసుకొని ఏకంగా అపార్ట్ మెంట్ నిర్మిస్తున్నారు. అంతేకాకుండా బిల్డింగ్ పక్కనే నాలా ఉన్న దానిపై ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్నారు. 

ఈ ఇంటి పర్మిషన్ కోసం లక్షల్లో ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. విద్యానగర్ లోని శివాలయం ఎదురుగా ఒక్క అంతస్తుకే పర్మిషన్ తీసుకొని ఏకంగా మూడు ఫ్లోర్లను నిర్మిస్తున్నారు. గతంలో దీనిపై ఫిర్యాదు చేస్తే తాత్కాలికంగా పనులను నిలిపివేయగా వారం రోజుల తర్వాత యథావిధిగా నిర్మాణం పూర్తి చేశారు. మరోవైపు ఎస్పీ ఆఫీస్ కు చెందిన ప్రభుత్వ స్థలంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ముడుపులు తీసుకొని ఇంటి నిర్మాణానికి పర్మిషన్స్ ఇచ్చారు.  

మొదట్లో గుర్తించట్లే..

ఎన్​ఫోర్స్​మెంట్​ఆఫీసర్లు మొదట్లోనే అక్రమ నిర్మాణాలను గుర్తిస్తే కూల్చివేతల వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. రహదారి విస్తీర్ణం, భవనం స్థాయి ఆధారంగా సెట్ బ్యాక్ లు, పార్కింగ్ స్థలం కేటాయిస్తున్నారా.. లేదా అనే వాటిని నిర్మాణ దశలోనే గుర్తించాలి. ఫుట్ పాత్, ప్రభుత్వ స్థలాలు, కాల్వలు, శిఖం భూముల్లో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు అందిన వెంటనే అడ్డుకోవాలి. బిల్డింగ్ పర్మిషన్ ప్రకారం నిర్మాణాలు చేస్తున్నారా.. లేదా అని పరిశీలించాలి. పార్కులకు కేటాయించిన స్థలాలను వాటికే ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి. ఇలా చేస్తే అక్రమ నిర్మాణాలను అరికట్టే అవకాశం ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.  

అక్రమ నిర్మాణాలపై చర్యలు..

సూర్యాపేట మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకుంటాం. ఇటీవల ప్రభుత్వ స్థలంలో ఇచ్చిన ఇంటి నిర్మాణ పర్మిషన్ రద్దు చేశాం. ఎప్పటికప్పుడు మున్సిపాలిటీలో తనిఖీలు చేపట్టి అక్రమ నిర్మాణాలు లేకుండా చర్యలు తీసుకుంటాం.

శశికాంత్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, సూర్యాపేట